Manipur: మణిపూర్‌లోకి అక్రమంగా వస్తున్న మయన్మార్ వాసులు.. మరింత ముప్పు పొంచి ఉందా..?
అస్సాం రైఫిల్స్ సెక్టార్ 28 తెలిపిన వివరాల ప్రకారం.. ఆది, సోమ వారాల్లోనే 718 మంది మయన్మార్ వాసులు మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారు. ఖంపట్‌లో ఘర్షణల వల్ల వీరు రాష్ట్రంలోకి ప్రవేశించారని తెలిపింది.
Manipur: ఇప్పటికే ఆందోళనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లోకి మయన్మార్ వాసులు అక్రమంగా చొరబడుతున్నారు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వానికి, దేశ భద్రతకు పెను సవాలుగా మారనుంది. రెండు రోజుల్లోనే వందల మంది దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు స్తానిక అధికారులు తెలిపారు. అస్సాం రైఫిల్స్ సెక్టార్ 28 తెలిపిన వివరాల ప్రకారం.. ఆది, సోమ వారాల్లోనే 718 మంది మయన్మార్ వాసులు మణిపూర్‌లోని చందేల్ జిల్లాలోకి అక్రమంగా ప్రవేశించారు.
ఖంపట్‌లో ఘర్షణల వల్ల వీరు రాష్ట్రంలోకి ప్రవేశించారని తెలిపింది. వీరిలో 301 మంది చిన్నారులు, 208 మంది స్త్రీలు, 209 మంది పురుషులు ఉన్నారు. వీళ్లంతా అక్రమంగా ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. ఇలా మయన్మార్ పౌరులు సరిహద్దుగుండా అక్రమంగా మణిపూర్‌లోకి ప్రవేశిస్తుండటంపై కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. వందల సంఖ్యలోనే నిత్యం దేశంలోకి ప్రవేశిస్తున్నారు. వీరి వల్ల దేశ భద్రతకు మరింత ముప్పు పొంచి ఉంది. మణిపూర్ తెగల ప్రజల మధ్య వైరాన్ని వీళ్లు మరింతగా పెంచుతున్నారు. అందుకే అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ అస్సాం రైఫిల్స్ విభాగాన్ని ఆదేశించింది. వారిని తిరిగి మయన్మార్ పంపాలని సూచించింది. వీసా, సంబంధిత పత్రాలు లేకుండా ఎవరు కనిపించినా.. తిరిగి పంపించేస్తున్నారు. మయన్మార్ వాసుల అక్రమ వలస మణిపూర్‌లో ఆందోళనల్ని మరింత పెంచుతాయి.
తాజా అల్లర్లకు కారణమైన ఆయుధాలు మయన్మార్ నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఆయుధాలతోపాటు, డ్రగ్స్‌ను కూడా అక్కడి ముఠాలు మణిపూర్‌కు, అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితి హింసాత్మకంగా ఉన్న సమయంలో ఇతరులు ఎవరినీ మణిపూర్‌లోకి అనుమతించడం లేదు. అందుకే వలసదారుల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచించింది. మణిపూర్ ఘటనలో మయన్మార్ సహా విదేశీ శక్తుల హస్తం ఉన్నట్లు కేంద్ర వర్గాలు గుర్తించాయి. మయన్మార్ నుంచి మణిపుర్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను తాజాగా అధికారులు అరెస్టు చేశారు.