Mansoon: రుతుపవనాలు వచ్చేశాయోచ్.. ఇక చల్లచల్లని కూల్ కూల్
భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ఎంటర్ అయ్యాయ్. గురువారం ఇవి కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే ఏడు రోజులు ఆలస్యంగా రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం లక్షద్వీప్, కేరళ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల ఆగమన ప్రభావంతో కేరళలో గత 24గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్లు వివరించింది. రానున్న 48గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వివరించింది. గంటకు 19నాట్‌ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు చెప్పిన ఐఎండీ.. తొలివారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు అంచనా వేస్తోంది.
సాధారణంగా జూన్ ఒకటో తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాల్సి ఉండగా.. వాతావరణ మార్పులు, తుఫాన్ కదలికల కారణంగా వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయ్. గతేడాది మే 29న రాగా… 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న తీరాన్ని తాకాయి. ఈసారి సముద్రంపై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తున్నా… ఈ సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతమే నమోదవుతుందని వాతావరణ శాఖ ఏప్రిల్‌లో ప్రకటించింది. ఏమైనా మండుతున్న ఎండలతో.. ఉక్కపోతతో ఇన్నాళ్లు ఇబ్బంది పడిన జనాలకు.. గుడ్‌న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి పలకరింపు వేళ.. పులకరించేందుకు జనాలంతా ఎదుచూస్తున్నారు.