మనుబాకర్,గుకేశ్ లకు ఖేల్ రత్న, 30 మందికి అర్జున అవార్డులు

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు అందజేసే ప్రతిష్టాత్మక క్రీడాపురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ చూపిన షూటర్ మనుబాకర్ తో పాటు చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజులను ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2025 | 06:30 PMLast Updated on: Jan 02, 2025 | 6:30 PM

Manubakar Gukesh To Get Khel Ratna 30 Others To Get Arjuna Awards

అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే క్రీడాకారులకు అందజేసే ప్రతిష్టాత్మక క్రీడాపురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఒలింపిక్స్ లో అద్భుత ప్రతిభ చూపిన షూటర్ మనుబాకర్ తో పాటు చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజులను ఖేల్ రత్న పురస్కారానికి ఎంపిక చేసింది. వీరిద్దరితో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్, పురుషుల హాకీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా థ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం దక్కించుకున్నారు. 7 మంది పారా అథ్లెట్లుస‌హా 32 మందికి అర్జున అవార్డులు ద‌క్కాయి. పారిస్ ఒలింపిక్స్ లో మనుబాకర్ రెండు మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించింది. వ్యక్తిగత విభాగంతో పాటు మిక్సిడ్ ఈవెంట్ లోనూ మెడల్ కైవసం చేసుకుంది. 22 ఏళ్ల మను భాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో కాంస్య విజేత ప్రదర్శనతో ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలుచుకున్న తొలి ఇండియన్ అథ్లెట్‌గా నిలిచింది.

అయితే ఇటీవల ఖేల్ రత్నకు సిఫార్సు చేసిన అథ్లెట్ల జాబితాలో మను బాకర్ పేరు లేదని వార్తలు రావడం పెద్ద దుమారాన్నే రేపింది. మను తండ్రి రామ్ కిషన్, కోచ్ జస్పాల్ రాణా క్రీడాశాఖపై మండిపడ్డారు. ఆ స‌మ‌యంలో మ‌ను భాక‌ర్ తండ్రి రామ్ కిష‌న్ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌ను ను షూట‌ర్‌ని కాకుండా క్రికెట‌ర్‌ని చేసి ఉంటే బాగుండేద‌ని అన్నాడు. అప్పుడు అవార్డులు, ప్ర‌శంస‌లు అన్నీ వ‌చ్చేవంటూ వ్యాఖ్యానించారు.

ఒకానొక దశలో తాను క్రీడల్లో కుమార్తెను ప్రోత్సహించకుండా ఉండాల్సిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై పలువురు మాజీ క్రీడాకారులు, కాంగ్రెస్ నేతలు సైతం కేంద్ర క్రీడాశాఖ తీరును తప్పుపడుతూ విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచినా గుర్తింపు లేకపోవడం దారుణమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో తన తప్పు జరిగి ఉండవచ్చని మను భాకర్ పేర్కొంది.చివరికి ఖేల్ రత్న పురస్కారం ప్రకటించడంతో వివాదానికి తెరపడినట్టేనని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే భారత హాకీ జట్టు హర్మన్ ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యాడు. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోనే భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో వరుసగా రెండో కాంస్య పతకాన్ని సాధించింది. ఇక చదరంగంలో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేశ్ దొమ్మరాజును కూడా ఖేల్ రత్న పురస్కారం వరించింది. గుకేశ్ 18 ఏళ్ళకే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన అతిపిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. ఇక షూటర్లు స్వప్మిల్ సింగ్ , సర్బ్ జోత్ సింగ్ తో పాటు మరో 30 మందికి అర్జున పురస్కారాలు దక్కాయి. జనవరి 17న జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరందరికీ అవార్డులు అందజేయనున్నారు.