Meta User Charges: మెటాలో యూజర్ ఛార్జీల మంట..! వాట్సాప్‌కూ వసూలు చేస్తారా..?

ఇప్పుడు బ్లూటిక్ కు మాత్రమే యూజర్ ఛార్జీలు విధిస్తున్నారు. ముందుముందు యూజర్లందరికీ ఏదో ఒక వంకతో ఛార్జీలు వసూలు చేస్తారేమోననే భయం వెంటాడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 20, 2023 | 04:11 PMLast Updated on: Feb 20, 2023 | 4:11 PM

Mark Zuckerberg Announces Paid Blue Ticks For Facebook And Insta Users

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత అందులో చాలా మార్పులు చేస్తున్నారు. అంతకుముందు లేని యూజర్ ఛార్జీలను తెరపైకి తెచ్చాడు. ట్విట్టర్ ను పక్కా కమర్షియల్ గా మార్చేస్తున్నాడని ఎలాన్ మస్క్ ను అందరూ ఆడిపోసుకుంటున్నారు. కానీ మస్క్ మాత్రం బిజినెస్ మ్యాన్ బిజినెస్ మాత్రమే చేస్తాడని నిరూపించుకుంటున్నాడు. ఇప్పుడు మస్క్ బాటలోనే నడిచేందుకు మార్క్ జుకర్ బర్గ్ రెడీ అయ్యాడు. త్వరలోనే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లకు యూజర్ ఛార్జీలను విధించబోతున్నట్టు ప్రకటించాడు. అయితే ఇది ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వరకే ఆగుతుందా.. లేదంటే వాట్సాప్ కు కూడా విస్తరిస్తుందా.. అనే భయం ఇప్పుడు యూజర్లను వెంటాడుతోంది.

ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసిన తర్వాత విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో లేని ఎన్నో రూల్స్, రెగ్యులేషన్స్ అమలు చేస్తున్నారు. ట్విట్టర్ యూజర్లకు బ్లూటిక్ ఒక ప్రెస్టీజ్. చాలా మంది బ్లూటిక్ కోసం ఎంతో ట్రై చేస్తుంటారు. ఒకప్పుడు సెలబ్రిటీలకు మాత్రమే పరిమితం అయిన బ్లూటిక్ ఆ తర్వాత వివిధ రంగాల్లో నిష్ణాతులకు కూడా ఇచ్చింది ట్విట్టర్. ఇప్పటికీ బ్లూటిక్ కలిగి ఉండడాన్ని గర్వంగా భావిస్తుంటారు. అయితే ఇలాంటి వారందరికీ ఎలాన్ మస్క్ షాక్ ఇచ్చారు. బ్లూటిక్ యూజర్లు ఇకపై నెలవారీ యూజర్ ఛార్జీలు చెల్లించాలని రూల్ పెట్టారు. ఇది ఒక్కో దేశంలో ఒక్కో విధంగా అమలు కానుంది. భారత్ లో బ్లూటిక్ యూజర్లు ఒక్కొక్కరు నెలకు 900 రూపాయలు చెల్లించాలని ట్విట్టర్ వెల్లడించింది.

facebook and instagram

facebook and instagram

ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు తప్పుబట్టారు. ట్విట్టర్ ను మస్క్ కమర్షియల్ బాట పట్టిస్తున్నారని విమర్శించారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు వేదికైన ట్విట్టర్ ను కమర్షియల్ కోణంలో చూడడంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ట్విట్టర్లోనే మస్క్ కు వ్యతిరేకంగా ట్వీట్లు ట్రెండ్ అయ్యాయి. బాయ్ కాట్ ట్విట్టర్ హ్యాష ట్యాగ్ కొన్ని నెలలపాటు ట్రెండింగ్ లో ఉండింది. అయినా మస్క్ ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ట్విట్టర్ ను భారీస్థాయిలో సంస్కరించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆఫీసులను క్లోజ్ చేశారు. పనిలేక ఖాళీగా ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపించారు. ఖర్చులు తగ్గించుకుంటేనే ట్విట్టర్ మనుగడ సాధ్యమని స్పష్టం చేశారు. అందుకే యూజర్ ఛార్జీలు విధించాల్సి వస్తోందని సమర్థించుకున్నారు.

ఎలాన్ మస్క్ బాటలోనే పయనించేందుకు మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ సిద్ధమయ్యారు. మెటా గ్రూపులో ప్రస్తుతం ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాంలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇవి టాప్ నెట్ వర్కింగ్ సైట్స్. కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. రోజులో ఒక్కసారైనా ఈ సైట్లను ఓపెన్ చేయకుండా నిద్రపోని యూజర్లు ఉన్నారంటే వీటి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఈ డిమాండ్ నే సొమ్ము చేసుకునేందుకు జుకర్ బర్గ్ సిద్ధమయ్యారు.

ఇన్నాళ్లూ ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ కు యూజర్ ఛార్జీలు లేవు. జస్ట్ సైన్ ఇన్ అయి వాడుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎవరితో అయినా సంభాషించుకోవచ్చు. నెట్ వర్క్ పెంచుకోవచ్చు. వీటిలో కూడా సెలబ్రిటీలకు బ్లూటిక్ ఇస్తున్నారు. వీటిని చాలా మంది సొసైటీలో తమకు దక్కిన గౌరవంగా భావిస్తుంటారు. ఇప్పుడు ఇలాంటి వాళ్లందరి నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలని మార్క్ జుకర్ బర్గ్ నిర్ణయించారు. ముందుగా ఈ నిర్ణయం ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ లో అమలు చేయబోతున్నట్టు చెప్పారు జుకర్ బర్గ్.

whatsapp

whatsapp

మస్క్ బాటలోనే జుకర్ బర్గ్ కూడా పయనిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది మంచి పరిణామం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మీడియా నోరు మూగబోయినప్పుడు ఇలాంటి వేదికలే ప్రజాభిప్రాయానికి పట్టం కడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి యూజర్ ఛార్జీలు విధించి గొంతు నొక్కేస్తారేమోననే భయం అందరిని వెంటాడుతోంది. ఇప్పుడు బ్లూటిక్ కు మాత్రమే యూజర్ ఛార్జీలు విధిస్తున్నారు. ముందుముందు యూజర్లందరికీ ఏదో ఒక వంకతో ఛార్జీలు వసూలు చేస్తారేమోననే భయం వెంటాడుతోంది.

ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సిస్టర్ సంస్థే వాట్సాప్ కూడా. త్వరలో వాట్సాప్ కు కూడా యూజర్ ఛార్జీలు విధిస్తారేమోననే ఆందోళన మొదలైంది. ఫేస్ బుక్, ఇన్ స్టా లేకపోయినా కొందరు ఉండగలరు. కానీ వాట్సాప్ ఇప్పుడు నిత్యావసర వస్తువైపోయింది. స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ వాట్సాప్ ఉండి తీరాల్సిందే. అలా తయారైంది పరిస్థితి. వాట్సాప్ కు జనమంతా బానిసలైపోయారు. అదొక వ్యసనంగా మారిపోయింది. ఈ వ్యసనం నుంచి బయటకు రావడం అంత ఈజీ కాదు. ఇన్నాళ్లూ అలవాటు చేసి ఇప్పుడు ఒక్కసారిగా దాని నుంచి బయటపడడం ఎవ్వరివల్లా కాదు. ఒకవేళ దీన్ని అవకాశంగా తీసుకుని జకర్ బర్గ్ వాట్సాప్ కు కూడా యూజర్ ఛార్జీలను విధిస్తే మాత్రం పరిస్థితి మరో ఉంటుంది. మరి చూడాలి ముందుముందు ఏం జరుగుతుందో..!