అరంగేట్రం అదిరింది మయాంక్ పై ప్రశంసలు

గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో భారత జట్టు అదరగొట్టింది. పూర్తిగా కుర్రాళ్ళతో బరిలోకి దిగిన టీమిండియా బంగ్లాను చిత్తు చేసింది. మొదట బౌలింగ్, తర్వాత బ్యాటింగ్ తో పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 7, 2024 | 01:57 PMLast Updated on: Oct 07, 2024 | 1:57 PM

Mayank Yadav Good Bowling In 1st T20

గ్వాలియర్ వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీలో భారత జట్టు అదరగొట్టింది. పూర్తిగా కుర్రాళ్ళతో బరిలోకి దిగిన టీమిండియా బంగ్లాను చిత్తు చేసింది. మొదట బౌలింగ్, తర్వాత బ్యాటింగ్ తో పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. కాగా ఈ మ్యాచ్ తో ఇద్దరు భారత క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టారు. ఢిల్లీకి చెందిన మయాంక్‌ యాదవ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి భారత్‌ తరఫున టీ ట్వంటీ అరంగేట్రం చేశారు. మ్యాచ్‌కు ముందు భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ చేతుల మీదుగా నితీశ్‌… టీమిండియా మాజీ స్పిన్నర్‌ మురళీ కార్తీక్‌ చేతుల మీదుగా మయాంక్‌ క్యాప్‌లు అందుకున్నారు.

విశాఖకు చెందిన 21 ఏళ్ల నితీశ్‌ రెడ్డి గత ఐపీఎల్ సీజన్ లో ఆకట్టుకున్నాడు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైనా… చివరి నిమిషంలో గాయం కారణంగా దూరమయ్యాడు. నితీశ్‌ 20 టి20ల్లో 128.24 స్ట్రయిక్‌రేట్‌తో 395 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు టీమిండియా తరపున తొలి మ్యాచ్ ఆడిన నితీశ్ పర్వాలేదనిపించాడు. 2 ఓవర్లలో 17 రన్స్ ఇచ్చిన నితీశ్ కు తొలి వికెట్ దక్కలేదు. అయితే బ్యాటింగ్ లో మాత్రం హార్థిక్ తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆల్ రౌండర్ శివమ్ దూబే గాయంతో దూరమైన నేపథ్యంలో నితీశ్ కుమార్ కు తుది జట్టులో చోటు దక్కింది. అయితే మిగిలిన రెండు టీ ట్వంటీల్లో నితీశ్ ను కొనసాగిస్తారో లేదో చూడాలి. కుర్రాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలని కోచ్ గంభీర్ అనుకుంటే నితీశ్ బెంచ్ కే పరిమితమవ్వాల్సి రావొచ్చు.

మరోవైపు యువ పేసర్ మయాంక్ యాదవ్ మాత్రం దుమ్మురేపాడు. తన వేగంతో ఐపీఎల్ లో అందరినీ ఆకట్టుకున్న మయాంక్ తక్కువ సమయంలోనే అంతర్జాతీయ క్రికెట్ లోకు అడుగుపెట్టాడు. 22 ఏళ్ల మయాంక్‌ కూడా లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు తరఫున ఐపీఎల్‌ 2024 సీజన్‌లో తన ఎక్స్‌ప్రెస్‌ బౌలింగ్‌తో చెలరేగాడు. 150 కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్‌ చేస్తూ వచ్చిన అతను పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఒకసారి 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. 14 టి20ల్లో 14.31 సగటుతో 19 వికెట్లు తీశాడు. ఇక తన అంతర్జాతీయ కెరీర్ ను మయాంక్ యాదవ్ మెయిడెన్ తో ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టీ20 అరంగేట్ర మ్యాచ్‌లో తొలి ఓవర్‌ను మెయిడెన్ చేసిన మూడో భారత బౌలర్‌గా ఈ ఢిల్లీ పేస్ సంచలనం రికార్డు సృష్టించాడు. గతంలో అజిత్ అగార్కర్, అర్ష్‌దీప్ సింగ్ ఈ ఘనత సాధించారు. అగార్కర్ 2006లో సౌతాఫ్రికాపైనా, అర్ష్‌దీప్ 2022లో ఇగ్లండ్‌పైనా ఈ అరుదైన ఫీట్ సాధించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 4 ఓవర్లు బౌలింగ్ చేసిన మయాంక్‌.. 21 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.