Non Veg In Hyderabad: నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. ఆదివారం మాంసం షాపులు బంద్..!
ఆదివారం నాడు జంట నగరాల పరిధిలోని అన్ని రకాల నాన్ వెజ్ షాపులు మూసివేయాలని, అమ్మకాలు నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం ఆ రోజు జైనుల ఆరాధ్య దైవం మహవీర్ జైన్ జయంతి కావడమే.
Non Veg In Hyderabad: తెల్లారితే ఆదివారం.. నచ్చిన నాన్‌వెజ్ వండుకుని.. లాగించేద్దాం అనుకుంటున్నారా. అయితే, ఈ ఆదివారం మీకోరిక తీరదు. ఎందుకంటే హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఏప్రిల్ 21, ఆదివారం నాడు మాంసం షాపులు మూసి ఉంటాయి. ఆ రోజు నాన్ వెజ్ అమ్మకాలు నిషిద్ధం. చికెన్, మటన్, చేపలు, బీఫ్ సహా అన్ని రకాల మాంసం విక్రయ షాపులు, కబేళాలు మూసి వేయాల్సిందే.
YS JAGAN-YS SHARMILA: జగన్ దగ్గర రూ.100 కోట్లు అప్పు తీసుకున్న షర్మిల.. ఇదే ఇద్దరినీ విడదీసిందా..?
ఎందుకంటే.. ఆదివారం నాడు జంట నగరాల పరిధిలోని అన్ని రకాల నాన్ వెజ్ షాపులు మూసివేయాలని, అమ్మకాలు నిలిపివేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. దీనికి కారణం ఆ రోజు జైనుల ఆరాధ్య దైవం మహవీర్ జైన్ జయంతి కావడమే. మహవీర్ జైన్ చెప్పిన సిద్ధాంత ప్రకారం జీవ హింస మహాపాపం. జైనులు ఎవరూ మాంసం తినరు. పాలు సహా డైరీ ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటారు. అందువల్ల మహావీర్ జయంతిని పురస్కరించుకుని, ఆ మత విశ్వాసాల్ని గౌరవిస్తూ.. జీవహింసకు దూరంగా ఉండాలని హైదరాబాద్ పరిధిలో ఆదివారం మాంసం విక్రయాల్ని పూర్తిగా నిలిపివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘించి షాపులు తెరిచి, మాంసం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రొనాల్డ్ రాస్ హెచ్చరించారు.
సోమవారం తిరిగి యథావిధిగా షాపులు తెరచుకోవచ్చునని తెలిపారు. దీని ప్రకారం.. ఈ రోజు ఎలాంటి జంతువులను వధించకూడదు. మాంసం విక్రయించే షాపులతోపాటు కబేళాలు మూసి వేయాలి. హైదరాబాద్‌లో జైనుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వాళ్లు ఆదివారం రోజు ఘనంగా జయంతిని నిర్వహిస్తారు. వారి గౌరవార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఈ ఆదేశాలు జంట నగరాల పరిధిలో మాత్రమే వర్తిస్తాయి. తెలంగాణ మొత్తం కాదు.