House Work: ఇంటిపని ఎగ్గొడితే మగాళ్ల తోలు వలుస్తారు.. ఐడియా బాగుంది. మన దేశంలో కూడా పెడితే..?
ఇంటి పని చేయడానికి ఎందుకు అంతగా నీలుగుతావ్..! ఆ మాత్రం చేయలేవా..! నేను ఆఫీసులో ఎంత కష్టపడతానో తెలుసా..? ఇంటికొచ్చాక కూడా అది తీసుకురా..ఇది తీసుకురా అంటూ పోరు పెట్టమాకు.. నా వల్ల కాదు..అయినా ఇంటి పని వంట పని అంతా ఆడవాళ్లదే.. సంపాదించడం మాత్రమే మా పని..ఇదీ సగటు మగాడి మనస్తత్వం.
మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా..మగాడు ఇలానే ఆలోచిస్తాడు. పని ఏదైనా పనే.. మనం కూడా ఓ చేయి వేద్దాం.. ఇంటి పని షేర్ చేసుకుందాం.. పని విభజన చేసుకుని ఇంట్లో ఆడవాళ్లపై భారం తగ్గిద్దామనుకునే మహానుభావులు చాలా తక్కువ. వాస్తవానికి ఆడవాళ్లు ఇంట్లో చేసే చాకిరికి విలువే లేదు. ఎందుకంటే ఈ సమాజం దానికి అసలు విలువ కట్టదు. అది వాళ్ల బాధ్యత అన్న ముద్రవేసి అడ్డమైన పనులు చేయిస్తూ ఉంటుంది. ఇక మనదేశంలో సగటు మహిళలు.. నోరు తెరచి అడగను కూడా అడగరు. ఇల్లు శుభ్రం చేయడం , అంట్లు తేమడం, బట్టలు ఉతకడం, వంటలు వండి వార్చడం ఒక్కటేంటి.. ఈ పనులన్నీంటికీ విలువ కట్టి కనీస వేతనాన్ని చెల్లిస్తే.. మగవాళ్లు బయటెళ్లి సంపాదించేదానికంటే ఎక్కువే ఉంటుంది.
మగాళ్లు చేసే ఇంటి పనిపై నిఘా
సంసారం ఓ చదరంగం అనుకుంటూ అన్నీ తామే చేసుకుంటూ మనదేశపు ఆడవాళ్లు సర్దుకుపోతారేమో గానీ.. కొన్ని దేశాల్లో మహిళాలోకం ఈ వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. పని చేయడానికి ఆడామగా తేడా ఏంటి అందరూ అన్ని పనులు చేయాల్సిందే.. బాధ్యతలు పంచుకోవాల్సిందే.. కొన్ని దేశాల ప్రభుత్వాలు ఇలా కూడా ఆలోచిస్తున్నాయి. అందులో యూరోపియన్ కంట్రీ స్పెయిన్ ముందు వరసలో ఉంది. ఇంటి పనులు ఎగబెట్టి.. భారమంతా ఆడవాళ్ల పై వేసే మగమహారాజులకు షాక్ ఇస్తూ స్పెయిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
ఇంటిపని షేరింగ్ కోసం స్పెషల్ యాప్
వినడానికి విచిత్రంగా , కొత్తగా ఉన్నా స్పెయిన్ లో ఇది త్వరలో అమలులోకి రాబోతోంది. ప్రతి ఇంట్లోనూ ఎవరు ఎంత పనిచేస్తున్నారు..పని విభజన ఎలా జరుగుతుంది.. భారమంతా ఆడవాళ్లమీదే పడుతుందా..లేక ఆ ఇంట్లో మగవాళ్లు కూడా సమానంగా పనిని పంచుకుంటున్నారా అనే విషయాలను నమోదు చేయడానికి మానిటర్ చేయడానికి స్పెయిన్ ప్రభుత్వం యాప్ ను డిజైన్ చేసింది. నేను ఆఫీసుకు వెళ్తున్నాను.. నువ్వాపని చేసుకో అని ఇంట్లో వాళ్లపై నెట్టేయడం కుదరదే కుదరదు.. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మంది పనిని సమానంగా విభజించుకోవాల్సిందే. ఏ మాత్రం తేడా వచ్చినా యాప్ ప్రభుత్వానికి సమాచారం ఇస్తుంది. ఇంట్లో పని విభజన ఏ స్థాయిలో జరిగింది.. ఆడా మగా అన్న తేడా లేకుండా ఎవరు ఎన్ని గంటలు పనిచేశారు అన్నది ఎప్పటికప్పుడు యాప్ లో నమోదవుతూ ఉంటుంది.
పని విభజన అంత సీరియస్ వ్యవహారమా ?
కచ్చితంగా సీరియస్ వ్యవహారమే. స్పెయిన్ వ్యాప్తంగా ప్రభుత్వం సర్వే చేయిస్తే.. 50శాతానికి మించిన మహిళలు.. ఇంటి పనులను విషయంలో ఫిర్యాదు చేశారు. భారమంతా తమపైనే పడుతుందని.. ఇంట్లో మగవాళ్లు వర్క్ షేర్ చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 15 శాతం మంది మగవాళ్లు మాత్రమే ఇంటిపనిలో సాయం చేస్తున్నట్టు మహిళలు చెప్పుకొచ్చారు. పైగా మగవాళ్ల తీరు పెత్తనం ఎక్కువ..పని తక్కువ అన్నట్టు ఉండటంతో వివాహ బంధాలు కూడా తెగతెంపులు వరకు వస్తున్నాయి. స్పెయిన్ లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మగాళ్లు ఇంటి పని చేయని కారణంగా విడాకులు కోరుతున్న మహిళలు.. కోర్టుల్లో కేసులు వేసి భారీగా భరణాన్ని కూడా డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఓ కేసులో భార్య చేసిన ఇంటి పనికి గానూ 25 వేల డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంటి పనిని షేర్ చేసుకోవడానికి ఇష్టపడని మగవాళ్లతో కాపురం చేసేందుకు ఈ జనరేషన్ మహిళలు సిద్ధంగా లేరన్న విషయం అర్థమవుతుంది. తాము చేసే పనికి విలువ లేనప్పుడు తమతో ఉండటం ఎందుకంటూ మగవాళ్లను ఇళ్ల నుంచి గెంటేస్తున్నారు. దీంతో పని సమానత్వాన్ని సాధించే దిశగా స్పెయిన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెయిల్ డామినేషన్ మొదలైనప్పటి నుంచి ఉన్న ఈ సమస్యకు టెక్నాలజీ ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేస్తోంది. మగవాళ్లు ఇంటి పని ఎగ్గొట్టారని తెలిస్తే వాళ్లకు ముందు కౌన్సిలింగ్…ఆ తర్వాత చర్యలు తీసుకునే దిశగా స్పెయిన్ ఆలోచిస్తోంది.
మిగతా దేశాల్లో పరిస్థితేంటి ?
ఇంటి పని విషయంలో మగవాళ్లు బాధ్యతగా వ్యవహరించకపోవడం ఒక విషయమైతే.. ఆడవాళ్లు చేస్తున్న డొమెస్టిక్ వర్క్ కు విలువ లేకపోవడం మరో సమస్య. కేవలం ఇది స్పెయిన్‌కు మాత్రమే పరిమితమైన సమస్య కాదు. ఇటలీ, కొరియా, జపాన్ దేశాల్లో చాలా ఎక్కువ. ఇక మన దేశం సంగతి సరేసరి. చేస్తున్న పనికి ప్రతిఫలం దక్కని పనులను మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా చేస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ప్రతి రోజూ సగటున మహిళలు ఇంటి పనుల కోసం 265 నిమిషాలు కేటాయిస్తుంటే.. పురుషులు మాత్రం కేవలం 83 నిమిషాలు మాత్రమే కేటాయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు బాధ్యతల పేరుతో 76 శాతానికి పైగా ఇంటి పనులు ఎలాంటి ప్రతిఫలం అందకుండా చేస్తుంటే..మగవాళ్లు మాత్రం 24 శాతానికి మించి పని చేయడం లేదు. స్వీడన్, డెన్మార్క్, కెడనా, ఫిన్‌లాండ్, నార్వే లాంటి దేశాల్లో ఇంటి పనిని షేర్ చేసుకునే విషయంలో స్త్రీ పురుషుల మధ్య పెద్దగా తేడాలు ఏమీ కనిపించడం లేదు. అంటే ఈ దేశాల్లో పురుషులు ఇంటి పని చేయడం ఆడవాళ్ల బాధ్యత అంటూ తప్పించుకు తిరగడం లేదు. ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా.. ఇంట్లో స్త్రీలకు సాయం చేస్తూ పనిని పంచుకుంటున్నారు.
మరి మనదేశంలో పరిస్థితేంటి ?
సంప్రదాయాలు, కట్టుబాట్లకు విలువనిచ్చే మనదేశంలో ఇప్పటికీ మెజార్టీ ఇంటి పనులు ఆడవాళ్ల చేతుల మీదుగానే జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో డొమెస్టిక్ వర్క్ షేర్ చేసుకుంటున్న మగవాళ్లు భూతద్ధం వేసి వెతికినా దొరకరు.
మనదేశంలోనే కాదు.. జపాన్ , మెక్సీకో, టర్కీ, పోర్చుగల్ లో కూడా ఇదే పరిస్థితి. మనదేశంలో మహిళలు పురుషుల కంటే ఐదు గంటలు ఎక్కువగా ఇంటి పనుల కోసం కేటాయిస్తున్నారు. సంవత్సరానికి మనదేశంలో మహిళులు కనీసం 1800 గంటలను ఇంటి పనుల కోసం కేటాయిస్తున్నారు. దీనికి అర్థరూపాయి కూడా ప్రతిఫలం దక్కకపోవడం విషాదం.
ఇల్లును చక్కపెట్టేందుకు ఆడవాళ్లు ఖర్చుచేస్తున్న ఈ పనిగంటలకు ఎలాంటి విలువ లేకుండా పోయింది. ఈ పని గంటలను ఆర్థిక వ్యవస్థ గుర్తించదు. దేశ స్థూల జాతీయోత్పత్తికి వీటితో సంబంధం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలు చేస్తున్న ఇంటి పనికి కనీస విలువ కడితే అది నగదు రూపంలో 11 ట్రిలియన్ డాలర్లకు సమానమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 పెద్ద కంపెనీలు కలిసికట్టుగా సంపాదించిన ఇంత రాదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఉద్యోగాల రూపంలో మహిళలు వాళ్ల భాగస్వాముల కంటే ఎక్కువ సంపాదిస్తున్నా.. వాళ్ల ఇంటి పనిలో మాత్రం ఏమాత్రం తేడా ఉండటం లేదు.
ఇంటి పని అంటే ఎందుకంత చులకన ?
అంట్లు తోమడం, బట్టలు ఉతకడం నుంచి..పిల్లలను సాకటం వరకు తరతరాలుగా మహిళలపైనే భారం పడుతోంది. స్త్రీలు ఇంట్లో ఉండి పని చేయాలి.. మగాళ్లు బయటకెళ్లి సంపాదించాలి అనే సోకాల్డ్ ఫార్ములాకు సమాజం అలవాటు పడిపోయింది. కుటుంబ వ్యవస్థలో కావొచ్చు.. వివాహ బంధంలో కావొచ్చు.. ఈక్వాలిటీ అన్న మాటకు అర్థం లేకుండా పోయింది. అందుకే ఉదయం లేచింది మొదలు..రాత్రి నిద్రపోయే వరకు గొడ్డు చాకిరీ చేసినా.. ఆ పెద్ద కష్టపడ్డావులే అన్న మాటతో తీసిపడేసే అలవాట్లు మనవి. ఇంటి పని అంటే కేవలం శరీరాన్ని కష్టపెట్టడమే కాదు.. మానసికంగా కూడా వాళ్లు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎన్నో మానసిక సమస్యలకు దారి తీస్తుంది. చివరకు బంధాలు విచ్ఛిన్నమయ్యే వరకు వెళ్తుంది. అందుకే స్పెయిన్ ఓ అడుగు ముందుకేసి..డొమెస్టిక్ వర్క్ ఈక్వాలిటీ దిశగా అడుగులు వేస్తుంది. ఈ విషయంలో స్పెయిన్ నుంచి మనలాంటి దేశాలు కాస్తైనా నేర్చుకోవాలి. మహిళలు చేసే ఇంటి పనికి ఖరీదు కట్టకపోయినా.. మేమున్నామంటూ మగవాళ్లు కూడా కాస్త సాయం చేస్తే.. అంతకంటే వాళ్లు కోరుకునేది ఏమీ ఉండదు.