Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత.. రాబోయే 5రోజులు జాగ్రత్త..
నైరుతి బంగాళాఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయ్.

Meteorological department officials said that heavy rains will occur in Telangana and Andhra Pradesh in the next five days
రాబోయే రోజుల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయ్. ఈ ప్రభావంతో.. ఈ నెల 13 వరకు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అకాశాలు ఉన్నాయ్. తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక అటు ఏపీని కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే చాన్స్ ఉంది. ఏపీతో పాటు యానంలోనూ వర్షాలు కురవనున్నాయ్. ఉత్తర కోస్తా, యానంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రదేశాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని ఐఎండీ అధికారులు సూచించారు. రాయలసీమలోనూ రానున్న మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షంతో పాటూ పిడుగులు పడే అవకాశాలు ఉంటాయని.. రానున్న ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.