Ayodhya Surya Tilak : అయోధ్యలో అద్భుత ఘట్టం… బాలరాముడికి సూర్య తిలకం ! ఎలా సాధ్యమైందంటే …
అయోధ్యలో ఇవాళ ఓ అద్భుత ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. రామాలయం నిర్మాణం జరిగిన తరువాత మొదటి శ్రీరామ నవమి వేడుకలను అయోధ్యలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాల రాముడికి అలంకరణ, మహా హారతి లాంటి కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం సమయంలో బాల రాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని దిద్దిన ఘట్టం చూసి భక్తులు మైమరిచిపోయారు.
అయోధ్యలో ఇవాళ ఓ అద్భుత ఘట్టం భక్తులకు కనువిందు చేసింది. రామాలయం నిర్మాణం జరిగిన తరువాత మొదటి శ్రీరామ నవమి వేడుకలను అయోధ్యలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి బాల రాముడికి అలంకరణ, మహా హారతి లాంటి కార్యక్రమాలతో పాటు మధ్యాహ్నం సమయంలో బాల రాముడి నుదిటిపై సూర్య తిలకాన్ని దిద్దిన ఘట్టం చూసి భక్తులు మైమరిచిపోయారు.
అయోధ్య రామమందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా బాల రాముడి నుదుటిపై సూర్యతిలకం దర్శనమిచ్చింది. సూర్య కిరణాలు మూలవిరాట్‌ని తాకేలా రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాట్లు చేసింది. దాదాపు 4 నిమిషాల పాటు ఈ తిలకం భక్తులకు కనువిందు చేసింది. అయోధ్య ఆలయం ప్రతిష్టాపన తర్వాత జరిగిన మొదటి శ్రీరామనవమి వేడుకలు కావడంతో ఈ అరుదైన దృశ్యాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది శ్రీరామనవమికి సూర్య తిలక దర్శనం ఉంటుందని మొదట ప్రకటించారు. కానీ తర్వాత ఈ ఏడాదే ఏర్పాటు చేశారు. 58 మిల్లీ మీటర్ల పరిమాణంలో సూర్య కిరణాలు బాల రాముడి నుదుటిపై ప్రసరించాయి. ఆ సమయంలో ఆలయ పరిసరాలు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి.
సూర్య తిలకం ఎలా సాధ్యమైంది..?
బాలరాముడి నుదిటిపై సూర్యతిలకం దిద్దడం వెనుక చాలా శ్రమ ఉంది. 10 మంది శాస్త్రవేత్తలు కలసి ఈ సూర్య తిలకం దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అందుకోసం అద్దాలు, లెన్స్‌లు ఉపయోగించారు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో నుదిటిపై కిరణాలు పడేందుకు చాలా కష్టపడ్డారు. ఈ ప్రక్రియకి సూర్య తిలక్ మెకానిజం (Surya Tilak Mechanism) అని పేరు కూడా పెట్టారు. opto-mechanical system ద్వారా ఈ ఘట్టం సాధ్యమైందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
పైప్స్ లో నాలుగు అద్దాలు, నాలుగు లెన్స్ అమర్చారు. వాటిని వాలుగా (Tilt System) ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సిస్టమ్‌ని ఆలయంపై అమర్చారు. సూర్య కిరణాలు పైన అద్దాల్లో పడి అవి నేరుగా బాల రాముడి నుదుటిపై పడేలా ఏర్పాట్లు చేశారు. బాల రాముడి ముఖం తూర్పు వైపు ఉంటుంది. అయితే…ఆలయ శిఖరాన ఏర్పాటు చేసిన మొదటి అద్దాన్ని జరుపుకునే అవకాశం ఉంది. ఇదే టిల్ట్ సిస్టమ్. ఆ అద్దం మీదుగా సూర్యకిరణాలు ఉత్తర దిశగా ప్రసరిస్తాయి. ఇక చివరిగా ఉన్న అద్దం, లెన్స్ ఈ సూర్య కిరణాలను గ్రహించి సరిగ్గా రాముడి నుదుటిపై పడేలా చేశాయి. ఇందులోని పైప్‌లు ఎక్కువ రోజుల పాటు మన్నికగా ఉండేలా ఇత్తడితో తయారు చేశారు. మూడో అంతస్తు నుంచి గర్భాలయంలోని రాముడి విగ్రహంపై పడేలా ఇలా ప్రత్యేకంగా ఓ వ్యవస్థని క్రియేట్ చేశారు సైంటిస్టులు. బెంగళూరుకి చెందిన ఓ కంపెనీ దీనికి సంబంధించి టెక్నికల్ సపోర్ట్ అందించింది. ప్రతి రామనవమికి ఇలా సూర్య తిలకం దర్శనాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ అధికారులు ఏర్పాటు చేయబోతున్నారు.