Rajaiah: బీఆర్ఎస్‌కు భారీ షాక్ ఇవ్వబోతున్న రాజయ్య!
బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అన్ని పార్టీలు దూకుడు పెంచాయ్. ఢీ అంటే ఢీ అంటున్నాయ్. ఒకరికి మించి ఒకరు అన్నట్లుగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా.. కారు పార్టీలో ఫస్ట్ లిస్ట్ రేపిన అలజడి అంతా ఇంతా కాదు. ఒక్కొక్కటిగా అసంతృప్తులు బయటకు వస్తున్నారు. దీంతో గులాబీ పార్టీలో లుకలుకలు మొదలయ్యాయ్. కేసీఆర్ రిలీజ్ చేసిన ఫస్ట్ లిస్ట్‌లో కొందరు సిట్టింగ్‌లకు టికెట్ దక్కలేదు. దీంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టికెట్ కోల్పోయిన వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థులకు.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గాలం వేస్తున్నాయ్. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని వారిలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఒకరు. ఆయన కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు.
ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు లేకపోవడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. అంబేద్కర్ విగ్రహం ముందు బొర్లి మరీ దండాలు పెట్టారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద రాజయ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి ఆయన సమావేశాలు నిర్వహించారు. దీంతో రాజయ్య కాంగ్రెస్‌లో చేరుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ మఘధ్యే కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహతో ఆయన భేటీ అయ్యారు. హనుమకొండ నయీమ్ నగర్‌లోని ఓ హోటల్లో ఇద్దరు నేతలు కలిసినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని తాజా రాజకీయాల పరిస్థితులపై చర్చలు జరిపారు.
ఇదే సమయంలో పార్టీలో చేరిక, టికెట్‌పై మాట్లాడినట్లు టాక్. హన్మకొండలో దళిత మేధావుల సదస్సు నిర్వహించేందుకు దామోదర రాజనర్సింహ అక్కడకు వెళ్లారు. ఇదే సదస్సుకు ఎమ్మెల్యే రాజయ్య కూడా అటెండ్ అయ్యారు. కాంగ్రెస్ నేతతో రాజయ్య కలిసి మాట్లాడడంతో.. కాంగ్రెస్ చేరడం లాంఛనమేననే పుకార్లు వినిపిస్తున్నాయ్. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటూ రాజయ్య వర్గం నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్‌లో సీటు దక్కన ఆశావాహులంతా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్, బీజేపీ వైపు చూస్తున్నారు. ముహూర్తం చేసుకుని చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.