CM kcr: మోదీకి కేసీఆర్ ఆహ్వానం పలుకుతారా ? జూలై 8న ఏం జరగబోతోంది ?
తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మొదట్లో కనిపించిన యుద్ధం.. ఆ తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది. బీజేపీ.. ఒకప్పటి కాంగ్రెస్‌ను తలపిస్తోంది. పార్టీలో గ్రూప్ తగాదాలు పెరిగిపోయాయ్. ఇలాంటి పరిణామాల మధ్య అధ్యక్షుడిని మారుస్తూ.. బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది.
కిషన్‌రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడం.. అదీ కేటీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం.. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సైలెంట్ కావడం.. ఈ పరిణామాలన్నింటితో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ నినాదం అందుకుంది. అటు కారు, ఇటు కమలం.. రెండు పార్టీల నేతలు దీన్ని కొట్టేస్తున్నా ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇలాంటి పరిణామాల మధ్య.. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. మరి ఇప్పుడు కేసీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే.. కొద్దిరోజులుగా మోదీని టార్గెట్ చేయడం మానేశారు కేసీఆర్. సాఫ్ట్‌కార్నర్‌తో ఉన్నట్లు కనిపిస్తున్నారు. దీంతో రెండు పార్టీలు ఒకటే అనే ప్రచారం మరింత ఊపందుకుంది.
ఇప్పుడు మోదీకి కేసీఆర్ స్వాగతం చెప్తారా.. ఈ నెల 8న వరంగల్‌లో జరగబోయే అధికారిక కార్యక్రమాల్లో మోదీతో కలిసి పాల్గొంటారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని అధికారిక కార్యక్రమాలకు హాజరుకావాలని.. ఇప్పటికే పీఎంవో నుంచి కేసీఆర్ ఆఫీస్‌కు ఆహ్వానం కూడా అందినట్లు తెలుస్తోంది. మోదీ వచ్చే సమయానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే తప్ప.. ప్రధాని కార్యక్రమాలకు కేసీఆర్ హాజరుకావడం దాదాపు ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా.. చాలా రోజుల తర్వాత తెలంగాణకు వస్తున్న మోదీ.. ఎలాంటి విషయాలు ప్రస్తావించబోతున్నారనే ఆసక్తి కనిపిస్తోంది. కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.