Emergency : కాంగ్రెస్‌ను రాజ్యాంగంతో కొట్టిన మోదీ.. సంవిధాన్ హత్య దివస్ వెనక వ్యూహం ఇదే!
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా.. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా అంటే.. రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించింది.
కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో విధించిన ఎమర్జెన్సీ రోజులకు నిరసనగా.. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా అంటే.. రాజ్యాంగ హత్య దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి నిరసనగా.. ఇకపై ఏటా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా నిర్వహించుకోవాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. 1975 జూన్ 25న ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ… దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఎమర్జెన్సీ కారణంగా రాజ్యాంగం హత్యకు గురైందన్న కేంద్రం.. జూన్ 25కు వ్యతిరేకంగా ఓ రోజును కేటాయించినట్లు తెలిపింది.
ఎమర్జెన్సీతో లక్షలాది మందిని అన్యాయంగా కటాకటాల్లోకి నెట్టారని.. అప్పటి ప్రధాని ఇందిరా నియంత పోకడలతోనే దేశంలో పరిస్థితులు ఎమర్జెన్సీకి దారి తీశాయని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. నిజానికి ఈ మధ్య ముగిసిన పార్లమెంట్ సమావేశాల్లోనూ ఎమర్జెన్సీ ప్రస్తావన వచ్చింది. ఎమర్జెన్సీ కారణంగా.. దేశంలో పౌరులు హక్కులు కోల్పోయారని ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లా విమర్శలు గుప్పించారు. ఐతే ప్రతిపక్ష కాంగ్రెస్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో లోక్‌సభ దద్దరిల్లింది. సభలో ఎమర్జెన్సీ టాపిక్‌ను ప్రస్తావించడానికి నిరసనగా… ప్రతిపక్షం సభను బైకాట్ చేసింది.
ఇలాంటి పరిస్థితుల మధ్య మోదీ సర్కార్.. ఏకంగా జూన్ 25ను సంవిధాన్ హత్యా దివాస్‌గా ప్రకటించడంపై కాంగ్రెస్ భగ్గుమంటోంది. ఇది మరో రాజకీయ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఐతే సంవిధాన్ హత్య దివస్‌ను ప్రకటించడం ద్వారా.. కాంగ్రెస్ ప్రశ్నలకు, విమర్శలకు కౌంటర్ ఇవ్వాలన్నది మోదీ సర్కార్ వ్యూహంగా కనిపిస్తోంది. పదేళ్ల బీజేపీ పాలనలో.. రాజ్యాంగం ఖూనీ అయిందంటూ.. కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడుదాం అంటూ.. రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా రాజ్యాంగం ప్రతులను క్యారీ చేస్తున్నారు.
ఎంపీగా ప్రమాణస్వీకారం సమయంలోనూ.. రాజ్యాంగ ప్రతును ఓ చేతిలో పట్టుకొని.. ఓత్ తీసుకున్నారు రాహుల్ గాంధీ. ఐతే కాంగ్రెస్ ఆరోపణలకు, విమర్శలకు.. ఒక్క ప్రకటనతో బీజేపీ ఆన్సర్ చెప్పిందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. రాజ్యాంగం నిజంగా హత్య అయింది తమ పాలనలో కాదు.. కాంగ్రెస్ పాలనలోనే అయిందని.. ఇందిరా నిర్ణయాలే కారణమని గుర్తు చేసేలా.. బీజేపీ నిర్ణయం కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది.