డబ్బే అతని కెరీర్ ను దెబ్బతీసింది, పృథ్వీషాపై ఢిల్లీ మాజీ కోచ్ వ్యాఖ్యలు

మన దేశంలో క్రికెటర్ గా సక్సెస్ అయితే ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఐపీఎల్ వచ్చిన తర్వాత జాతీయ జట్టుకు ఆడకుండానే చాలా మంది యువ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. యంగ్ స్టర్ గా ఉన్నప్పుడు వచ్చిన ఈ డబ్బు, లగ్జరీ లైఫ్ వాళ్ళను నేల మీద నిలవనివ్వదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2024 | 04:00 PMLast Updated on: Dec 01, 2024 | 4:00 PM

Money Ruined His Career Says Former Delhi Coach On Prithvi Shaw

మన దేశంలో క్రికెటర్ గా సక్సెస్ అయితే ఎంత లగ్జరీ లైఫ్ గడుపుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. ఐపీఎల్ వచ్చిన తర్వాత జాతీయ జట్టుకు ఆడకుండానే చాలా మంది యువ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతున్నారు. యంగ్ స్టర్ గా ఉన్నప్పుడు వచ్చిన ఈ డబ్బు, లగ్జరీ లైఫ్ వాళ్ళను నేల మీద నిలవనివ్వదు. ఈ పరిణామాలను జాగ్రత్తగా డీల్ చేసుకుంటే మంచి ప్లేయర్ గా ఎదుగుతారు.. కానీ ఒక్కసారిగా వచ్చిన డబ్బుతో గాలిలో తేలిపోతే మాత్రం కెరీర్ ముగించాల్సిందే.. గతంలో వినోద్ కాంబ్లీని ఇలాంటి పరిస్ఖితికి ఉదాహరణ. సచిన్ తో కలిసి స్కూల్ స్ఖాయిలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన కాంబ్లీ ఇండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ ఆటపై ఫోకస్ తగ్గి, అనవసర వ్యాపకాలపై ఆకర్షణ పెరిగి పతనమయ్యాడు. ముఖ్యంగా క్రమశిక్షణ లేకుంటే ఏ ఆటగాడూ కెరీర్ లో ఎదగలేడు. ప్రస్తుతం వినోద్ కాంబ్లీనే గుర్తుకు తెస్తున్న పృథ్వీషాపై పలువురు మాజీ క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో టాలెంట్ ఉన్న పృథ్వీ షాను ఇటీవల మెగావేలంలో ఏ ఫ్రాంచైజీ కొనలేదు. తాజాగా పృథ్వీషాపై ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కోచ్ ప్రవీణ్ ఆమ్రే కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా లాంటి టాలెంట్ ఉన్న ఆటగాడు చేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంటుండటం బాధ కలిగిస్తోందన్నాడు. ఇప్పటికీ అతడికి ఐపీఎల్‌లో 30 బంతుల్లో ఫిఫ్టీ కొట్టే సత్తా ఉందన్న ప్రవీణ్ ఆమ్రే… బహుశా చిన్న వయస్సులోనే తనకు వచ్చిన కీర్తీ, డబ్బును సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయుండొచ్చని అభిప్రాయపడ్డాడు. భారత క్రికెట్‌లో అతడి జీవితం ఒక కేస్ స్టడీగా నిలుస్తుందన్నాడు. ప్రతిభ ఒక్కటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లదనీ,. క్రమశిక్షణ, సంకల్పం, అంకితభావం ఉంటేనే కెరీర్ లో ముందుకు వెళ్లగలమన్నాడు. కాంబ్లీ పతనాన్ని తాను అతి దగ్గరగా చూసానని గుర్తు చేసుకున్నాడు.

ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బు, ఫేమ్ కారణంగానే పృథ్వీ షా కెరీర్ దెబ్బతిందన్నాడు. అతడు 23 ఏళ్ల వయస్సులోనే సుమారుగా 40 కోట్లు సంపాదించి ఉండవచ్చనీ, ఐఐఎమ్‌ గ్రాడ్యుయేట్‌ కూడా అంత సంపాదించరేమోనంటూ వ్యాఖ్యానించాడు. చిన్నవయస్సులో అంత మొత్తం సంపాందించినప్పుడు, కచ్చితంగా దృష్టి మళ్లే అవకాశముంటుందన్నాడు. సన్నిహితులు అతన్ని సరైన మార్గంలో నడిపించడంపై దృష్టి పెట్టకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైందని ప్రవీణ్ ఆమ్రే చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే మార్గనిర్గేశకత్వం చేసేవారి అవసరం ఉంటుందన్నాడు. అయితే ఈ ఐపీఎల్ వేలాన్ని గుణపాఠంగా తీసుకుని పృథ్వీ షా తన కెరీర్ లో మళ్ళీ పుంజుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం రంజీ జట్టుకు కూడా దూరమైన పృథ్వీ షా తన ఫిట్ నెస్ మరింత ఫోకస్ పెట్టి, క్రమశిక్షణగా నడుచుకుంటే క్రికెట్ కెరీర్ కొనసాగించే ఛాన్సుంది.