Rain Alert: సెప్టెంబర్ మొత్తం వానలే వానలు.. ఎందుకో తెలుసా..?
వర్షాలు కురిస్తే ఒక తంట.. కురవక పోతే ఎండలతో మంట. ఇలా తయారైంది ప్రస్తుత వాతావరణం పరిస్థితి. ఇది కేవలం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దక్షిణ భారతదేశం మొత్తం ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

Mansoon Effect Rain In South India From September
సాధారణంగా వర్షాకాలం అంటే ఆగస్ట్ అని టక్కున చెప్పేస్తారు. కానీ అలాంటి వాతావరణం ఈ నెలలో ఎక్కడా కనిపించలేదు. తెల్లారుగంట్లకే సూర్యుడు తన కిరణాలను భూమిపైకి ప్రసరింపజేస్తున్నాడు. జూలైలో విస్తారంగా కురిసిన వానలు ఆగస్ట్ వచ్చేసరికి ముఖం చాటేసినట్లు మేఘాలు చాటేశాయి. దీంతో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. గత వారం పదిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఎక్కువయ్యాయి. తీవ్రమైన ఉక్కపోతకు గురవుతున్నారు ప్రజలు. తాజాగా వాతావరణ శాఖ చల్లని కబురును తీసుకొచ్చింది. సెప్టెంబర్ లో విస్తారంగా వర్షాలు కురిసే ప్రభావం ఉందని వెల్లడించింది. దక్షిణ భారతదేశంలో వర్షాభావం సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం తాజాగా తెలిపింది.
చైనాకు రుతుపవనాల పయనం..
మనకు చుట్టూ అరేబియా, బంగాళాఖాతం వంటి పెద్ద సముద్రాల నుంచి అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కురుస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకూ ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడలేదని వెల్లడించింది ఐఎండీ. రుతుపవనాలు మనవైపు ప్రారంభమవ్వడమే ఆలస్యం అనుకంటే అవి కాస్త చైనా, జపాన్ వైపుకు పయనించాయి. దీంతో చైనాలో కూడా అకాల వర్షాలకు పంటలన్నీ నీటమునగడం కూడా గతంలో మనం చూశాం. అప్పుడప్పుడూ వాతావరణంలో జరిగే ఇలాంటి చర్యల వల్ల ఎల్ నినో ఏర్పడి వర్షాలు కరువయ్యాయి అని వివరించారు.
జులైలో వర్షాలు పడకపోవడానికి కారణం ఇదే..
సాధారణంగా రుతుపవన ద్రోణి ఆగస్టు ప్రారంభంలో హిమాలయాల వైపు తరలిపోతుంది. ఆతరువాత తిరిగి ఉత్తర భారతదేశం వైపుకు నెమ్మదిగా కదులుతూ వస్తుంది. ఇలా వచ్చే క్రమంలో మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొద్ది రోజులు స్థిరంగా కొనసాగుతుంది. దీనిప్రభావంతో మన దక్షిణాది ప్రాంతాలకు వర్షాలు పడే అవకాశం ఉండేది. కానీ ఇలా జరుగలేదు. హిమాలయాలుతో పాటూ ఉత్తర భారతదేశంలోనే ద్రోణి ఎక్కువ రోజులు కొనసాగింది. దీని ప్రభావంతోనే ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు ముంచెత్తాయి.
సెప్టెంబర్ మొత్తం వానలే..
హిమాలయాల్లో మూడు వారాలు తిష్టవేసిన ద్రోణి తాజాగా మన వైపుకు చురుకుగా కదలడం ప్రారంభించిందని వాతావరణ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ సారి మన దక్షిణ భారతదేశంతోపాటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తుందని చెబుతున్నారు. గతంలో రుతుపవన ద్రోణి కదలిక లేకపోవడం వల్ల నైరుతి రుతుపవనాలు బలహీనపడినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. అయితే రానున్న మూడు నాలుగు రోజుల్లో వర్షాలు తిరిగి ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో సమృద్దిగా వర్షలు కురుస్తాయని చెబుతున్నారు. ఏపీలో సాధారణం కంటే కూడా అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.
T.V.SRIKAR