Nara Lokesh: యువగళానికి ఇద్దరు కీలకనేతల గైహాజరు.. ఈ జిల్లాల్లో టీడీపీ భవిష్యత్తు ఏంటి..?

నారా లోకేష్ ఈ పేరు వినగానే చంద్రబాబు నాయుడు తనయుడు అని ముద్రవేసుకున్నారు. గత కొన్ని నెలలుగా యువగళం పేరుతో పాదయాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్ర గుంటూరు మీదుగా విజయవాడ చేరుకుంది. ఈ కార్యక్రమానికి ఇద్దరు ముఖ్య నేతలు దూరంగా ఉన్నారు. ఇదే ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 22, 2023 | 07:58 AMLast Updated on: Aug 22, 2023 | 7:58 AM

Mp Keshineni Nani And Galla Jayadev Did Not Attend The Naralokesh Youth Gala

యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమై నేటికి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని సీతానగరానికి చేరుకుంది. పాదయాత్ర 2500 కిలో మీటర్ల మైలురాయిని చేరుకోవడంతో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు లోకేష్. దీనికి సంబంధించి ఒక హామీని కూడా ఇచ్చారు ఆయన. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20వేల ఇళ్ల నిర్మాణం చేపడతామని పాదయాత్ర సాక్షిగా హామీ ఇచ్చినట్లు ఈ శిలా ఫలకం సారాంశం. ఇక ఈ హామీల విషయం కాసేపు పక్కన పెడితే.. నాయకుల పరిస్థితి ఏంటి అని కొందరి నుంచి వినిపిస్తున్న మాటలు. యువగళం పాదయాత్రకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇంఛార్జిలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తుతంటే ఈ ఇద్దరు మాత్రం దూరంగా ఉన్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అందులో ఒకరు కేశినేని నాని ఉండగా.. మరొకరు గల్లా జయదేవ్. ఈ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలే. కానీ ఇప్పుడు అంటకాగకుండా ఉండటంపై అందరి నోట ఇదే చర్చ మొదలైంది. లోకేష్ కి వీరికి మధ్య విభేదాలు ఉన్నాయని కొందరు చెవి కొరుక్కుంటున్నారు. 2014లోనే కాకుండా 2019 లో వైసీపీ జగన్ గాలి ఎక్కువగా వీచిన సమయంలోనూ ఈ ఇద్దరు నేతలు ఎంపీగా విజయం సాధించారు. గుంటూరు, విజయవాడలో మంచి పట్టున్న నాయకులు అనిపించుకున్నారు. అలాంటిది వీరే పార్టీ ముఖ్యకార్యక్రమాల్లో దూరంగా ఉండటంతో తెలుగుదేశంలో వర్గపోరు, ఆధిపత్యపోరు మొదలైందని చెప్పకతప్పడంలేదు.

కేసినేని నాని ఈమధ్య కాలంలో బాహాటంగానే తెలుగుదేశంపై తన అక్కస్సును వెళ్లగక్కారు. దీనికి కారణం తనకు కాదని తన సోదరుడు కేశినేని చిన్నికి చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే అదునుగా చిన్ని జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జులు అందరినీ తనవైపు ఆకర్షించుకున్నారు. ఇది నానికి మరింత మండింది. దీంతో తెలుగుదేశానికి గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో నేతల మధ్య ఉన్న వర్గపోరు, ఆధిపత్యపోరు, విభేదాలు బయటపడ్డాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక గల్లా జయదేవ్ విషయానికి వస్తే ఈయన పార్టీకి అత్యంత విధేయుడు. పైగా చంద్రబాబు, లోకేష్ తో ఎలాంటి విభేదాలు లేవు. అయినప్పటికీ యువగళం పాదయాత్రకి ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడం, లోకేష్ తో మమేకం అవ్వకపోవడం అసలు ఈ కార్యక్రమానికే దూరంగా ఉండటం అనేక అనుమానాలకు దారితీస్తుంది. రానున్న రోజుల్లో టీడీపీలో కొనసాగుతారా లేక వైసీపీలో చేరుతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచే వైసీపీ నాయకులు తీవ్రంగా విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాల్లో యాత్రకు అగ్రనేతలే హాజరు కాకపోవడం పై అట్టర్ ప్లాప్ యాత్ర అని భావించారు కనుకనే ఇద్దరు కీలక నాయకులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి విమర్శించారు. ఈయాత్ర ఈవినింగ్ వాక్ లా ఉందని, కిరాయి జనంతో యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. అసలే టీడీపీ గెలుచుకున్నది ముగ్గురు ఎంపీలు అందులో ఇద్దరు యువగళం పాదయాత్రకు దూరంగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు దీని ప్రభావం ప్రజల మీద సొంత పార్టీలో ఏమాత్రం ఉందో అని వ్యంగంగా స్పందించారు. ఈ ఇద్దరు పార్లమెంట్ సభ్యులు హాజరుకాకపోవడంతో ఈ రాజధాని జిల్లాల్లో టీడీపీ రాజకీయ భవిష్యత్తు రానున్న రోజుల్లో ఎలా ఉంటుదో అన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

T.V.SRIKAR