Tollywood: టాలీవుడ్‌లో మరో విషాదం
టాలీవుడ్‌ను విషాదాలు వెంటాడుతున్నాయ్. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. రాజ్ అని పేరు చెప్తే గుర్తుకు రాకపోవచ్చు కానీ.. రాజ్ - కోటి అంటే అందరూ గుర్తుపట్టేస్తారు. ఈ ద్వయం అంత ఫేమస్. కోటితో కలిసి చాలా సినిమాలకు రాజ్ మ్యూజిక్ అందించాడు.

Music director Raj Pass AwayMusic director Raj Pass Away
ప్రళయ గర్జన వీరిద్దరూ కలిసి పనిచేసిన మొదటి చిత్రం. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. యముడికి మొగుడు, లంకేశ్వరుడు, ముఠా మేస్త్రి, బాలగోపాలుడు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, అన్న-తమ్ముడు లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ సినిమాలు చేయలేదు.
రాజ్ సోలో మ్యూజిక్ అందించిన సినిమాల్లో.. సిసింద్రీ మూవీ ఒక్కటే కాస్త హిట్ అయిన సినిమా. నాగార్జున హీరోగా వచ్చిన రాముడొచ్చాడు సినిమాకు కూడా రాజ్ మ్యూజిక్ అందించాడు. ఆ తర్వాత సంగీతానికి పూర్తిగా దూరం అయిన రాజ్.. ఈటీవీలో కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరించాడు. రాజ్ పూర్తి పూర్తి పేరు తోటకూర సోమరాజు. అలనాటి ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు రెండో కుమారుడే ఈయన. రాజ్ మరణంతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. ఆయన సంగీతాన్ని గుర్తు చేసుకొని.. రాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.