Nagababu: నాగబాబుతో ఎప్పటికైనా జనసేనకు దెబ్బేనా? పోటీకి దూరంగా ఉంటారనేది అందుకేనా?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2023 | 10:44 AMLast Updated on: Feb 04, 2023 | 10:45 AM

Nagababu Set Back For Janasena

నవ్వుల నాగబాబు అంటారు కానీ.. ఎమోషన్ బ్యాలెన్స్ తప్పినప్పుడు చూడాలి మనోడి సంగతి ! వాళ్లు వీళ్లు అని చూడడు.. ఏం జరుగుతుందని ఆలోచించడు.. నోటికి ఏదొస్తే అది… మనసుకు ఏది అనిపిస్తే అది.. అది అభిమానులా, కుటుంబసభ్యులా అని ఆలోచించడు.. టక్కున అనేస్తాడు నాగబాబు ! ముక్కుసూటితనం అనేది కొందరే అయినా.. అసహనం, అహంకారం అంటారు చాలామంది ! ఓ నటుడిగా, నిర్మాతగా ఏమన్నా.. ఏం మాట్లాడినా అది పెద్ద మ్యాటర్ కాదు.. రాజకీయాల్లో ఉన్నారు.. ఓసారి పోటీకి దిగారు. అలాంటి వ్యక్తి తీరు మార్చుకోకపోతే.. జనసేన పార్టీకి దెబ్బేఅనడంలో ఎలాంటి అనుమానం లేదు.

వచ్చే ఎన్నికల్లో జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనిచ్చేది లేదని పదేపదే అంటూ.. సైకిల్‌కు దగ్గరవుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రేంజ్‌లో రాజకీయంగా పావులు కదుపుతున్నారు పవన్. ఒక్కో అడుగు పక్కాగా విశ్లేషిస్తూ వేస్తుంటే.. నాగబాబు యాంగర్ కాదు కాదు అహంకారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందా అనే భయం సొంత పార్టీలోనే కనిపిస్తోంది. నాగబాబులో దూకుడు స్వభావం ఎక్కువ. ముక్కుసూటి మనిషి కావడంతో… టక్కున ఓ మాట అలా జారేస్తుంటారు. అది కాస్తా ప్రతీసారి మైనస్‌గా మారుతుంటుంది.

అప్పుడెప్పుడో చిరు బర్త్ డే వేడుకల్లో పవన్ మీద, ఫ్యాన్స్ మీద ఫైర్ అయ్యారు. అదంటే గతం అనుకోవచ్చు. నిన్నటికి నిన్న గరికపాటి మీద చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బ్రాహ్మణ సంఘాలు యుద్ధానికి బయల్దేరాయ్. గరికపాటి, చిరు వ్యవహారంలో తప్పు ఎవరిది అన్నది కాసేపు పక్కనపెడితే.. ఓ రాజకీయ పార్టీలో ఉన్న నాగబాబు రియాక్ట్ అయిన విధానం మాత్రం కచ్చితంగా తప్పే ! ఆ వివాదం కూల్ కాలేదు.. చిన్న బ్రేక్ అంతే ! రాజకీయంలో ఏదిస్తే.. అది రెట్టింపుగా రిటర్న్ అవుతుంది. కాకపోతే కాస్త టైమ్ పడుతుంది అంతే !

నాగబాబు ఈ వైఖరే పార్టీకి దూరంగా పెట్టేలా చేసింది. పవన్ కాకపోతే నాదెండ్ల పార్టీ వ్యవహారాలు చూసుకుంటారు తప్ప.. నాగబాబు వరకు వెళ్లదు ఏదీ ! జనసేన పార్టీ పుట్టి ఎనిమిదేళ్లవుతున్నా.. ఆయన పార్టీకి చాలా వరకూ దూరంగా ఉంటూ వచ్చారు. అయినా గత ఎన్నికల ముందు పిలిచి మరీ నరసాపురం ఎంపీ టిక్కెట్ ఇచ్చారు. ఆయన వ్యవహారశైలి .,. వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరిగిందన్న అభిప్రాయం అప్పట్లో వినిపించింది. ఈ సారి ఎందుకైనా మంచిదని ఆయన పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఐనా సరే మళ్లీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు.

నాగబాబును రెచ్చగొట్టడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ అసహనంతో కనిపిస్తుండే నాగబాబు.. ఒక్కసారి రెచ్చిపోయారా.. ఆయన మాటలు మిగిల్చే నష్టం అంతా ఇంతా కాదు. ఏమైనా రాజకీయాల్లో గిల్లితే గిల్లించుకోవాలి.. అరిచి నోరుపారేసుకోవద్దు. గిల్లినప్పుడు బాధను యాక్షన్ రూపంలో చూపించారి. నాగబాబు తెలుసుకోవాల్సింది ఇదే అన్నది చాలామంది అభిప్రాయం.

(N)