Milk Politics: నందిని Vs అమూల్.. బీజేపీతో ఏంటి లింకు?
ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది. గుజరాత్ బ్రాండ్ అమూల్, కన్నడ బ్రాండ్ నందిని మధ్య పాల రగడ నడుస్తోంది. కర్ణాటకలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అమూల్ చేసిన ప్రకటన రాజకీయ దుమారం రాజేసింది. రాష్ట్రంలోకి అమూల్‌ను దొడ్డిదారిన తీసుకొస్తున్నారంటూ అధికార బీజేపీపై కాంగ్రెస్, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి కన్నడ ఆత్మగౌరవ నినాదంలా మారేలా కనిపిస్తోంది.
గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ అమూల్ పేరుతో పాల ఉత్పత్తులను దేశమంతా విస్తరిస్తోంది. అయితే ఇది ఆయా రాష్ట్రాల్లోని స్థానిక బ్రాండ్లను అణగదొక్కేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇక కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ నందిని పేరుతో ఉత్పత్తులను విక్రయిస్తోంది. కొన్ని రోజుల క్రితం అమూల్ ఓ ట్వీట్ చేసింది. ఏ న్యూ వేవ్ ఆఫ్ ఫ్రెష్‌నెస్ విత్ మిల్క్ అండ్ కర్డ్ ఈజ్ కమింగ్ టు బెంగళూరు అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది ఇది బాంబులా పేలింది. అమూల్ వచ్చి నందిని అస్థిత్వాన్ని నాశనం చేస్తుందన్న ఆందోళన కర్ణాటకలో నెలకొంది.
ప్రతిపక్షాల వాదనేంటి.?
నందిని బ్రాండ్‌ను అమూల్‌లో కలిపివేసే కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర రైతుల నోట్లో మట్టికొట్టి ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రానికి చెందిన గుజరాత్ రైతులకు ప్రయోజనం కలిగించేలా బసవరాజు బొమ్మై సర్కార్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలోనే అమూల్ రాష్ట్రంలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య అంటున్నారు. జేడీఎస్ కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. ఇప్పటికే బలవంతంగా హిందీ రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు ఉత్తరాది బ్రాండ్లను తీసుకొచ్చి రైతులను మోసం చేస్తున్నారని నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో నందిని రోజుకు 99లక్షల లీటర్ల పాలను సేకరించేదని కానీ ఇప్పుడు దాన్ని 71లక్షల లీటర్లకు పరిమితం చేసిందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. అమూల్ కోసమే నందిని సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారన్నది వాటి ఆరోపణ. ఇటీవల నందిని డెయిరీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్‌షా.. అమూల్‌తో కలిసి నందిని పనిచేయాలన్న సూచన దుమారాన్నే రేపింది.
బీజేపీ ఏమంటోంది.?
అధికార బీజేపీ మాత్రం నందినికి వచ్చిన ముప్పేపీ లేదని నమ్మబలకుతోంది. నందిని ఇప్పుడు రాష్ట్ర బ్రాండ్ కాదని అది పాన్ ఇండియాబ్రాండ్ అంటోంది. దాన్ని ఎవరూ అణగదొక్కలేరని రైతులకు మరింత ప్రయోజన కల్పించేందుకే అమూల్‌ను అనుమతిస్తున్నామని చెబుతోంది. మనం వేరే బ్రాండ్లకు అనుమతివ్వనప్పుడు వేరే రాష్ట్రాల్లో మన నందిని బ్రాండ్‌ను ఎందుకు అనుమతించాలంటూ కవర్ చేసుకుంటున్నారు. కర్ణాటకలో 18 బ్రాండ్ల దాకా ప్రైవేట్, పబ్లిక్ సెక్టర్ బ్రాండ్లున్నాయని కానీ నందిని వాటన్నింటిలో అగ్రస్థానంలో ఉందంటున్నారు.
ట్విట్టర్ వార్.!
ప్రస్తుతం ట్విట్టర్‌లో గో బ్యాక్ అమూల్, సేవ్ నందిని ట్రెండింగ్‌లో ఉన్నాయి. కర్ణాటక రైతుల నోట్లో మట్టికొడుతున్నారన్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. దేశంలోనే పాల సేకరణలో నెంబర్2గా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉంది. అమూల్‌కు ఎంట్రీ పాస్ ఇచ్చి నందినిని చంపేసేలా కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ నందినికి అండగా నిలిచింది,. తాము కేవలం స్థానిక రైతులు ఉత్పత్తి చేసిన నందిని ఉత్పత్తులనే వాడతామని ప్రకటించింది. కన్నడ వాసులు చాలామంది తాము అమూల్‌ను వాడబోమని పోస్టులు పెడుతున్నారు. సేవ్ నందిని అంటూ ట్విట్టర్‌లో కన్నడిగులు రచ్చ చేస్తున్నారు.
అమూల్ రియాక్షనేంటి.?
కర్ణాటక ఎన్నికల వేల ఇది రాజకీయం కావడంతో అమూల్ స్పందించింది. ట్విట్టర్ ట్రెండ్స్‌ను తాము గమనిస్తున్నట్లు ఎండీ జయేన్ మెహతా తెలిపారు. ప్రస్తుతానికి ఈకామర్స్ సైట్ల ద్వారా మాత్రమే పాల ఉత్పత్తులను విక్రయించాలని నిర్ణయించామని తెలిపారు. బెంగళూరులో పూర్తిస్థాయిలో తాము అడుగుపెట్టడానికి మరో ఆరునెలలు పడుతుందన్నారు. మొత్తంగా చూస్తే ఈ వివాదం ఎటు తిరిగి ఎటు మలుపు తీసుకుంటుందోనన్న టెన్షన్ బీజేపీకి పట్టుకుంది. మరి అమూల్ ఎవరి నెత్తిన పాలు పోస్తుందో చూడాలి మరి.