Nara Bhuvaneshwari: నిజం గెలవాలి యాత్రకు సర్వం సిద్దం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రేపటి నుంచి నిజం గెలవాలి పేరుతో చేపట్టనున్న యాత్రలో పాల్గొననున్నారు.
నారా భువనేశ్వరి తిరుమల చేరుకున్నారు. శ్రీవారి దర్శనానికి అధికారులు, అర్చకులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వాదం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భువనేశ్వరితోపాటూ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమి రెడ్డి రాంగోపాల్ రెడ్డి స్వామి వారిని దర్శించుకున్నారు. నారా భువనేశ్వరి తిరుమలకు చేరుకున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, స్థానికులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. వారిని పోలీసులు ఆలయానికి దూరంగా పంపించేశారు. దర్శనం తరువాత భువనేశ్వరి నారా వారి పల్లెకు పయనమయ్యారు. ఈ వాళ అక్కడే ఉండి రాత్రి బస చేయనున్నారు. దీనికి తగు ఏర్పాట్లు చేశారు పార్టీ శ్రేణులు.
చంద్రబాబు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాములో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ అరెస్ట్ కండిస్తూ పార్టీ నేతలు నిరసనలు తెలిపారు. అయితే ఈయన అరెస్ట్ ను జీర్ణించుకోలేక చాలా మంది అభిమానులు, కార్యకర్తలు గుండెపోటుతో మరణించారు. ఈ కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం నింపే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అందుకే అక్టోబర్ 25 నుంచి నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టేందుకు సర్వం సిద్దం చేశారు. వారానికి మూడు రోజులపాటూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి పరామర్శిస్తారు. రేపు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. స్థానికంగా జరిగే సభలు, సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది.
T.V.SRIKAR