Nara Bhuvaneshwari: చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నారా భువనేశ్వరి నిరాహార దీక్ష..
చంద్రబాబు స్కిల్ స్కాములో అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచి ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ సెప్టెంబరు 30 సాయంత్రం 07.00 నుంచి 07.05 వరకూ శబ్ధం చేయాలి, అక్టోబర్ 2న 7.00 నుంచి 7.05 వరకూ లైట్లు ఆర్పివేయాలి అంటూ టీడీపీ ఉపాధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. అలాగే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ అక్టోబర్ 2న నిరాహార దీక్ష చేపడతానని అంటున్నారు. దీనికైనా మద్దతు వస్తుందా లేదా అంటే జరిగేంత వరకూ చెప్పలేం అన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. చంద్రబాబు స్కిల్ స్కాములో అరెస్ట్ అయిన మొదటి రోజు నుంచి ఏపీ రాజకీయాలు కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. ర్యాలీలు, నిరసనలు, పవన్ కళ్యాణ్ సంఘీభావంతో టీడీపీ కార్యకర్తల్లో జోష్ కనిపించినప్పటికీ ఎంతో కాలం నిలువలేదు. ఇదే తరుణంలో నారా భువనేశ్వరీ, బ్రహ్మణి మహిళలతో కొవ్వొత్తుల ప్రదర్శనతో ర్యాలీలు చేశారు. అది రాజమండ్రి వరకే పరిమితం అయింది. నిన్న కేశముండన కార్యక్రమాలు చేశారు. దీనికి కూడా పెద్దగా ప్రతిస్పందన లేదు.
అసలు చేయాల్సింది ఏంటి..
చంద్రబాబు స్కిల్ స్కాములో ఎలాంటి తప్పు చేయలేదని ప్రసంగాలు, ర్యాలీలు, ప్రెస్ మీట్లు ఇస్తే సరిపోదు. తప్పు చేయలేదు అన్న దానికి సంబంధించి ఒక్క సాక్ష్యం అయినా చూపించగలగాలి. చంద్రబాబు అరెస్ట్ అయి 21 రోజులు అవుతోంది. ఇప్పటి వరకూ కోర్టుల్లో టెక్నికల్ అంశాలను చూపిస్తూ బాబును బయటకు తీసుకు రావాలని చూస్తున్నారే తప్ప ఎలాంటి స్కామ్ జరుగలేదు రుజువు చేయలేక పోతున్నారు. తాను పాలనలో ఉన్నప్పుడు ఇన్ని నిధులు ఖర్చు అయ్యాయా లేదా.. అయితే ఎక్కడ ఎలా ఖర్చు చేశారో స్పష్టమైన ఆధారాలు చూపిస్తే కోర్టులు తప్పకుండా కేసును కొట్టేసేవి. అలా కాకుండా దొంగతిరుగుడు వైఖరిని అవలంబిస్తూ ప్రజల్లో ఏదో స్పందన రావాలి అనుకోవడం వల్ల కాలయాపనే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.
న్యాయపరంగా గెలవడమే ఏకైక మార్గం..
గతంలో టీడీపీ ఇచ్చిన పిలుపుకు పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని భావించినప్పటికీ తీవ్ర నిరాశే ఎదురైంది. అనుకున్నంత మేర ప్రజలు బయటకు రాలేదు. అక్కడక్కడ ర్యాలీలు జరిగాయే తప్ప రాష్ట్రం మొత్తం చెప్పుకోదగ్గ చర్చ ఎక్కడా లేదు. ఇలాంటివి చేయడం వల్ల పబ్లిక్ లో మరింత దిగజారిపోతారు తప్ప ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అన్న విషయాన్ని గుర్తించాలి. న్యాయపరంగా గెలిచి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా ప్రజల్లో అటెన్షన్ క్రియేట్ చేయగలరు అని చెప్పవచ్చు. అలా గనుక నిరూపించగలిగితే వైసీపీ పై ఇప్పటి వరకూ ఉన్న కొంతో గొప్పో మైలేజ్ కూడా పాతాళానికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో కక్ష్య సాధింపు అని ప్రజల్లో స్పష్టంగా అర్థమౌతుంది. అప్పుడు ప్రజలే ప్రజాస్వామ్యంలో తగిన తీర్పు ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
T.V.SRIKAR