3D-Printed Hotel: చంద్రుడిపై ఇల్లు కట్టేందుకు రిహార్సల్స్.. భూమిపై త్రీడీ టెక్నాలజీతో ఇండ్ల నిర్మాణం
భూమి కాకుండా మరో నివాసయోగ్యమైన గ్రహం కోసం పరిశోధకులు ఎప్పటినుంచో వెతుకుతున్నారు. దీనిలో భాగంగా చంద్రుడు, అంగారక గ్రహాలు నివాసయోగ్యంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ గ్రహాలపైకి మనుషుల్ని పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది.
3D-Printed Hotel: భవిష్యత్తులో చంద్రుడిపై, అంగారకుడిపై మనిషి నివాసముండేలా పరిశోధనలు సాగుతున్నాయి. ఇవి ఏదో ఒక రోజు సత్ఫలితాన్ని ఇవ్వొచ్చు. భూమి మీద ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా కష్టం. మరి అలాంటిది ఇతర గ్రహాలపై ఇల్లు కట్టాలంటే ఇంకెంత కష్టమో ఆలోచించండి. అందుకే ముందు జాగ్రత్తగా వేరే గ్రహాలపై ఇల్లు కట్టేందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు నాసా పరిశోధకులు. ఇందుకోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనికోసం ఒక సంస్థతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది నాసా. దీనికి రిహార్సల్స్‌గా భూమి మీదే 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మాణం చేపట్టారు. దీని ద్వారా ఒక విశాలమైన హోటల్ నిర్మిస్తున్నారు.
నాసా ముందడుగు
భూమి కాకుండా మరో నివాసయోగ్యమైన గ్రహం కోసం పరిశోధకులు ఎప్పటినుంచో వెతుకుతున్నారు. దీనిలో భాగంగా చంద్రుడు, అంగారక గ్రహాలు నివాసయోగ్యంగా ఉంటాయని భావిస్తున్నారు. ఈ గ్రహాలపైకి మనుషుల్ని పంపేందుకు నాసా ప్రయత్నిస్తోంది. ఒకవేళ అక్కడ మనిషి నివాసం ఉండాల్సి వస్తే ఇల్లు ఎలా కట్టుకోవాలి అనే అంశంపై నాసా దృష్టిపెట్టింది. దీనిలో భాగంగా అక్కడ దొరికే మట్టితోనే నిర్మాణం చేపట్టాలనుకుంటోంది. దీనికోసం త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో దూసుకుపోతున్న ఐకాన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
దీంతో నిర్మాణానికి నాసా, ఐకాన్ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ముందుగా భూమ్మీదే త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా ప్రయోగాత్మకంగా ఇళ్లు నిర్మించాలని ప్రయత్నిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని, మర్ఫా పట్టణానికి సమీపంలోని ఎడారి ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టబోతుంది. దాదాపు 60 ఎకరాల్లో త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో బిల్డింగ్స్, రూమ్స్, హోటల్స్ వంటివి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఎలాంటి నిర్మాణాలంటే
ఎడారి ప్రాంతంలో క్యాంపింగ్ సైట్‌గా ఉన్న చోట ఒక హోటల్ నిర్మిస్తున్నారు. దీనికి ఎల్ కాస్మికో అనే పేరు పెట్టారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ విధానంలో రూపుదిద్దుకోనున్న మొదటి హోటల్ ఇదే అవుతుంది. అలాగే కొన్ని ఇండ్లను, భవనాల్ని కూడా నిర్మిస్తారు. ఇవి ఒకదానికొకటి దూరం దూరం ఉండేలా చూస్తారు. వీటితోపాటు స్విమ్మింగ్ పూల్, స్పా, లాన్ వంటి సదుపాయాల్ని కూడా కల్పిస్తారు. దూరంగా ఉండే ఇండ్లకు సండే హోమ్స్ అనే పేరు పెట్టారు.
ఈ ఇండ్లళ్లో రెండు నుంచి నాలుగు బెడ్ రూమ్స్, బాత్ రూమ్స్ వంటివి ఉంటాయి. డోమ్స్, ఆర్చీల వంటి ఆకారంలో అనేక నిర్మాణాలుంటాయి. రూమ్స్ లోపల బెడ్స్, టేబుల్స్, ఇతర ఫర్నీచర్ కూడా ఉంటుంది. వీటన్నింటినీ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ పద్ధతిలోనే నిర్మిస్తారు. ఇది ఎడారి ప్రాంతం కాబట్టి.. ఇక్కడి వాతావరణానికి తగ్గట్లుగా రంగుల్ని ఎంపిక చేశారు. ఈ నిర్మాణాల్ని బిగ్ అనే ప్రముఖ ఆర్కిటెక్ సంస్థ డిజైన్ చేసింది. ఐకాన్ సంస్థ నిర్మాణం ప్రారంభించబోతుంది.