April 1: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ట్యాక్సుల నుంచి ఇన్సూరెన్స్ దాకా.. మారబోతున్నవి ఇవే..
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)కు సంబంధించి కీలక మార్పు జరగనుంది. ఈపీఎఫ్‌ఓ ఖాతా కలిగి ఉండి, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే ఖాతా బదిలీ చేసుకోవడం ఇప్పటివరకు చాలా కష్టమైన ప్రాసెస్‌గా ఉంది.
April 1: కొత్త ఆర్థిక సంవత్సరం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. కేంద్రం బడ్జెట్‌లో ప్రవేశపెట్టే మార్పులు, బ్యాంకింగ్ కార్యకలాపాలు వంటివన్నీ ఏప్రిల్ 1 నుంచే అమలవుతాయి. దీంతో అంతకుముందున్న రూల్స్ స్థానంలో కొత్త రూల్స్ వస్తాయి. క్రెడిట్ కార్డుల వినియోగం నుంచి పెన్షన్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో కీలక మార్పులుంటాయి. కొన్ని ప్రధాన మార్పులివి.
ఐటీ శ్లాబులలో మార్పులు
కొత్త ఐటీ (ఇన్‌కమ్ ట్యాక్స్) పాలసీ ఏప్రిల్ 1 నుంచి డిఫాల్ట్‌గా అమలవుతుంది. ఈ ఏడాది నుంచి కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ‘పాత పన్ను విధానం’లో ట్యాక్స్ చెల్లించాలనుకుంటే, మీ కంపెనీకి సమాచారం అందించాలి. కొత్త పన్ను శ్లాబులు ఇవి. రూ.3 లక్షల లోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 నుంచి 6 లక్షల వరకు 5 శాతం, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 నుంచి 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం పన్ను చెల్లించాలి.
నేషనల్ పెన్షన్ స్కీం
ఏప్రిల్ 1 నుంచి నేషన్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పీఎస్) సెక్యూరిటీకి సంబంధించి కొత్త రూల్స్ అమలుకానున్నాయి. కొత్త రూల్ ప్రకారం.. ‘టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్’ చేయాలి. అంటే ఇంతకుముందులా కేవలం పాస్‌వర్డ్ టైప్ చేసి లాగిన్ కాలేము. ఆధార్ నెంబర్ కన్ఫామ్ చేసి, ఆ తర్వాత మొబైల్‌కు వచ్చే ఓటీపీని కూడా ఎంటర్ చేస్తేనే ఖాతా లాగిన్ అవుతుంది. దీనివల్ల మీ ఖాతాను వేరేవాళ్లు యాక్సెస్ చేయలేరు.
ఈపీఎఫ్‌ఓ
ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)కు సంబంధించి కీలక మార్పు జరగనుంది. ఈపీఎఫ్‌ఓ ఖాతా కలిగి ఉండి, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే ఖాతా బదిలీ చేసుకోవడం ఇప్పటివరకు చాలా కష్టమైన ప్రాసెస్‌గా ఉంది. దీనికోసం ప్రత్యేక రిక్వెస్ట్ పెట్టుకుని, అవసరమైతే కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. కానీ, ఇకపై ఇదంతా అవసరం లేదు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే.. ఖాతా ఆటోమేటిక్‌గా మరో సంస్థలోకి బదిలీ అవుతుంది. దీనివల్ల ఖాతాదారులకు శ్రమ తప్పుతుంది.
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్స్
ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ వాడుతున్న వారికి ఒక రకంగా ఇది షాకింగే. ఇకపై కొన్ని సెలెక్టెడ్ కార్డ్స్‌పై చేసే రెంట్ పే (అద్దె చెల్లింపులు)పై రివార్డ్స్ పాయింట్స్ రద్దు కానున్నాయి. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ ఆరమ్, పల్స్, సింప్లీ క్లిక్, ఎలైట్, ఎలైట్ అడ్వాంటేజ్ కార్డు నుంచి చేసే చెల్లింపులపై రివార్డ్ పాయంట్స్ రావు. అలాగే పలు డెబిట్ కార్డులపై వార్షిక చార్జీలను ఎస్బీఐ రూ.75 వరకు పెంచింది.
డొమెస్టిక్ లాంజ్ సర్వీస్
వివిధ క్రెడిట్ కార్డులపై ట్రాన్సాక్షన్స్ చేస్తే ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కల్పిస్తాయనే సంగతి తెలిసిందే. అయితే, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకులు ఈ విషయంలో కొన్ని మార్పులు చేశాయి. యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులు ఇకపై ఒక త్రైమాసికంలో కనీసం రూ.10 వేల ట్రాన్సాక్షన్స్ చేస్తేనే.. తర్వాతి త్రైమాసికంలో డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్ చేయొచ్చు. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లు మాత్రం ఒక త్రైమాసికంలో కనీసం రూ.50 వేల ట్రాన్సాక్షన్స్ చేస్తేనే.. వచ్చే త్రైమాసికంలో డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ చేయొచ్చు.
ఫాస్టాగ్ KYC
ఫాస్టాగ్ సేవలు వినియోగించుకోవాలంటే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి. లేకపోతే ఫాస్టాగ్ అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది. ఈ ఏడాది మార్చి 31లోపు అప్‌డేట్ చేసుకున్నారో.. లేదో.. నిర్ధరించుకోవాలి. టోల్ పేమెంట్స్‌లో అంతరాయాలను నివారించడానికి ఇది చాలా కీలకం. భద్రతను మెరుగుపరచడం, ఫాస్టాగ్ ఆపరేషన్స్‌ని క్రమబద్ధీకరించడం కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ చర్యలు తీసుకుంది.
ఇన్సూరెన్స్ పాలసీల డిజిటలైజేషన్
ఏప్రిల్ 1 నుంచి అన్ని రకాల లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ డిజిటలైజేషన్ కానున్నాయి. దీనిపై ఇప్పటికే ఇన్సూరెన్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.