Rameshwaram Cafe blast: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు

పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో నిందితుడిని పట్టుకునే విషయంలో కీలక ప్రకటన చేసింది ఎన్ఐఏ. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల బహుమతి (రివార్డ్) ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 6, 2024 | 05:57 PMLast Updated on: Mar 06, 2024 | 5:57 PM

Nia Announces Cash Reward Of Rs 10 Lakh For Information On Bomber About Rameshwaram Cafe Blast

Rameshwaram Cafe blast: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేస్తోంది. పేలుడు ఘటన దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగిస్తూ కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే, ఘటన జరిగి వారమైనా ఇంకా ప్రధాన నిందితుడి ఆచూకీ కనుక్కోలేదు. సీసీటీవీ కెమెరాల్లోని విజువల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించినప్పటికీ, అతడి ఆచూకీని మాత్రం ఎన్‌ఐఏ కనుక్కోలేకపోయింది.

Bengaluru water crisis: మా ఇంట్లోనే నీళ్ళు రావట్లేదు.. బెంగళూరు నీటి కొరతపై డిప్యూటీ సీఎం!

దీంతో నిందితుడిని పట్టుకునే విషయంలో కీలక ప్రకటన చేసింది. నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షల బహుమతి (రివార్డ్) ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఐఏ వేగంగా విచారిస్తోంది. పేలుడు ఘటనకు బాంబే కారణమని తేల్చింది. దీని వెనుక ఉగ్రవాద కుట్ర కోణం ఉండొచ్చని ఎన్ఐఏ భావిస్తోంది. ఘటన జరిగిన రామేశ్వరం కేఫ్‌ను స్వాధీనంలోకి తీసుకుని ఎన్ఐఏ కీలక ఆధారాలు సేకరించింది. కేఫ్‌లో బాంబు పెట్టిన నిందితుడిని గుర్తించి, ఫొటో విడుదల చేసింది. అతడి ఆచూకీ చెబితే.. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు రూ.10 లక్షలు అందిస్తామని తెలిపింది. వివరాలు అందించేందుకు అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఈ పేలుడుకు నిందితుడు ఆర్‌డీఎక్స్‌ ఉపయోగించాడని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

నిందితుడు ఏ మార్గంలో కేఫ్‌లోకి వచ్చాడు? బాంబు అమర్చిన తర్వాత ఎలా వెళ్లాడు.. వంటి అంశాలపై సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ పేలుడు ఘటనతో బెంగళూరుతోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్చి 1న కేఫ్‌లోకి వచ్చిన నిందితుడు ఆధారాలు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. తలపై టోపీ ధరించడంతోపాటు, చేతికి గ్లోవ్స్ కూడా ధరించి ఉన్నట్లుగా గుర్తించారు. కేఫ్‌లోకి వచ్చిన నిందితుడు అక్కడ టిఫిన్ తిని.. బాంబు ఉన్న సంచిని వదిలేసి వెళ్లాడు. అనంతరం టైమర్‌తో బాంబ్ పేల్చాడు.