Nithyananda: ఐక్యరాజ్యసమితిలో నిత్యానంద కైలాసం!
నిత్యానంద కైలాస గురించి ప్రకటించగానే ఆయన మాటలను ఎద్దేవా చేశారు. జనాన్ని నమ్మించేందుకు ప్రగల్బాలు పలుకుతున్నాడని భావించారు. రిజర్వ్ బ్యాంక్, వీసాలు, పాలన.. లాంటి అంశాలను ప్రస్తావించినప్పుడు నిత్యానందకు పిచ్చి పట్టిందని నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నిత్యానంద కైలాస దేశం ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లింది. ఇదే ఇప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న అంశం.
నిత్యానంద (Nithyananda) అనగానే మనకు నవ్వొచ్చేస్తుంది. వివాదాలకు, వింత ఉపన్యాసాలకు నిత్యానంద కేరాఫ్ అడ్రస్. అందుకే ఆయన ఫోటో కనిపించినా, వీడియా దర్శనమిచ్చానా వెంటనే మనకు నవ్వొచ్చేస్తుంటుంది. కానీ నిత్యానంద మాత్రం తను వేరే అనుకుంటూ ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. భారత్ లో కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయాడు. ఏకంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (United States of Kailasa) పేరుతో ఓ ద్వీపాన్ని తీసుకుని ప్రత్యేక దేశంగా ప్రకటించాడు. అంతటితో ఆగలేదు. తన కైలాస దేశానికి గుర్తింపు కోసం ఏకంగా ఐక్యరాజ్యసమితికే (Unitated Nations Organization) దరఖాస్తు చేసుకున్నాడు. అప్లై చేసుకోవడం తప్పు కాదు. కానీ దానికి గుర్తింపు ఇస్తూ ఐక్యరాజ్యసమితి నిర్ణయం తీసుకోవడమే ఇప్పుడు చర్చనీయాంశం. కైలాసకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఆ దేశం తరపున ఐక్యరాజ్యసమితిలో మాట్లాడం అవకాశం కలిగింది. ఇదిప్పుడు అత్యంత వివాదాస్పదమవుతోంది.
భారత్ నుంచి వెళ్లిపోయిన నిత్యానంద దక్షిణ అమెరికా దీవుల్లో తిష్టవేశాడు. అక్కడ కైలాస పేరుతో ప్రత్యేక దేశాన్నే ప్రకటించాడు. దానికి మొదట అమెరికా న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్ సిటీతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. కైలాస దేశానికి రిజర్వ్ బ్యాంక్ ను ఏర్పాటు చేశాడు నిత్యానంద. అక్కడ పాలనా వ్యవహారాలు చూసుకునేందుకు ప్రధాన మంత్రి, కేబినెట్ ఏర్పాటు చేశాడు. అనంతరం ఐక్యరాజ్యసమితికి గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి ఐక్యరాజ్యసమితి నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. ఈ నెల 22న జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశం తరపున విజయప్రియ నిత్యానంద (Vijaya Priya Nithyananda) అనే మహిళ పాల్గొంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస తరపున తాను పాల్గొన్నట్టు ఆవిడ ప్రకటించింది.
భారత్ (India) నుంచి తమ కైలాస దేశానికి రక్షణ కల్పించాలని విజయప్రియ నిత్యానంద ఐక్యరాజ్యసమితిలో విజ్ఞప్తి చేసింది. తమ దేశాధిపతి నిత్యానంద భారత్ నుంచి అనేక వేధింపులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచంలో హిందు (Hindu) ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద పాటు పడుతున్నారని విజయప్రియ నిత్యానంద వెల్లడించారు. భారత్ వేధింపుల నుంచి తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తమ కైలాస దేశం ఇప్పటికే 150కి పైగా దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ దేశంలో 20 లక్షల మందికి పైగా హిందువులు నివసిస్తున్నట్టు వెల్లడించారు. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం కలిగిస్తోంది.
ఇన్నాళ్లూ నిత్యానంద ఉన్నాడో పోయాడోనని జనమంతా భావించారు. అసలు నిత్యానంద కైలాస గురించి ప్రకటించగానే ఆయన మాటలను ఎద్దేవా చేశారు. జనాన్ని నమ్మించేందుకు ప్రగల్బాలు పలుకుతున్నాడని భావించారు. రిజర్వ్ బ్యాంక్, వీసాలు, పాలన.. లాంటి అంశాలను ప్రస్తావించినప్పుడు నిత్యానందకు పిచ్చి పట్టిందని నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు నిత్యానంద కైలాస దేశం ఐక్యరాజ్యసమితి వరకూ వెళ్లింది. ఇదే ఇప్పుడు సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న అంశం.