ఎవ్వరూ తప్పించట్లేదు, నేనే తప్పుకుంటున్నా
సిడ్నీ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి తీరాలి.
సిడ్నీ టెస్టుకు ముందు టీమిండియాలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలిచి తీరాలి. అదే సమయంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలను కూడా సజీవంగా ఉంటుకుంటుంది. అందుకే భారత తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా సిడ్నీ టెస్ట్ నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకుంటున్నాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో రోహిత్ పై వేటు వేస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ వీటిలో నిజం లేదని తెలుస్తోంది. రోహిత్ తనంతట తానే తప్పుకుంటున్నట్టు సమాచారం. ఆఖరి టెస్టులో హిట్‌మ్యాన్ బరిలోకి దిగకూడదని నిర్ణయించుకున్నారట. ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఈ ప్రశ్నకు సమాధానం దాటవేయడం ఆ వార్తలకు మరింత బలాన్నిచేకూరుస్తోంది.
గత కొంతకాలంగా రోహిత్ పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. గత మూడు సిరీస్‌లో 15 ఇన్నింగ్స్‌ల్లో 10.93 సగటుతో 164 పరుగులే చేశాడు. ఈ మూడింటిలో రెండు సిరీస్ లు సొంతగడ్డపై జరిగినవే. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో 3 మ్యాచ్‌ల్లో ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 31 పరుగులు చేశాడు. 10 పరుగులే అతని టాప్ స్కోర్. ఈ కారణంగానే అతన్ని తప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. పలువురు మాజీ క్రికెటర్లు సైతం రోహిత్ ఫామ్ లో విమర్శలు గుప్పించారు. కెప్టెన్ కాబట్టే జట్టులో ఉన్నాడని, వేరే ప్లేయర్ అయితే ఎప్పుడో తీసేసావారంటూ కొందరు వ్యాఖ్యానించారు. నిజమే రోహిత్ కెప్టెన్ కనుక అతన్ని తప్పించే సాహసం ఎవరూ చేయరు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ తనకు తానుగా జట్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఒకవేళ రోహిత్ తప్పుకుంటే జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు.