Lokesh Yuvagalam Padayatra: లోకేష్ పాదయాత్రకు జనం కరువు… టెన్షన్ లో చంద్రబాబు!

lokesh padayatra
తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలంటే జనం పిచ్చగా వచ్చేస్తారు. కానీ అదేం చిత్రమో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్రకు మాత్రం జనం కనిపించడం లేదు. Chandrababuకి, tdpకి ఇప్పుడు ఇదే ఆందోళనగా మారింది. గతంలో ys రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలు చేసినప్పుడు జనం విరగబడి వచ్చేవారు. మైళ్ళకు మైళ్ళు నేతలతో నడిచేవాళ్ళు. ఆ తరవాత షర్మిల, ఇటీవల బండి సంజయ్ లాంటివాళ్ళు చేసిన పాదయాత్రలకు కూడా జనం బాగానే వచ్చారు. Ys, చంద్రబాబు, జగన్ పాదయాత్రలు చాలా పద్దతిగా నడిచేవి. ప్లానింగ్ కూడా ముందే పద్దతిగా చేసుకునే వాళ్ళు. ఆశ్చర్యంగా లోకేష్ పాదయాత్రకు మాత్రం జనం కరువయ్యారు.
లోపం ఎక్కడుందో తెలియక టీడీపీ అధినాయకత్వం జుట్టు పీక్కుంటోంది. జనవరి 27న ప్రారంభమైన పాదయాత్రకి పది రోజులైనా జనం లేరు. మొదటిరోజే తారకరత్న పాదయాత్రలో కుప్ప కూలిపోవడంతో అందరూ బాడ్ సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారు. ఆ తరవాత రోజు నుంచి జనం తగ్గిపోయారు. లోకేష్ కి జనంలో ఆదరణ లేకపోవడం వల్లా… లేక పబ్లిక్ ని సరిగ్గా సమీకరించలేకపోతున్నారో బాబు టీమ్ కి అర్థం కావడం లేదు. ఇలా ఐతే మధ్యలోనే విరమించుకునే పరిస్థితి వస్తుందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి లోకేష్ పాద యాత్రలో అన్ని లోపాలే. పాదయాత్రకు ముందు లోకేష్ తనకు ఇష్టమైన ఒకటో రెండో మీడియా సంస్థలను మాత్రమే కలసి పాదయాత్రకు సహకరించాలని కోరాడు. లోపాయకారిగా మాట్లాడుకున్నాడు. మిగిలిన మీడియా సంస్థలను మాట మాత్రంగా నైనా పలకరించలేదు. దీంతో మిగిలిన మీడియా సంస్థలన్నీ లోకేష్ యాత్రని పూర్తిగా పక్కన పెట్టేసాయి. టీడీపీ ప్రచార పత్రికలు… ఛానళ్లు… ఎంత చేసినా జనంలోకి వెళ్ళలేదు.
ఇక లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లు కూడా గందరగోళమే. అసలు వచ్చే జనాన్ని పట్టించుకునే వాళ్లే లేరు. జగన్ సర్కారుపై వ్యతిరేకత తమకు బాగా కలిసి వస్తుందని లోకేష్ టీమ్ భావించింది. అక్కడే బొమ్మ తిరగబడింది. గ్రామాల్లో… టౌన్స్ లో ఎవరూ యాత్రను పట్టించుకోలేదు. స్థానికంగా ప్రచారం కూడా చేయలేదు. టీడీపీ స్థానిక నేతలు లోకేష్ పాదయాత్ర ఖర్చు అంతా తమ నెత్తిన రుద్దుతారనే భయంతో దూరంగా ఉంటున్నారు. ఇక మిగిలిన జిల్లాల నేతలు మన జిల్లాకు లోకేష్ వచ్చినప్పుడు ఎలాగూ ఖర్చు పెట్టాలిగా…ఇప్పుడు వెళ్లడం దేనికి అని తప్పుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళకి కనీస భోజన సదుపాయాలు కూడా లేవని దీంతో నాలుగు రోజులు నడవలనుకున్నవాళ్ళు ఒక్కరోజుకే వెళ్లిపోయారని టీడీపీ నేతలే అంటున్నారు.
చంద్రబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇలాగే వ్యవహారాన్ని వదిలేస్తే అసలుకే ఎసరు వస్తుందని గ్రహించారు. లోకేష్ కి గ్లామర్ లేదని, ప్రజాకర్షణ లేదనే విషయం బయటపడతుందని… తక్షణమే ఏదో ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించి యాత్రకు జనాన్ని రప్పించే పనిలో పడ్డారు బాబు.