Purandeshwari: ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వరి.. మార్పు జరిగినా బీజేపీకి ఒరిగేదేమీ లేదా?
దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాలను మరింత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ, ఏపీలో పార్టీలో భారీ మార్పులు చేసింది. అధ్యక్షులను మారుస్తూ నడ్డా నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణకు కిషన్ రెడ్డి.. ఏపీకి పురంధేశ్వరికి పార్టీ పగ్గాలు అప్పగించారు. ఇప్పటివరకు అంతా ఓకే.. ఇకపై అసలు మ్యాటర్ ఏంటి మరి అనేది చాలామంది డౌట్. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం పురంధేశ్వరిని పార్టీ చీఫ్‌గా ప్రకటించడంతో ఆశ్చర్యపోయారు అంతా ! పార్టీ అధ్యక్ష రేసులో సత్యకుమార్‌తో పాటు సుజనాచౌదరిలాంటి వాళ్ల పేర్లు వినిపించినా.. చివరికి పురంధేశ్వరి వైపే మొగ్గు చూపింది బీజేపీ హైకమాండ్. కాంగ్రెస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన పురంధేశ్వరి.. కమలం పార్టీని ఎలా నడిపిస్తారు అన్నదే ఆసక్తిగా మారింది.
పార్టీలో పెనుమార్పులు అని స్టేట్‌మెంట్ ఇచ్చి.. మార్పులు చేసినా ఏపీలో బీజేపీ తలరాత మారడం అనుమానమే ! ఏపీలో సొంతంగా పోటీ చేస్తే.. ఎక్కడా కనీసం డిపాజిట్ దక్కించుకునే చాన్స్ కూడా లేదు కమలం పార్టీకి! చాలాచోట్ల క్షేత్రస్థాయిలో అసలు కేడరే లేదు. ఇవన్నీ సరిపోవు అన్నట్లు.. పార్టీలో గ్రూప్‌లు. ఏపీ బీజేపీలో మాములుగా మూడు గ్రూప్‌లు ఉంటాయ్. ఒకటి.. టీడీపీకి అనుకూలం. రెండు.. వైసీపీకి అనుకూలం.. మూడు.. నిజమైన బీజేపీ. ఎవరు ఎప్పుడు ఎటు వైపు నుంచి బలంగా లాగుతారో.. పార్టీ బతుకు జట్కా బండి ఎలా నడుస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణంగా ఉంది ఏపీలో కమలం పార్టీ పరిస్థితి. గ్రౌండ్ లెవల్‌లో బలం లేదు.. పార్టీకి ఉన్న బలగంలో ఐక్యత లేదు.. వీటిని సెట్‌రైట్ చేయకుండా.. అధ్యక్ష పదవిలో ఉన్న వారిని మార్చినంత మాత్రాన.. అంత సెట్ రైట్ అవుతుంది అనుకుంటే అంతకుమించిన అమాయకత్వం ఉండదు.
పురందేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీకి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఓ రెండేళ్లు ఆ హోదాలో ఉంటారు. ఆ తర్వాత మళ్లీ మార్పు.. అంతకుమించి ఏపీ బీజేపీలో జరిగేది ఏమీ లేదు అనే చర్చ మొదలైంది. అధ్యక్ష మార్పుతో మీడియాలో అటెన్షన్ వస్తుందేమో కానీ.. పార్టీలో టెన్షన్ పడే గ్రూప్‌లు ఏవీ లేదు ఏపీ బీజేపీలో! గట్టువరకు తీసుకెళ్లొచ్చు కానీ గుర్రంతో నీళ్లు తాగించలేం అంటారు కదా.. బీజేపీ పరిస్థితి అలా కాదు ఇది గట్టు వరకు కూడా రాని గుర్రం. అక్కడి నుంచి కదలని, కదిలించలేని గుర్రం.. పార్టీ చీఫ్‌లను మార్చేశారు కదా.. ఏపీ బీజేపీలో మార్పు వస్తుంది అనుకుంటే.. అంతకుమించిన అమాయకత్వం ఉండదు మరొకటి! ఒక్కటి మాత్రం క్లియర్.. మార్పు జరిగినా బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ లేదు.. ఉండదు కూడా !