నెరవేరిన పాక్ కల, 22 ఏళ్ళకు వన్డే సిరీస్ విజయం
వరల్డ్ క్రికెట్ లో అనిశ్చితికి మారు పేరు పాకిస్థాన్ జట్టే... ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఒక్కోసారి తన కంటే చిన్న జట్ల చేతిలో ఓడిపోతుంటుంది.. మరోసారి తన కంటే మెరుగ్గా ఉన్న టీమ్స్ పై గెలుస్తూ ఉంటుంది..
వరల్డ్ క్రికెట్ లో అనిశ్చితికి మారు పేరు పాకిస్థాన్ జట్టే… ఎందుకంటే ఆ జట్టు ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవ్వరూ చెప్పలేరు.. ఒక్కోసారి తన కంటే చిన్న జట్ల చేతిలో ఓడిపోతుంటుంది.. మరోసారి తన కంటే మెరుగ్గా ఉన్న టీమ్స్ పై గెలుస్తూ ఉంటుంది.. తాజాగా పాకిస్తాన్ ఇలాంటి విజయాన్నే సాధించింది. ఆసీస్ గడ్డపై ఆ జట్టుకే షాకిచ్చింది. మూడు వన్డేల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం పలువురు సీనియర్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో ఆసీస్ ద్వితీయశ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. స్టోయినిస్ , మాక్స్ వెల్ తప్పిస్తే మిగిలిన వారెవరూ అంత అనుభవం ఉన్నవారు కాదు. దీంతో పాక్ జట్టు వన్డే సిరీస్ ను సునాయాసంగా గెలుచుకుంది. చివరి వన్డేలోనూ పాక్ పేసర్లు చెలరేగడంతో కంగారూలు కేవలం 140 పరుగులకే చాపచుట్టేశారు. సీన్ అబోట్ 30 రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3, నసీర్ షా 3, హ్యారిస్ రవూఫ్ 2 వికెట్లు తీశారు.
తర్వాత ఛేజింగ్ లో పాకిస్థాన్ 26.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సయీమ్ అయుబ్ హాఫ్ సెంచరీతో రాణించగా…మహ్మద్ రిజ్వాన్ 30 బాబర్ అజామ్ 28 పరుగులు చేశారు. కంగారూల గడ్డపై పాకిస్థాన్ వన్డే సిరీస్ గెలవడం 22 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో చివరిసారిగా 2002లో ఆ జట్టు వన్డే సిరీస్ గెలిచింది. మళ్ళీ రెండు దశాబ్దాల తర్వాత సిరీస్ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ చేతిలో సొంతగడ్డపై క్లీన్ స్వీప్ పరాభవం చవిచూసిన పాకిస్తాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బాబర్ అజామ్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం..రిజ్వాన్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అటు సొంతగడ్డపై సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు సిరీస్ గెలిచిన పాకిస్థాన్ అదే జోష్ లో ఆస్ట్రేలియాపైనా సిరీస్ విజయాన్ని సాధించింది. కానీ కీలక ఆటగాళ్ళు లేకపోవడమే కంగారూల ఓటమికి కారణం. తొలి రెండు వన్డేలకు ఆస్ట్రేలియాను నడిపించిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆఖరి మ్యాచ్‌కు జోష్ ఇంగ్లిష్‌కు సారథ్య బాధ్యతలు అందించాడు. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి విధ్వంసకర ప్లేయర్లతో పాటు స్టీవ్ స్మిత్, కమిన్స్, హేజిల్‌వుడ్, స్టార్క్ వంటి ప్లేయర్లు కూడా దూరమయ్యారు.