Chardham Yathra: 200 మందిని బలిగొన్న ఛార్‌ధామ్ యాత్ర
మృత్యు ద్వారాలుగా మారిన చార్ ధామ్ యాత్ర.
ప్రతీ హిందువు తన జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలి అనుకునే యాత్రల్లో ఛార్ ధామ్ యాత్ర ఒకటి. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కదు. ఒకవేళ వెళ్లినా అక్కడి ప్రతికూల పరిస్థితులను తట్టుకొని యాత్ర ముగించడం చాలా కష్టమైన పని. ఇలా యాత్రకు వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఈ ఏడాది చార్‌ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు చనిపోయారు. ఇందులో చాలా మంది అనారోగ్యం కారణంగా, కొండచరియలు విరిగి పడటం కారణంగా చనిపోయినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. ఆ రాష్ట్ర ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ ఇచ్చిన లెక్కల ప్రకారం కేదార్‌నాథ్ ధామ్ మార్గంలో అత్యధికంగా 96 మరణాలు నమోదయ్యాయి. యమునోత్రి ధామ్‌లో 34, బద్రీనాథ్ ధామ్‌లో 33, గంగోత్రి ధామ్‌లో 29, హేమకుండ్ సాహిబ్‌లో ఏడుగురు, గౌముఖ్ ట్రెక్‌లో ఒకరు చనిపోయారట.
ఈ ఏడాది ఇప్పటి వరకు చార్‌ధామ్ యాత్రకు సుమారు 42 లక్షల మంది భక్తులు వచ్చారు. ఇందులో ప్రధానంగా కేదార్‌నాథ్ ధామ్‌కు 13 లక్షల 4 వేల మంది యాత్రికులు వచ్చారని అధికారులు చెప్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాది సెప్టెంబర్ 11 వరకు 232 మంది యాత్రికులు చనిపోయారు. కేదార్‌నాథ్ ధామ్‌లో 111 మంది, బద్రీనాథ్ ధామ్‌లో 58 మంది, హేమకుండ్ సాహిబ్‌లో నలుగురు, గంగోత్రి ధామ్‌లో 15 మంది, యమునోత్రి ధామ్‌లో 44 మంది చనిపోయారు. నిజానికి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరణాల సంఖ్య తగ్గింది. గత ఏడాది చార్‌ధామ్ యాత్ర మొత్తంలో 300 కుపైగా యాత్రికులు చనిపోయారు.