Old City power : పాతబస్తీలో అంతే…రోజుకి 20లక్షల యూనిట్ల కరెంట్ ఫ్రీగా వాడకం !
రోజుకి 20 లక్షల యూనిట్లు... ఏడాదికి 511 కోట్ల రూపాయల విద్యుత్ ను ఫ్రీగా వాడేస్తున్నారు. పాతబస్తీకి నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నా...రోజుకి 20 లక్షల యూనిట్లకు మాత్రం డబ్బులు రావట్లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
రోజుకి 20 లక్షల యూనిట్లు… ఏడాదికి 511 కోట్ల రూపాయల విద్యుత్ ను ఫ్రీగా వాడేస్తున్నారు. పాతబస్తీకి నిరంతరం విద్యుత్ సరఫరా అవుతున్నా…రోజుకి 20 లక్షల యూనిట్లకు మాత్రం డబ్బులు రావట్లేదని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈమధ్యే అసెంబ్లీలో పాతబస్తీలో కరెంట్ దుర్వినియోగంపై మాట్లాడారు. ఈ ఇష్యూపై అప్పట్లో మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్రంగా మండిపడ్డారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ఎంత పవర్ ఫ్రీగా పోతుందో లెక్కలు తేల్చారు.
తెలంగాణలోని హైదరాబాద్ సౌత్ జోన్ లో రోజుకి 20 లక్షల యూనిట్ల కరెంట్ కు బిల్లులు రావడం లేదని అధికారులు తేల్చారు. ఈ జోన్ పరిధిలో ఛార్మినార్, బేగం బజార్, అస్మాన్ గఢ్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ సప్లయ్ చేస్తున్న పవర్ యూనిట్ విలువ 7 రూపాయలు ఉంటుంది. అంతే ఏడాదికి దాదాపు 511 కోట్ల రూపాయల విలువైన పవర్ ను అక్కడి కస్టమర్స్, వ్యాపారులు ఉచితంగా వాడుకుంటున్నారు. హైదరాబాద్ సదరన్ రీజియన్లో కోట్లల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలను వసూలు చేయడానికి అక్కడి మజ్లిస్ ఎమ్మెల్యేలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. ప్రతి ఒక్కరూ నెలవారీగా బిల్లులు చెల్లించాలని చూడాలన్నారు.
గజ్వేల్, సిద్ధిపేటల్లో కూడా భారీగా విద్యుత్ దుర్వినియోగం అవుతోందనీ… బిల్లులు సక్రమంగా వసూలు కావడం లేదని కూడా సీఎం రేవంత్ అసెంబ్లీలో తెలిపారు. గజ్వేల్ లో 86 కోట్లు, సిద్ధిపేటలో 118 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలకు లాస్ వస్తోంది. హైదరాబాద్ సౌత్ జోన్ లో మీటర్ల ట్యాంపరింగ్ కామన్ అంటున్నారు విద్యుత్ శాఖ అధికారులు. చాలా చోట్ల విద్యుత్ స్థంభాలకు హుక్కులు వేలాడదీసి సొంతంగా ఇళ్ళు, షాపుల్లో కరెంట్ లాక్కుంటారు. అస్మాన్ గఢ్ లోని సైదా బాద్ ఏరియాలో చాలావరకూ ఇలా అక్రమంగా కరెంట్ వాడుకుంటున్న ఇళ్ళే కనిపిస్తాయని చెబుతున్నారు. స్థానిక విద్యుత్ సిబ్బంది కూడా బిల్లులు వసూలు చేయకుండా తాత్కాలికంగా ఎంతోకొంత డబ్బులు తీసుకొని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.