Online Food Orders: అలుపెరుగని వర్షం ధాటికి.. ఆగిన ఆకలితీర్చే చక్రం
ఆకలి తీర్చే అన్నపూర్ణ దేవుళ్లు రెస్ట్ తీసుకున్నారు. జోరు వాన వీరి వాహనానికి బ్రేక్ వేసింది. అలుపెరుగక, రేయనక, పగలనక, దుమ్మనక, ధూళి అనక తీవ్ర ట్రాఫిక్లోనూ సర్రుమని దూసుకెళ్ళే వాహన చోదకులు ఇంటికే పరిమితమయ్యారు. ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో. అదే జొమాటో, స్విగ్గీ బాయ్స్ డెలివరీ గురించి. భాగ్యనగరం అంతా బెబ్బేలాడుతోంది. ఏ ఫుడ్ డెలివరీ యాప్ చూసినా అవర్ ఫుడ్ డెలివరీ పార్టనర్ ఈజ్ నాట్ అవేలబుల్ అని బోర్డు పెట్టారు. ఇక చేసేదేమి లేక షిఫ్ట్ డ్యూటీ వర్కర్స్ నుంచి ఫుడ్ లవర్స్ వరకూ అంతా రోడ్లపైకి వచ్చారు. ఎందుకు ఇంతటి పరిస్థితులు ఎదురయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Online food delivery is not available in Hyderabad due to three days of rain
థాలీ మొదలు తందూరీ దాకా.. చికెన్ నుంచి చిల్డ్ షేక్ దాకా ఏదైనా సరే అరగంట లేదా గంటలో మనకు అలసట అనేది తెలీయకుండా డోర్ స్టెప్ దగ్గరకు అందించే ఫుడ్ డెలివరీ బాయ్స్ గడపదాటడం లేదు. దీనికి కారణం వర్షం. అంటే హైదరాబాద్లో ఇప్పటి వరకూ వర్షాలే పడలేదా.. వాహనాలే తిరగలేదా.. ఫుడ్ డెలివరీ చేయలేదా అనే ప్రశ్న మీలో కలుగవచ్చు. వర్షాలు పడ్డాయి..వాహనాలు తిరిగాయి. కానీ మితంగా మాత్రమే. అయితే ఇక్కడ అపరిమితంగా మారింది పరిస్థితి. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.
గడప దాటని ఫుడ్ డెలివరీ బాయ్స్
సాధారణంగా ఈ స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్ వంటి వాటిని వీక్ డేస్ లో అయితే 40 నుంచి 50 శాతం మంది మాత్రమే ఎక్కువగా వినియోగిస్తారు. వీక్ ఎండ్స్ అయితే దీని వాడకం 80శాతం వరకూ వెళ్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే..ప్రస్తుతం వర్షానికి అందరూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఈ కారణంగా 30 శాతం మంది ఫుడ్ ఆర్డర్ పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ వాళ్లు ఈ యాప్ లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. తమ తమ పని గంటల దృష్ట్యా ఆర్డర్లు పెడుతూ ఉంటారు. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో చాలా వరకు సాఫ్ట వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ చేయమని ఆదేశించాయి. దీంతో వీళ్లు హాస్టల్స్, ఇళ్లకే పరిమితం అయ్యారు. పీజీ హాస్టళ్లలో టైం టు టైం అన్నీ అందుబాటులో ఉంటాయి కాబట్టి అక్కడే తినేందుకు ప్రయత్నిస్తారు. ఇక ఇంట్లో అయితే కొందరికి వండుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి కొందరికి తమ పేరెంట్స్ లేదా వైఫ్ ఫుడ్ రెడీ చేసి సమయానికి పెడతారు. తద్వారా ఈ ఫుడ్ యాప్ లకు పని చెప్పాల్సిన అవసరం రాలేదు.అంతే కాకుండా ఇది వీకెండ్ కూడా కాదు వీక్ డేస్ కావడంతో ఆర్డర్ రేట్ పడిపోయింది.
కావల్సిన ఫుడ్, రెస్టారెంట్ అందుబాటులో లేవు
ఇకపోతే సరదాగా తినేందుకు నిత్యం యాప్ ఉపయోగించుకునే వారు కేవలం 10 శాతానికి మించి ఉండరు. ఇది అవసరానికో లేదా అత్యవసరమయ్యో వీరు దీనిని ఉపయోగించరు. కాళీగా ఉండే సమయంలో ఏమైనా సరదాగా ఆర్ఢర్ పెట్టుకొని రుచిని ఆస్వాదించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ల కారణంగా కూడా ఈ డెలివరీ బాయ్స్ తమ విధులకు ఎర్ర జండా ఊపారని చెప్పాలి. వీటన్నింటికీ మించి చాలా వరకూ హోటల్స్ మూతపడ్డాయి. నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షానికి ఎవరూ హోటల్స్ వైపుకు తొంగి కూడా చూడటం లేదు. తెరిచిన అరకొర హోటల్స్, రెస్టారెంట్స్ కూడా మెనూ కర్డ్ లోని అన్ని వెరైటీ ఐటెమ్స్ ని అందుబాటులో ఉంచడం లేదు. కేవలం సెలెక్టెవ్ డిషెస్ నే అవైలబిలిటీలో ఉంచాయి. వీటిని తినేందుకు ఎవరూ సుముఖత చూపిచడం లేదు.
తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు
ఇక చివరిది హైదరాబాద్ రోడ్ల పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తమ వాహనాలను బయటకు తీసేందుకు జంకుతున్నారు. చినుకు పడితే వణుకు పుడుతుంది అన్న విధంగా భాగ్యనగరం రోడ్లు తయారయ్యాయి. ఇంతటి మహా భాగ్యంలో తమ ఆకలిని మింగి ఇతరుల కడుపు నింపేందుకు ఈ డెలివరీ బాయ్స్ సుముఖంగా లేనట్లు కనిపిస్తుంది. పోనీ రహదారులు ఎలాగున్నా ఏదో విధంగా ఫుడ్ డెలివరీ చేద్దాం అన్నా పూర్తి స్థాయి ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ ట్రాఫిక్ కి కారణం ముఖ్యంగా వర్షం. ప్రతి రోజూ తన టూవీలర్ ద్వారా ప్రయాణించే వాహనదారుడు గత రెండు మూడు రోజులుగా కార్లలో ప్రయాణం సాగిస్తున్నారు. సొంత కార్లు లేని వారు క్యాబ్ బుక్ చేసుకొని తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల ఉన్న పరిమిత రోడ్లలో మూడు,నాలుగు చక్రాల వాహనాలు అధికంగా బయటకు వచ్చేశాయి. పైగా ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా వర్షం. దీంతో రోడ్లన్నీ జలమయం. ఎక్కడ ఏ గుంత ఉందో. ఏ డ్రైనేజ్ మ్యాన్ హోల్ ఉందో చూసుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి. దీంతో కార్లు అన్నీ రోడ్లపైకి ఒక్కసారి వచ్చే సరికి తీవ్రమైన ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలో మీటర్ల మేరా వాహనాలు స్థంభించాయి. ఇంతటి ట్రాఫిక్ లో ఈ డెలివరీ బాయ్స్ ఫుడ్ సకాలంలో అందించడం అనేది చాలా పెద్ద టాస్క్. ఒకవేళ ఆర్డర్ తీసుకున్నారే అనుకోండి.. ఫుడ్ పికప్ చేసుకున్నప్పటి నుంచి తమ డోర్ స్టెప్ చేర్చేదాకా అతనికి కాల్ చేసి విసిగిస్తూనే ఉంటారు కొందరు. ఇంతటి విభిన్న పరిస్థితుల్లోనూ ఫుడ్ అందించారే అనుకోండి అది చూడకుండా అతనిని నానా మాటలు అంటూ రేటింగ్ విషయంలో కక్ష్యపూరితంగా వ్యవహరిస్తారు.
వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ఫుడ్ డెలివరీ యాప్స్ బంద్ చేశారని చెప్పకతప్పడంలేదు. మళ్లీ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టి, రోడ్లు చక్కబడి, ట్రాఫిక్ కొద్దిగా ఫ్రీ అయితే మనకంటే ముందు అడ్డంగా వచ్చి దూసుకు పోయేందుకు సిద్దంగా ఉంటారని చెప్పాలి.
T.V.SRIKAR