Operation Kaveri: ఆపరేషన్ కావేరి ప్రారంభం.. సూడాన్‌లో కొనసాగుతున్న ఎయిర్‌లిఫ్టింగ్
అనేక దేశాలు సూడాన్‌లో ఉన్న తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కు తెప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. ఇప్పుడు భారత్ కూడా రంగంలోకి దిగింది. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తరలిస్తోంది.
Operation Kaveri: సూడాన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు సైనిక వర్గాలకు చెందిన గ్రూపుల మధ్య ఘర్షణ తీవ్ర అంతర్యుద్ధానికి దారి తీసింది. దీంతో సైన్యం కాల్పులు జరుపుతోంది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 400 మందికిపైగా పౌరులు మరణించారు. 3,500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పరిస్థితి ఇప్పుడప్పుడే సద్దుమణిగే అవకాశం లేదు. దీంతో అనేక దేశాలు సూడాన్‌లో ఉన్న తమ పౌరుల్ని సురక్షితంగా వెనక్కు తెప్పించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే అమెరికా తమ రాయబార కార్యాలయ సిబ్బందిని సురక్షితంగా రక్షించింది. కొందరు విదేశీయుల్ని కూడా అమెరికా రక్షించింది. ఇప్పుడు భారత్ కూడా రంగంలోకి దిగింది. సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తరలిస్తోంది.
సూడాన్‌లో పారామిలిటరీ దళాలకు, సైన్యానికి మధ్య ఘర్షణ జరుగుతోంది. పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేయాలని చేసిన ప్రతిపాదన ఈ ఘర్షణలకు దారితీసింది. దీనికి పారామిలిటరీ దళాలు అంగీకరించలేదు. ఈ క్రమంలో సైన్యం వారిపై వైమానిక దాడులకు దిగింది. పారామిలిటరీ స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో సాధారణ పౌరులు కూడా మరణిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులున్నాయి. పౌరులకు మంచి నీళ్లు, ఆహారం, వైద్యం, చమురు, విద్యుత్ కూడా దొరకడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో అనేక దేశాలు ఆందోళన చెందుతున్నాయి. అక్కడున్న తమ పౌరుల్ని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ విషయంలో సహకరించాల్సిందిగా సూడాన్‌ను వివిధ దేశాలు కోరాయి. దీంతో కాల్పుల విరమణకు సూడాన్ సైన్యం అంగీకరించింది.
మూడు రోజుల పాటు కాల్పుల విరమణ
అనేక దేశాల నుంచి వచ్చిన వినతుల మేరకు సూడాన్ మూడు రోజులపాటు కాల్పుల విరమణకు అంగీకరించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి 72 గంటలపాటు కాల్పుల విరమణ కొనసాగనుంది. అమెరికా జరిపిన చర్చల తర్వాత సూడాన్ దీనికి అంగీకరించింది. ఈ 72 గంటల్లో విదేశీ పౌరుల్ని తరలించేందుకు మానవతా కారిడార్లు ఏర్పాటు చేయడం, రవాణా, ఆహారం, వైద్య సదుపాయలు కల్పించడం వంటివి చేస్తుంటారు. ఏ దేశమైనా ఈ సమయంలో సూడాన్ నుంచి తమ పౌరుల్ని తరలించవచ్చు. విదేశీయులు సురక్షితంగా తమ దేశాలు వెళ్లేందుకు అక్కడి పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ సహకరిస్తాయి. దీంతో విదేశీయులు తమ దేశం తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో వేలాది మంది ఇప్పటికే సూడాన్ విడిచివెళ్లినట్లు తెలుస్తోంది. కానీ, సూడాన్ పౌరులు మాత్రం ఏ క్షణాన ఏమవుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వాళ్లంతా శరణార్థులుగా ఇతర దేశాలకు తరలివెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఆపరేషన్ కావేరి
సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడించారు. దీనికి కేంద్రం ఆపరేషన్ కావేరి అనే పేరు పెట్టింది. భారతీయుల తరలింపు కోసం నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ నౌకను వినియోగిస్తోంది. మొదటి దశలో ఇప్పటికే 278 మంది పౌరులతో కూడిన నౌక సూడాన్ నుంచి బయల్దేరిందని, అక్కడి నుంచి సౌదీ అరేబియాలోని జెద్దాకు నౌక చేరుతుందని కేంద్రం తెలిపింది. మిగతావారిని కూడా సురక్షితంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్రం చెప్పింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానాల్ని కూడా దీని కోసం వినియోగించనున్నారు. సూడాన్‌లో మొత్తం 3,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వారందరినీ సురక్షితంగా తరలిస్తామని కేంద్రం చెబుతోంది. ఇండియా, అమెరికాతోపాటు జర్మనీ, స్పెయిన్, జోర్డాన్, ఇటలీ, గ్రీస్ వంటి దేశాలు సూడాన్‌లో ఉన్న తమ పౌరుల్ని తరలించేందుకు ప్రత్యేక విమానాల్ని నడుపుతున్నాయి. ఇక్కడ అత్యధికంగా ఈజిప్టుకు చెందిన పౌరులు పది వేల మంది చిక్కుకున్నట్లు అంచనా.