ముంబై జట్టు నుంచి ఔట్, దేవుడా నేనింకేం చేయాలి ?
ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోని పృథ్వీ షాకు బిగ్ షాక్ తగిలింది. 10 రోజుల వ్యవధిలోనే ముంబై జట్టులో మళ్ళీ చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో ముంబై సెలక్టర్లు పృథ్వీ షాను పక్కన పెట్టారు.
ఐపీఎల్ మెగావేలంలో అమ్ముడుపోని పృథ్వీ షాకు బిగ్ షాక్ తగిలింది. 10 రోజుల వ్యవధిలోనే ముంబై జట్టులో మళ్ళీ చోటు కోల్పోయాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టులో ముంబై సెలక్టర్లు పృథ్వీ షాను పక్కన పెట్టారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆశించినట్టు రాణించలేకపోవడం దీనికి కారణంగా కనిపిస్తోంది. శ్రేయాస్ అయ్యర్ ను సారథిగా కొనసాగించిన సెలక్టర్లు పలు మార్పులు చేశారు. వ్యక్తిగత కారణాలతో రహానే కొన్ని మ్యాచ్ ల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా విజయ్ హజారే టోర్నీకి తనను ఎంపిక చేయకపోవడంతో పృథ్వీ షా ఎమోషనల్ అయ్యాడు. తీవ్ర భావోద్వేగంతో దేవుడా నేనింకేం చేయాలి అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. తన లిస్ట్-ఏ రికార్డ్స్‌ను షేర్ చేస్తూ.. ఇంకా నేనేం చేయాలో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
65 ఇన్నింగ్స్‌లు.. 3399 పరుగులు.. 55.7 సగటు.. స్ట్రైక్‌రేట్ 126 నమోదు చేసినా.. తన ఎంపికకు ఇవి సరిపోలేదంటూ రాసుకొచ్చాడు. అయినా దేవుడిపై తనకు నమ్మకం పోదని, మళ్ళీ ఖచ్చితంగా పునరాగమనం చేస్తానంటూ తన ఇన్‌స్టా స్టోరీలో పృథ్వీ షా పేర్కొన్నాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో పృథ్వీ షా 10 శతకాలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 21.88 సగటుతో 197 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీ షా అమ్ముడుపోలేదు.75 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చిన అతన్ని ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో కూడా చోటు దక్కకపోవడంతో పృథ్వీ షా కెరీర్ డేంజర్ జోన్‌లో పడింది.
ఇటీవల క్రమశిక్షణా రాహిత్యంతో పృథ్వీ షాపై ముంబై సెలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. బరువు తగ్గాలని చెప్పినా పట్టించుకోకపోవడం, ప్రాక్టీస్ సెషన్స్ ను రెగ్యులర్ గా రాకపోవడం వంటి అంశాలతో పృథ్వీ మూల్యం చెల్లించుకున్నాడు. తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటున్నాడంటూ పలువురు మాజీ ఆటగాళ్ళు సైతం పృథ్వీషాపై జాలి పడ్డారు. ముంబై కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సైతం పృథ్వీ షాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా గాడ్ గిఫ్టెడ్ ప్లేయర్ అని కొనియాడిన శ్రేయస్ అయ్యర్.. లాలించి ఆడించడానికి అతనేమి చిన్న పిల్లాడు కాదని వ్యాఖ్యానించాడు. తనకు తానే కొన్ని విషయాలు తెలుసుకుని నడుచుకోవాలని సూచించాడు.
అవకాశాలకు కొదవలేదనీ, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలన్నాడు. ఆట పట్ల అంకిత భావంతో ఉండాలని శ్రేయాస్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం పృథ్వీ షా ఇన్ స్టాగ్రామ్ పెట్టిన ఎమోషనల్ పోస్టు వైరల్ గా మారింది.