PAKISTAN: దుబాయ్ లో చికిత్స పోందుతూ తుది శ్వాస విడిచిన పర్వేజ్ ముషారఫ్
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ తుది శ్వాస విడిచారు. దుబాయ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ముషారఫ్. ప్రస్తుతం ఆయన వయసు 79ఏళ్లు. దుబాయ్‌లోని ఆసుపత్రిలో చేరిన ముషారఫ్‌ను ముందుగా రావల్పిండిలోని ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ (ఏఎఫ్‌ఐసీ)కి తరలించారు. మార్చి 2016 నుండి దుబాయ్‌లో ఉన్న ముషారఫ్ అమిలోయిడోసిస్‌కు చికిత్స పొందుతున్నారు. అమిలోయిడోసిస్ కారణంగానే ముషారఫ్ ఈరోజు మరణించారని ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొన్ని వారాలుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పర్వేజ్ ముషారఫ్ 1943 ఆగస్టు 11న న్యూఢిల్లీలోని దర్యాగంజ్‌లో జన్మించారు. 1947లో అతని కుటుంబం పాకిస్థాన్‌కు వెళ్లిపోయింది. విభజనకు కొన్ని రోజుల ముందు ఆయన కుటుంబం మొత్తం పాకిస్థాన్‌కు చేరుకుంది. ముషారఫ్ తండ్రి సయీద్ నయా పాకిస్తాన్ కోసం ఉద్యమించిన నేత. అంతేకాదు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ఆయన పనిచేశారు. 1999లో విజయవంతమైన సైనిక తిరుగుబాటు తర్వాత పర్వేజ్ ముషారఫ్ పాకిస్తాన్ 10వ అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. అతను 1998 నుండి 2001 వరకు 10వ CJCSCగా, 1998 నుండి 2007 వరకు 7వ టాప్ జనరల్‌గా పనిచేశారు. ఇస్లామాబాద్‌లోని ప్రత్యేక కోర్టు 2014 మార్చి 31న దేశద్రోహం కేసులో పాకిస్థాన్ మాజీ సైనిక అధ్యక్షుడు జనరల్ ముషారఫ్‌ను దోషిగా నిర్ధారించింది. ముషారఫ్‌పై బేనజీర్ భుట్టో, రెడ్ మసీద్ మతపెద్దను హత్య చేయించారనే ఆరోపణలున్నాయి. 1999 మార్చి నుంచి మే వరకు కార్గిల్‌లో చొరబాట్లను ముషారఫ్ పెంచి పోషించారు. పాక్ సైన్యానికి చెందిన నార్తరన్ లైట్ ఇన్‌ఫ్యాంట్రీ దళం అప్పట్లో కార్గిల్‌లోని కీలక స్థావరాల్లోకి చొరబడింది. భారత్- పాక్ మధ్య యుద్ధం జరగడం, అంతర్జాతీయ తీవ్రస్థాయిలో ఒత్తిడి రావడంతో పాక్ బలగాలను కార్గిల్ నుంచి అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఉపసంహరించుకున్నారు. ఇది పాక్ సైన్యానికి ఏ మాత్రం రుచించలేదు. దీనికి ప్రతీకారంగా అక్టోబర్ 12, 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ముషారఫ్ పడగొట్టారు.
దేశద్రోహ నేరం కింద పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష పడింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించినందుకు పాక్ చరిత్రలో విచారణకు గురైన మొదటి వ్యక్తిగా నిలిచారు. 2013 ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాజ్యాంగాన్ని విస్మరించినందుకు మాజీ సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై కేసు నమోదైంది. ముషారఫ్‌పై దేశద్రోహం కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు నలుగురు అధ్యక్షులను భర్తీ చేయాల్సి వచ్చింది. పర్వేజ్ ముషారఫ్ ఒక్కసారి మాత్రమే ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అది కూడా ఆయనపై ఆరోపణలు వచ్చిన సమయంలో మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత ఎప్పుడూ కోర్టుకు రాలేదు.