Police Wedding Shoot: పోలీస్ స్టేషన్ లో ప్రీ వెడ్డింగ్ షూట్.. ఏమిట్రా పిచ్చ పీక్స్ కి వెళ్లిపోయింది వీళ్లకి
పోలీస్ స్టేషన్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసి హైలెట్ అయ్యారు ఒక పోలీస్ జంట.
పెళ్లికి ముందు ఫోటో తీసుకోండ్రా అంటే..కొందరు ఏట్లో దూకితే.. మరికొందరు గాల్లో ఎగురుతారు. ఇంకొందరు పాములతో సయ్యాటలాడతారు. చివరకు ఆరడుగులు గొయ్యి తీసుకుని అందులో శవాల్లా పడుకున్నోళ్లూ ఉన్నారు. దీన్నే ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి అని ముద్దుగా అంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ లో ఒకటి దారి తప్పింది. ఒక పోలీస్ లవ్‌బర్డ్స్ చేసిన షూట్ డిపార్ట్మెంట్ లో కలకలం రేపింది. ఇంతకీ ఆ లాఠీ రాజా.. టోపీ రోజా ఏం చేశారో తెలుసా.?
ప్రేమనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా పుడుతుంది. అలాగే ఇద్దరు పోలీసుల మధ్య కూడా లవ్వు చిగురించి టోపీ కింద లాఠీ తొడిగింది. నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష అంటూ ఇద్దరు రక్షక భట అధికారులు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. రావూరి కిషోర్, భావన.. ఇద్దరూ ఏఆర్, ఎస్‌ఐలుగా పంజాగుట్ట పీఎస్‌లో పనిచేస్తున్నారు. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీగా ఉండే ఈ నాలుగో సింహాం అనుకోకుండా ప్రేమలో పడ్డారు. ఖాకీ యూనిఫాంలో ప్రేమను.. పసుపు బట్టల్లో పెళ్లి పీటలు ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. పెద్దలు కూడా ఒప్పుకున్నారు. పెళ్లికూడా ధూం ధాం గా జరిగింది.
అక్కడితో కథ ముగిసి పోలేదు. ఈ జంట చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఆలస్యంగా బయట పడింది. ఇప్పుడు డిపార్ట్‌మెంట్లోనే కాదు.. బయట కూడా తెగ వైరల్ అయిపోయింది. హీరో గారు వెహికల్ దిగుతూ ఎంటరవుతారు..! హీరోయిన్ అతడిని చూసి ఒక స్మైల్ ఇచ్చుకుంటుంది. తర్వాత ఇంకేంటి? మళ్ళీ లొకేషన్ ఛేంజ్.. కాస్ట్యూమ్స్ ఛేంజ్.. ఫుల్ మేకప్.! డ్రీమ్స్‌లోకి వెళ్లి భాగ్యనగరం ఔట్ స్కట్స్‌లో అదిరిపోయే సాంగ్. ఏమాటకామాట చెప్పుకోవాలి కానీ.. ఇద్దరూ స్టెప్పులు మాత్రం ఇరగదీసేశారు. పోలీస్ లవ్ జంట ఫోటో షూట్ చూసి వారెవ్వా అదరగొట్టేశారుగా అంటూ తెగ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. పోలీస్ ఉద్యోగం అంటే ఎప్పుడూ కేసులు, ఛేజింగ్‌లు, సవాలక్ష టెన్షన్లు ఉంటాయనుకునేవారికి.. వీళ్ల సాంగ్ చూస్తే పోలీసులో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తుంది.
ఈ స్టెప్పులు సినిమా రేంజ్‌కు ఏమాత్రం తగ్గలేదంటే నమ్మండీ. పోలీస్ లవ్ జంట.. లవ్‌లీ జంట అంటూ చూసినోళ్లంతా తెగ పొగిడేస్తున్నారు. అయితే ఇక్కడే చిన్న చిక్కొచ్చి పడింది. ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వరకు బాగానే ఉంది కానీ పోలీస్ బాబాయ్.. దాని కోసం డిపార్ట్‌మెంట్ వెహికల్ వాడేశాడు. స్టేషన్ ఆవరణలో ఈ ప్రీ వెడ్డింగ్ దుకాణం ఏంటన్నది కొందరి అభ్యంతరం. వాళ్ల ప్రేమ.. వాళ్ల పెళ్లి.. వాళ్ల ప్రీవెడ్డింగ్ షూట్.. అంతా వాళ్ల ఇష్టమే. స్టేషన్ ముందు షూటింట్ పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ కొందరు పెద్దపెద్ద మాటలే అంటున్నారు. ఏది ఏమైనా.. ఏఆర్ ఎస్సై కిషోర్, ఎస్సై భావన మొత్తానికి ఇరగదీసేశారు. డిపార్ట్మెంట్లో మనం చేయలేనిది వీళ్ళు చేశారని అభినందిస్తున్నారు. పై స్థాయి అధికారులు ఇప్పుడు ఏమి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.