ఢిల్లీతో పంత్ కటీఫ్ ! మెగావేలంలోకి స్టార్ కీపర్

ఐపీఎల్ రిటెన్షన్ జాబితా సమర్పించేందుకు గడువు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారనుకున్న ఫ్రాంచైజీల జాబితాలో మార్పులు తప్పేలా లేవు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగలబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2024 | 03:03 PMLast Updated on: Oct 24, 2024 | 3:03 PM

Pant Katif With Delhi Star Keeper Into Mega Auction

ఐపీఎల్ రిటెన్షన్ జాబితా సమర్పించేందుకు గడువు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా రిటైన్ చేసుకుంటారనుకున్న ఫ్రాంచైజీల జాబితాలో మార్పులు తప్పేలా లేవు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్ తగలబోతోంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఢిల్లీ ఫ్రాంచైజీని వీడనున్నాడు. కెప్టెన్సీ విషయంలో వచ్చిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. పంత్ ను కెప్టెన్ గా తప్పించి అక్షర్ పటేల్ కు పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని పంత్‌ వ్యతిరేకించాడని, సారథి బాధ్యతలు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దీనికి యాజమాన్యం అంగీకరించకపోవడంతో పంత్ ఢిల్లీ ఫ్రాంచైజీని వీడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లో పంత్ కే మొదటి ప్రయారిటీ. కెప్టెన్సీని మార్చినప్పటికీ, పంత్ ఫ్రాంచైజీకి కీలక ఆటగాడిగా ఉండ‌నున్నాడు. ఎందుకంటే గ‌త ఐపీఎల్ సీజ‌న్ లో రిష‌బ్ పంత్ ఢిల్లీ త‌ర‌ఫున చాలా కాలం త‌ర్వాత గ్రౌండ్ లోకి వ‌చ్చి మంచి ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. అత‌ని పై జ‌ట్టు ఒత్తిడి లేకుండా చేయ‌డానికి కెప్టెన్సీని మ‌రో ప్లేయ‌ర్ కు అప్ప‌గిస్తున్నార‌ని ఇప్పుడు టాక్ న‌డుస్తోంది. కెప్టెన్సీ ఒత్తిడి లేకుంటే అతను మరింతగా రాణిస్తాడని ఫ్రాంచైజీ ఆలోచనగా ఉంది. దీనికి పంత్ మాత్రం ఒప్పుకోలేదని వార్తలు వస్తున్నాయి. కాగా కెప్టెన్సీ మార్పు విషయంలో ఢిల్లీ ఫ్రాంచైజీ ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. అయితే అందని ద్రాక్షగా మిగిలిన ఐపీఎల్ టైటిల్ కలను వచ్చే సీజన్‌లో నెరవేర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల పలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంది.

ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్‌ను కోచ్ గా తప్పించి హేమంగ్ బదానీకి బాధ్యతలు అప్పగించింది. అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి తొలగించిన ఢిల్లీ ఆంధ్రా క్రికెటర్ వేణుగోపాల్ రావును ఎంపిక చేసుకుంది. ఇదిలా ఉంటే బీసీసీఐ ఈ సారి ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా 18 కోట్లు, 14 కోట్లు, 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి 18 కోట్లు, 14 కోట్లు చెల్లించాలి. ఇక రిటెన్షన్ జాబితాను సమర్పించేందుకు అక్టోబర్ 31వ తేదీ డెడ్ లైన్ గా నిర్ణయించింది. కాగా ఐపీఎల్ మెగావేలం నవంబర్ చివరివారంలో విదేశాల్లో జరగబోతోంది.