పంత్,సిరాజ్ పై వేటు, సిడ్నీ టెస్టుకు తుదిజట్టు ఇదే
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ కోసం భారత్ రెడీ అయింది. బాక్సింగ్ డే టెస్టును డ్రా చేసుకునే అవకాశం ఉన్నా అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా సిరీస్ లో 1-2తో వెనుకబడింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి మ్యాచ్ కోసం భారత్ రెడీ అయింది. బాక్సింగ్ డే టెస్టును డ్రా చేసుకునే అవకాశం ఉన్నా అనూహ్యంగా పరాజయం పాలైన టీమిండియా సిరీస్ లో 1-2తో వెనుకబడింది. ఇప్పుడు సిరీస్ ను సమం చేయాలంటే సిడ్నీ వేదికగా జరిగే చివరి మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే.. ఈ నేపథ్యంలో తుది జట్టుపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మను సైతం తప్పిస్తారన్న వార్తలు వినిపిస్తున్న వేళ తుది జట్టులో పలు మార్పులు జరగనున్నాయి. ఇప్పటికే గాయంతో ఆకాశ్ దీప్ దూరమవగా అతని స్థానంలో హర్షిత్ రాణా జట్టులోకి రావడం ఖాయమైంది. అదే సమయంలో హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ పైనా వేటు పడే అవకాశం కనిపిస్తోంది. గత టూర్ లో అదరగొట్టిన సిరాజ్ ఈ సారి మాత్రం నిరాశపరిచాడు. బుమ్రాకు సరైన సపోర్ట్ ఇవ్వడంలోనూ, వికెట్లు తీయడంలోనూ విఫలమయ్యాడు. దీంతో సిరాజ్ ను తప్పించి ప్రసిద్ధ కృష్ణను ఆడించే ఛాన్సుంది.
ఇదిలా ఉంటే వైఫల్యాల బాటలో ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ను కూడా తప్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత మ్యాచ్ లో పంత్ నిర్లక్ష్యపు షాట్లు ఆడి ఔటవవ్వడంతో గవాస్కర్ వంటి మాజీలు అతనిపై మండిపడ్డారు.రిషబ్ పంత్ స్థానంలో ధృవ్ జురెల్ తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంత్ ఈ సిరీస్ లో ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 154 పరుగులు చేశాడు. దీంతో అతన్ని తప్పించాలని డిమాండ్ వచ్చింది. అయితే పెర్త్ టెస్ట్ లో ఆడిన ధృవ్ జురెల్ ఆకట్టుకోలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో 11, 1 పరుగులు చేశాడు. అంతే కాకుండా వాషింగ్టన్ సుందర్, జడేజా ల్లో ఒకరిని మాత్రమే తుది జట్టుకు తీసుకునే అవకాశం ఉంది.
రోహిత్ తుది జట్టులో ఉంటే మాత్రం ఓపెనర్ గానే కొనసాగుతాడని చెబుతున్నారు. దీంతో జైశ్వాల్, రోహిత్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా.. కెఎల్ రాహుల్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. నితీశ్ రెడ్డి తన ప్లేస్ ను పటిష్టం చేసుకోగా..స్పిన్నర్ గా జడేజా వైపే టీమ్ మేనేజ్ మెంట్ మొగ్గుచూపుతోంది. మొత్తం మీద సిడ్నీ పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక స్పిన్నర్ కే చోటు దక్కనుంది.