పంత్ ఫ్లాప్ షో, టెన్షన్ లో లక్నో ఫ్రాంచైజీ
ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి రిషబ్ పంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత పర్యటనలో గబ్బా వేదికగా హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి సంచలన విజయం అందించిన పంత్ ఇప్పుడు పూర్తిగా నిరాశపరిచాడు.
ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి రిషబ్ పంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత పర్యటనలో గబ్బా వేదికగా హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడి సంచలన విజయం అందించిన పంత్ ఇప్పుడు పూర్తిగా నిరాశపరిచాడు. ముఖ్యంగా గత రెండు టెస్టుల్లో అతను కొట్టిన షాట్లపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 104 బంతుల్లో 30 పరుగులు చేసిన రిషబ్ పంత్ అవుట్ అయిన విధానం నిపుణులను ఆశ్చర్యపరిచింది. మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో పంత్ చాలా క్లిష్టమైన సమయంలో తన వికెట్ సమర్పించుకున్నాడు. 104 బంతులు ఎదుర్కొని క్రీజులో నిలదొక్కుకున్నాడని అంతా భావించగా అందరి అంచనాలను తలక్రిందులు చేసి పంత్ వికెట్ కోల్పోయి విమర్శలపాలయ్యాడు. పంత్ మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయేది కాదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.
పంత్ అవుట్ పై స్పందించిన ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ అతనికి కోచింగ్ మరియు బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు. నిజానికి జస్టిన్ లాంగర్ ఐపీఎల్ లో లక్నో జట్టుకు ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. మెగా వేలంలో పంత్‌ను ఎల్‌ఎస్‌జి 27 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. బహుశా వచ్చే సీజన్లో పంత్ లక్నో కెప్టెన్ కూడా అయ్యే అవకాశముంది. ఈ పరిస్థితిలో పంత్ లాంగర్ ఆధ్వర్యంలోనే ఆడాల్సి ఉంది. ఇప్పుడు లాంగర్ కి పంత్ పై ఓ అవగాహన వచ్చినట్టుంది. అతని బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాడు. తొలుత పంత్ పై భారీ ఆశలు పెట్టుకున్న లక్నో కోచ్ , ఇప్పుడు అతని బ్యాటింగ్ పై ఆందోళన చెందుతున్నాడు. మరి ఐపీఎల్ ప్రారంభం సమయానికి పంత్ తన బ్యాటింగ్ తీరును మార్చుకుని లక్నోకు బలమైన ఆటగాడిగా మారతాడో లేదో చూడాలి.
అంతకుముందు పంత్ తీరుపై సునీల్ గవాస్కర్ కూడా విమర్శలు గుప్పించారు. రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఏరియల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి ఔటయ్యాడు. మొదటి ఇన్నింగ్స్‌లో అవుట్ అయినప్పుడు సునీల్ గవాస్కర్ పంత్ పై విమర్శలు చేశాడు. అతని షాట్‌ను స్టుపిడ్ షాట్ అని పేర్కొన్నాడు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో 4 టెస్టులు ఆడిన రిషబ్ పంత్ 7 ఇన్నింగ్స్‌ల్లో 154 పరుగులు మాత్రమే చేశాడు. అతని టాప్ స్కోరు 37 పరుగులు. అతని వైఫల్యం భారత జట్టు ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపింది