Pawan vs YCP: బహిరంగ సభా.. సినిమా షూటింగా..? పవన్ తీరు మారకపోతే కష్టమే.. ఆ ఒక్క సీటూ రాదు!
ఒక స్పీచ్‌కి మరో స్పీచ్‌కి పొంతన ఉండదు..అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకాదు..పిఠాపురం బహిరంగ సభలోనూ సినిమా డైలాగులే వినిపించాయి..!
సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు.. రెండిటిలోనూ వాడాల్సిన డైలాగులూ వేరు. బహిరంగ సభలకు వచ్చేవాళ్లని అభిమానులగా భావించకూడదు.. పార్టీ కార్యకర్తలగానే చూడాలి.. వాళ్లని సరైన దారిలో నడిపించడం నాయకత్వ లక్షణం..! అంతేకాని బహిరంగ సభలకు వచ్చిన వాళ్లని, టీవీల్లో లైవ్ చూస్తున్న వాళ్లని రెచ్చగొట్టడం.. నడ్డి విరుస్తానని సినిమా డైలాగులు పేల్చడం తెలుగు రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కే చెల్లింది. సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలిత లాంటి వాళ్లు ఎందరో వచ్చారు.. సీఎంలుగా రాణించారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో అలానే ఉన్నారు..కానీ పవన్ స్పీచ్‌లు నిత్యం రెచ్చగొట్టడంపైనే తిరుగుతున్నాయి.. ప్రజలకు ఏం చేస్తాడో చెప్పకుండా అధికార పక్షంపైనే చిందులు వేయడం అప్పుడెప్పుడో ముగిసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడిని తలపిస్తున్నాయి. పిఠాపురం సభలోనూ పవన్ కల్యాణ్ అదే ఫార్ములాను ఉపయోగించారు.
నన్ను సీఎంను చేయండి:
నిన్నమొన్నటివరకు తనకు బలం లేదు అని.. తనకు వచ్చే సీట్లతో సీఎంను కాలేనని.. కాపులు కొంపముంచారని..ఇంకో మతం ఆలోచించి ఓట్లు వేయాలని..ఓవరాల్‌గా చంద్రబాబే సీఎం అవుతారని పార్టీ కార్యకర్తలకు అర్థమయ్యేలా చెప్పిన పవన్ కల్యాణ్.. పిఠాపురం సభలో మాత్రం తనను సీఎం చేయాలని అభ్యర్థించాడు. ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ ఖడ్గం సినిమాలో రవితేజలా డైలాగులు వేశారు. ఇదేంటి మొన్నే కదా.. నేను సీఎం కాలేనని చెప్పుకున్నాడు.. మళ్లీ ఇంతలోనే సీఎం చేయమంటాడు ఏంట్రా బాబు అని పవన్ అభిమానులే కాసేపు ఆలోచనలో పడాల్సి వచ్చిందంటే మాటల్లో ఆయనకు లేని నిలకడ స్పష్టంగా కనిపిస్తోంది.
నోటికి వచ్చింది మాట్లాడేస్తే ఎవరూ పట్టించుకోరు అనడం తెలివి తక్కువ తనం అవుతుంది.. ఇదేమీ ‘ఆ కాలం’ కాదు.. మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. ప్రతి స్పీచ్ టెలిక్యాస్ట్ అవుతుంది. అన్నీటికంటే ముఖ్యంగా సోషల్‌మీడియా ఉంది. ఇవ్వని తెలిసి కూడా పవన్.. రోజుకో మాట మాట్లాడితే ఎలా..? ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్ పాలనపై చాలా జిల్లాల్లో వ్యతిరేకత ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో కాస్త బుర్ర పెట్టి స్పీచ్‌లు ఇస్తే ఓట్లు వచ్చే అవకాశముంటుంది. నేనేం చెప్పినా అరిచి..గోల పెట్టే అభిమానులు ఉన్నారులే.. నాకే ఓట్లు పడతాయన్న భ్రమల్లో ఉంటే 2019ఎన్నికల్లో పట్టిన గతే పడుతుంది.
ఒక విజన్ లేకుండా.. ఒక ఏజెండా లేకుండా.. ప్రజలకు ఏం చేస్తానో చెప్పకుండా వైసీపీపై బురద జల్లడానికి మాత్రమే పరిమితమైతే ఆ ఒక్క సీటు కూడా ఈసారి రాదు..అందులో వచ్చే సారి పోటి చేసేది మాహా అయితే 35స్థానాల్లో. ఇక నుంచైనా పవన్ తన సినిమా నేచర్‌ని కాకుండా తనలో ఉన్న నిజమైన లీడర్‌ని బయటకు తీసి మాట్లాడాలని ఆయన మంచి కోరే అభిమానులే కోరుకుంటున్నారు.. పిచ్చొళ్లు ఎలాగో ఏం చెప్పినా ‘ఊ’ అంటారు. వాళ్ల ఓట్లతో ఒరిగేదేమీ ఉండదని 2019ఎన్నికలే నిరూపించాయి.. చేసిన తప్పే మళ్లీ చేయకుండా పవన్ తన వ్యూహాన్ని మారిస్తే ఆయన కోరుకున్న గూండాగిరి లేని రాజ్యం రావొచ్చు..!