Pawan Kalyan: జనసేన అధ్యక్షుడా.. టీడీపీ కార్యకర్తా? పవన్ తీరుపై కొత్త చర్చ
పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో ఉన్నపళంగా పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు.
చంద్రబాబు అరెస్ట్ ఎపిసోడ్ రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. వైసీపీ కావాలని టార్గెట్ చేసిందా.. నిజంగా చంద్రబాబు కుంభకోణానికి పాల్పడ్డారా అన్న సంగతి పక్కనపెడితే.. అధికార, విపక్షాల మధ్య మంటలు రేపుతోందీ వ్యవహారం. టీడీపీ అధినేత వ్యవహారంలో పవన్ కల్యాణ్ వ్యవహరించిన తీరు.. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో కొత్త చర్చకు కారణం అవుతోంది. నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత.. రోడ్డు మార్గం ద్వారా విజయవాడ సిట్ ఆఫీస్‌కు తరలించారు అధికారులు. దీంతో ఆయనకు మద్దతు తెలిపాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిక్స్ అయ్యారు.
స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లాలి అనుకుంటే.. అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో రోడ్డు మార్గంలోనే విజయవాడకు స్టార్ట్ అయ్యారు. మధ్యలో పోలీసులు అడ్డుకోవడం.. కారు దిగి నడుచుకుంటూ పవన్ కల్యాణ్ విజయవాడ వెళ్లే ప్రయత్నం చేయడం.. పోలీసులు మళ్లీ అడ్డుకోవడంతో రోడ్డు మీదే పడుకోవడం.. ఇలా శనివారం రాత్రి జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇదే ఇప్పుడు పవన్ విషయంలో కొత్త చర్చకు కారణం అవుతోంది. నిజానికి వైజాగ్ టూర్ సమయంలో పవన్‌ను హోటల్‌లోనే బంధించినప్పుడు చంద్రబాబు వెళ్లి సంఘీభావం తెలిపారు. దానికి ప్రతిగా ఇప్పుడు పవన్ కూడా చెప్పాలి అనుకోవడం తప్పులేదు. ఐతే రోడ్డు మీద పవన్ వ్యవహరించిన తీరే కొత్త చర్చకు కారణం అవుతోంది. దీన్ని అడ్డు పెట్టుకొని జనసేనానిని వైసీపీ టార్గెట్ చేస్తోంది. లోకేశ్ చేయని హడావుడి కూడా పవన్ ఎందుకు చేస్తున్నట్లు అని నిలదీస్తోంది.
నిజానికి టీడీపీ, జనసేన మధ్య అధికారికంగా ఎలాంటి పొత్తు లేదు. అలాంటిది పవన్ ఇంత హడావుడి చేయడం ఎందుకు అంటూ వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయ్. పవన్ కల్యాణ్ జనసేన అధ్యక్షుడిలా కాకుండా.. టీడీపీ కార్యకర్తలా పనిచేశారని ఆరోపణలు గుప్పిస్తున్నాయ్. చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పవన్‌ను ప్రతీసారి టార్గెట్ చేసే వైసీపీ శ్రేణులు.. ఆ మాటకు ఇదే సాక్ష్యం అంటూ రోడ్డు మీద పవన్ పడుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు చేస్తున్నాయ్. దీనికితోడు అచ్చెన్నాయుడు ఆడియో రేపుతున్న అలజడి మరో రేంజ్. కోర్టు ప్రాంగణంలోటీడీపీ కార్యకర్తలు ఎవరూ లేరు.. తరలిరండి అంటూ అచ్చెన్నాయుడు పార్టీ నేతలకు ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన ఆడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చంద్రబాబు అరెస్ట్‌ను టీడీపీ నేతలు, కార్యకర్తలే లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తే.. నీకెందుకు పవన్ ఇంత ఓవరాక్షన్ అంటూ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయ్ వైసీపీ శ్రేణులు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ పవన్ వీడియో రిలీజ్ చేశారు మొదట్లోనే ! నిజానికి అది సరిపోయేదేమో.. విజయవాడకు బయల్దేరడం.. మధ్యలో హడావుడి చేయడం.. ఇదంతా కావాలని చేసిన రచ్చలాగే ఉంది తప్ప మరొకటి కాదు అని విశ్లేషకుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయ్. ఏమైనా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపునకు కారణం కావడం ఖాయంగా కనిపిస్తోంది.