బెజవాడ కోసం పవన్ తో బాలయ్య భేటీ, భారీ కార్యక్రమానికి ప్లాన్
విజయవాడలో భారీ వరదలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేకపోయినా భారీ వరద రావడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కృష్ణా నది మరో వైపు బుడమేరు వాగు విజయవాడకు చుక్కలు చూపిస్తున్నాయి.
విజయవాడలో భారీ వరదలతో ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. వర్షాలు లేకపోయినా భారీ వరద రావడంతో ప్రజలు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఒకవైపు కృష్ణా నది మరో వైపు బుడమేరు వాగు విజయవాడకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంకా పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తూ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. విజయవాడ ప్రజల కష్టాలను చూసిన సినిమా ప్రముఖులు సైతం రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా విరాళం అందిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, విశ్వక్ సేన్, ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ సాయం చేసారు. ఎన్టీఆర్ 10 లక్షలు, విశ్వక్ సేన్ 10 లక్షలు అశ్వనీ దత్ 25 లక్షలు సాయం ప్రకటించారు. ఇంకా సినిమా వాళ్ళు అందరూ ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని నందమూరి బాలకృష్ణ భావిస్తున్నారు. గతంలో వైజాగ్ కు హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో మేము సైతం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు అదే తరహాలో విజయవాడ కోసం నిర్వహించే ప్లాన్ లో ఉన్నారట.
ఇందుకోసం పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని వైజాగ్ లో నిర్వహించే యోచనలో ఉన్నారట. ఈ కార్యక్రమానికి సినీ, వ్యాపార ప్రముఖులను ఆహ్వానించే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో భేటీ అయి దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని సమాచారం. వచ్చే నెలలో లేదా ఈ నెల చివర్లో ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం కనపడుతోంది. వరద బాధితుల కోసం బట్టలు, గృహాలకు సంబంధించిన వస్తువులు, ఆహారం సహా పలు సహాయాలను చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మెగా హీరోలను విజయవాడ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. జోలె పట్టి విరాళాలను సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించే విధంగా మెగా హీరోలు కార్యక్రమాలు చేయాలని పవన్ కోరినట్టు సమాచారం.