Janasena: పవన్ చేస్తున్న తప్పు అదేనా ? మేల్కోపోతే భారీ దెబ్బ తప్పదా ?
పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సూపర్ రెస్పాన్స్ కనిపిస్తోంది. వైసీపీని టార్గెట్ చేస్తూ సేనాని గుప్పిస్తున్న విమర్శలు.. ఫ్యాన్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయ్. వన్ వర్సెస్ మెనీ అన్నట్లు.. పవన్‌ను ఒక్కడికి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీలో బడా నేతలంతా మైకుల ముందు కనిపిస్తున్నారు. ప్రభుత్వం ప్రతీ ఫెయిల్యూర్‌ను ప్రశ్నగా సంధిస్తున్న పవన్.. సమాధానం చెప్పండి అంటూ వైసీపీని నిలదీస్తున్నారు.
పవన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో కంగారు కనిపిస్తుండగా.. జనసేన నాయకుల్లో మాత్రం ఉత్సాహం రెట్టింపు అవుతోంది. పవన్ పొలిటికల్ దూకుడు చూస్తుంటే.. ఇక జనసేనకు తిరుగు ఉండదేమో.. వచ్చే ఎన్నికల్లో సంచనాలు ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఇక్కడివరకు అంతా బాగానే ఉన్నా.. కొన్ని విషయాలు మాత్రం జనసేన నేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయ్. ఆ పార్టీకి ఇబ్బందికర పరిణామాలుగా మారాయ్. వారాహి యాత్ర అంటూ పవన్ సక్సెస్ అయినా.. ఆయన చేస్తున్న తప్పు ఇదే అంటూ కొత్త చర్చ మొదలైంది రాజకీయవర్గాల్లో.
పవన్ ప్రసంగాలు సూపర్.. ఎవరూ కాదనలేరు కూడా ! జనసేనకు అన్నీ తానే అన్నట్లు కనిపిస్తున్నారు. ఇదే ప్లస్.. భారీ మైనస్‌గా మారుతోంది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా.. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులపై సేనాని పెద్దగా దృష్టి సారించడం లేనట్లు కనిపిస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జిలను నియమించే విషయంలోనూ.. పవన్ స్లో అయిపోయారు. సొంతపార్టీలోనే ఇలాంటి చర్చ జరుగుతోంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడంలో.. అభ్యర్థుల ప్రకటన విషయంలో టీడీపీ, వైసీపీ ముందంజలో కనిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే విషయంపై సర్వేలు నిర్వహించుకున్న ఆ రెండు పార్టీలు.. ఇప్పటికే ఓ క్లారిటీకి కూడా వచ్చేశాయ్. అభ్యర్థిని ముందు పెట్టి జనాల్లోకి వెళ్లేందుకు రెండు పార్టీలు రెడీ అవుతుంటే.. ఆ విషయంలో జనసేన మాత్రం వెనకే ఉండిపోయింది.
ఇదే జనసేనకు మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయ్. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే జనసేన ముందుకు వెళ్లబోతుందని క్లారిటీ వచ్చేసింది. ఐతే నియోజకవర్గాల విషయంలోనే స్పష్టతలేదు. ముందుగానే ఇంచార్జిలను ప్రకటిస్తే.. కార్యకర్తలు యాక్టివ్ అయ్యే చాన్స్ ఉంటుంది. క్షేత్రస్థాయిలోనూ బలం పుంజుకునే అవకాశాలు ఉంటాయ్. ఐతే అలాంటి ప్రయత్నాలేవీ జనసేనలో కనిపించడం లేదు. గోదావరి జిల్లాలను మినహాయిస్తే.. చాలా నియోజకవర్గాల్లో జనసేన యాక్టివిటీస్ కనిపించడం లేదు. లెక్కతీసి కొడితే ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ బలహీనతలు బయటపెట్టడమే కాదు.. సొంత పార్టీ బలం పెంచుకోవడం మీద కూడా నజర్ పెట్టాలి. ఇప్పుడు పవన్ చేయాల్సింది అదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.