BCCI: రోహిత్‌ శర్మకు దిక్కు లేదు.. చేదు నిజాన్ని బయటపెట్టిన హర్భజన్‌ సింగ్‌..!

ఇటివలి కాలంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎదుర్కొంటున్న విమర్శలపై మాజీ స్టార్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్పందించాడు. జట్టు వైఫల్యానికి రోహిత్‌ ఒక్కడినే బాధ్యుడిని చేయడం తగదన్నాడు!

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 11, 2023 | 01:32 PMLast Updated on: Jul 11, 2023 | 1:32 PM

People Are Going Overboard While Criticising Rohits Captaincy Says Harbhajan Singh

గంగూలీకి దాల్మియా ఉండేవాడు.. ధోనీకి శ్రీనివాసన్‌ ఉండేవాడు..కోహ్లకీ వినోద్‌ రాయ్‌ ఉండేవాడు.. రోహిత్‌ శర్మకు ఎవరున్నారు..? ఏమో బీసీసీఐ పెద్దలే చెప్పాలి.. జట్టు వైఫల్యాలకు రోహిత్‌ శర్మ ఎప్పుడూ బాధ్యుడే.. అది సోషల్‌మీడియాలోనైనా.. మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలోనైనా రోహితే బలిపశువు. కోహ్లీ నుంచి రోహిత్‌కి కెప్టెన్సీ రావడంతో సాధారణంగానే విరాట్‌ ఫ్యాన్స్‌ హిట్‌మ్యాన్‌ని టార్గెట్ చేస్తుంటారు. ధోనీ కాకుండా మరే కెప్టెన్‌ కూడా సక్సెస్‌ అవ్వకూడదన్న కుళ్లు కొందరి మహేంద్రుడి ఫ్యాన్స్‌ది. ఇలా రోహిత్‌ శర్మకు మద్దతిచ్చేవాళ్ల సంఖ్య కంటే పనిగట్టుకొని విమర్శించేవాళ్ల సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. టీమిండియా మాజీ ఆటగాడు, ఒకప్పుడు ముంబై ఇండియన్స్‌ ప్లేయర్‌ హర్భజన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ఇదే అర్థం ఉండి ఉండొచ్చు..? నేరుగా ఇలా మాట్లాడకున్నా అతని ఉద్దేశం ఇదేనన్న ప్రచారం జరుగుతోంది.

హర్భజన్‌ ఏమన్నాడంటే..?
ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన WTC ఫైనల్‌లో టీమిండియా ఓటమి విషయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మపైనే విమర్శలు చేయడం తగదని హర్భజన్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు . WTC ఫైనల్‌లో రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో భారత్‌ ఓడిపోయిందని మాజీ క్రికెట్‌ సునీల్‌ గవాస్కర్‌తోపాటు మరికొంతమంది మాజీలు విమర్శించడాన్ని హర్భజన్‌ తప్పుబట్టాడు. మరో మూడు నెలల్లో వన్డే ప్రపంచకప్‌ ఉందని కెప్టెన్‌కి బీసీసీఐ నుంచి సంపూర్ణ మద్దతు కావాలని కొరాడు. క్రికెట్ అన్నది టీమ్‌ గేమ్ అని.. జట్టు మొత్తం విఫలమైన చోట కేవలం కెప్టెన్‌ని మాత్రమే విమర్శించడం కరెక్ట్ కాదన్నాడు భజ్జి. అలాగే గెలిచినప్పుడు కూడా క్రెడిట్‌ కెప్టెన్‌కి మాత్రమే ఇవ్వడం సరైనది కాదన్నాడు. రోహిత్‌ని టార్గెట్‌ చేయడం అన్యాయమని..అతడో అద్భుతమైన కెప్టెన్‌ అన్న విషయం మరవద్దన్నాడు.

రోహిత్‌కి మద్దతు లేదా..?
రోహిత్‌ని సపోర్ట్‌ చేసే క్రమంలో హర్భజన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలు బీసీసీఐకి చురకలంటించే విధంగా ఉన్నాయి. బీసీసీఐ నుంచి సపోర్ట్‌ ఉంటే స్వేచ్ఛగా పని చేసుకోవచ్చు అని. ధోనీ, విరాట్‌ కోహ్లీలతోపాటు చాలామంది కెప్టెన్లకు బీసీసీఐ నుంచి మద్దతు లభించిందన్నాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న కాలంలో బోర్డు అధ్యక్షుడిగా ఉన్న దాల్మియా దాదా వెంటే నిలిచాడని.. అటు ధోనీ కెప్టెన్‌గా ఉన్న టైమ్‌లో బోర్డు ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీనివాసన్‌ మహేంద్రుడికి తోడు నీడగా నిలిచాడన్నాడు భజ్జి. అటు బీసీసీఐలో కీలక పదవుల్లో ఉన్న వినోద్‌ రాయ్‌ కోహ్లీకి అండదండలు అందించిన విషయం మరవద్దన్నాడు. అయితే రోహిత్‌కి కూడా బీసీసీఐ నుంచి సపోర్ట్ ఉండే ఉంటుందని..కానీ అది ఏ స్థాయిలోనో నాకైతే తెలియదంటూ పరోక్ష విమర్శలు చేశాడు భజ్జి. సపోర్ట్ ఉంటేనే రోహిత్‌ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలడని.. బీసీసీఐ తన కెప్టెన్లందరికీ ఏ విధంగానైతే మద్దతుగా నిలిచిందో రోహిత్‌ శర్మకు కూడా అదే విధంగా అండగా ఉండాలని భావిస్తున్నట్టు చెప్పాడు హర్భజన్ సింగ్. భజ్జి వ్యాఖ్యలను రోహిత్ అభిమానులు సపోర్ట్ ఇస్తున్నారు.

ఐపీఎల్‌లో ముంబై జట్టు సారధిగా సంచలనాలు సృష్టించిన రోహిత్‌కి ఆ టీమ్‌ యాజమాన్యం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అక్కడంతా రోహిత్‌ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. టీమిండియా తరఫున మాత్రం ప్రస్తుతం బోర్డులోనే పెద్దలే కెప్టెన్‌ని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా డిసిషన్‌ తీసుకోవాలన్న కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ని అడుగుతున్నారని.. రోహిత్‌ని రానివ్వడంలేదన్న టాక్‌ ఉంది. కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యాని నియమించాలన్న ఆలోచన బోర్డు పెద్దల మనసులో ఉందని..అందుకే ఇలా పొమ్మనలేక పొగ పెడుతున్నారంటున్నారు ఫ్యాన్స్..!