తిరుమలని భ్రష్టుపట్టించింది ఎవరు? వెంకన్న ప్రతిష్టని దిగజార్చింది రాజకీయాలు కాదా?

ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశమంతా ఒక రకమైన అసహ్యకరమైన భావనతో చూస్తోంది. వైసిపి ,టిడిపి పార్టీలు గడచిన 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని తమ అధికారం కోసం ఏ స్థాయికి అయినా దిగజారి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండింటికి జనసేన కూడా తోడైంది .

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 24, 2024 | 06:03 PMLast Updated on: Sep 24, 2024 | 6:03 PM

Political Parties Use Tirumala For Their Politics

ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశమంతా ఒక రకమైన అసహ్యకరమైన భావనతో చూస్తోంది. వైసిపి ,టిడిపి పార్టీలు గడచిన 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని తమ అధికారం కోసం ఏ స్థాయికి అయినా దిగజారి చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండింటికి జనసేన కూడా తోడైంది . ఒక పార్టీనీ నాశనం చేయడానికి మరో పార్టీ రాష్ట్రాన్ని, సంస్కృతిని… వనరుల్ని , కులాలని, మతాలని, వర్గాలను అన్నిటిని అడ్డంగా పెట్టి గేమ్ ఆడుతున్నాయి. కేవలం అధికారం కోసం ఏం చేయడానికయినా తెగ పడుతున్నాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏపీలో పార్టీలు వెనక్కి తగ్గడం లేదు. చివరికి ఏపీ రాజకీయాలు అత్యంత ప్రతిష్టాత్మకమైన హైందవ పుణ్యక్షేత్రం తిరుమలని కూడా బ్రష్టు పట్టించాయి రాజకీయ లబ్ధి కోసంశ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా అప్రతిష్ట పాలు చేశాయి.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీని ఇదే అదునుగా పూర్తిగా పాతాళానికి తొక్కేసే పనిలో పడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన కొవ్వు కలిపారంటూ సీఎం స్థాయిలో ఆయన ఒక ఆరోపణ చేశారు. ఆరోపణ చేసిన కొన్ని గంటల్లోనే లడ్డు క్వాలిటీ పై ఎన్ డి డి బి నివేదిక బయటకు వచ్చింది. జూలై 23న ఇచ్చిన నివేదిక సుమారు రెండు నెలల తర్వాత జనంలోకి ఎలా వచ్చిందో, ఇప్పుడే ఎందుకు వచ్చిందో టీటీడీ ఈవో శ్యామల రావు, సీఎం చంద్రబాబు నాయుడు కే తెలియాలి. అక్కడి నుంచి రీజనల్, నేషనల్ మీడియా మొత్తం ఒక పథకం ప్రకారం లడ్డు చుట్టూ తిరిగాయి. హిందూ సమాజం మొత్తం ఉలిక్కిపడింది. లడ్డులో పంది కొవ్వు కలిపారంటూ వచ్చిన ఆరోపణలు మొత్తం మాజీ ముఖ్యమంత్రి జగన్ కి చుట్టేయగలిగారు చంద్రబాబు. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా తిరుమల ప్రతిష్ట ఒక్కసారిగా పడిపోయింది. చంద్రబాబు అంతటితో ఊరుకోలేదు లడ్డు అపవిత్రమైనది కనుక దీనికి సంప్రోక్షణ, మహా శాంతి యాగం చేయాలని తలపెట్టారు. తద్వారా ఈ వివాదాన్ని మరికొన్ని రోజులు కొనసాగించారు. చంద్రబాబు శిక్షణలో ఇప్పుడిప్పుడే రాజకీయాలు నేర్చుకుంటున్న పవన్ కళ్యాణ్ కూడా 11 రోజుల దీక్ష అంటూ మరో డ్రామా కి తెర లేపారు. మొత్తంగా ఈ ఎపిసోడ్ తిరుమల ప్రతిష్టను దిగజార్చింది. లడ్డు ప్రాధాన్యాన్ని, విలువను తగ్గించింది. జగన్మోహన్ రెడ్డిని వైసీపీని నామరూపాలు లేకుండా చేయడానికి చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం మీడియా చేసిన ప్రయత్నం ఫైనల్ గా తిరుమల ప్రతిష్టను , లడ్డు విలువను దిగజార్చింది. ఈ వ్యవహారం మొత్తం ప్రధాని కార్యాలయానికి, సుప్రీంకోర్టు కి చేరింది. ఎన్డిడిబి అనుమానాలపై ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది.

తిరుమల ప్రతిష్ట ఇప్పుడు కొత్తగా దిగజారడానికి ఏముంది ?అది ఎప్పుడో మసక బారింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సామాన్య ప్రజలకు మాత్రమే దేవుడు. లీడర్లు, బిజినెస్ మాన్ లకు తిరుమల ఒక వ్యాపార కేంద్రం. వ్యాపార సంబంధాలు పెంచుకోవడానికి, రాజకీయ సంబంధాలు పెంచుకోవడానికి తిరుమల ఒక అడ్డ. సామాన్య భక్తులకు వెంకన్న ఒక ఎమోషన్. తెలుగు రాష్ట్రాల్లో స్వామి ఫోటో లేని ఇల్లు ఉండదు. ఆయన అంటే ఒక పిచ్చి ప్రేమ. భక్తి. అభిమానం. అంతటి ప్రతిష్టాత్మమైన తిరుమలను రాజకీయ పార్టీలు చెరపట్టాయి. తిరుమల పేరుకే భక్తులది. కానీ ఆదిపత్యం మొత్తం ప్రభుత్వానిది. అధికార పార్టీది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు తిరుమలలో తమ కుటిల , కుల రాజకీయాలకు అడ్డాగా మార్చే సాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును రాజకీయ వ్యాపార అవసరాలకు కేరాఫ్ అడ్రస్ గా మార్చారు. ఏకంగా 90 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు చేశారు. దీనిని రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, ఆదానీ అంబానీల ప్రతినిధులు, కాంట్రాక్టర్లు, పైరవీకారులు, మంత్రి పదవులు రాని వాళ్ళతో నింపేశారు. దేశం మొత్తాన్ని నడిపించే కేంద్ర మంత్రివర్గం కన్నా ఇది పెద్దది అంటే వెంకన్న సన్నిధి నీ ఎంతగా బ్రష్టు పట్టించారో అర్థం చేసుకోవచ్చు. ఒకటి మాత్రం నిజం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే తిరుమల పూర్తిస్థాయిలో బ్రష్టు పట్టిపోయింది. ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే అతని కులం వాళ్లు తిరుమల పై ఆధిపత్యం చాలఇస్తారు. జగన్మోహన్ రెడ్డి పవర్ లో ఉంటే అతని బాబాయ్ వై వి సుబ్బారెడ్డి, కుటుంబ మిత్రుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్లు అవుతారు. జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి జేఈవోలు ఈవోలుగా చక్రం తిప్పుతారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుమలలో తెరవెనక కార్యక్రమాలన్నీ నిర్వహిస్తాడు. వెంకటేశ్వర స్వామిని వెంకటేశ్వర రెడ్డి గా మార్చడం ఒక్కటే చేయలేదు జగన్ గ్యాంగ్. చంద్రబాబు నాయుడు కూడా తక్కువేం తినలేదు. ఆయన హయాంలోనూ తిరుమల కొండపై కమ్మ వాళ్ళ ఆదిపత్యం నడిచింది. నిన్న గాక మొన్న అధికారంలోకి రాగానే జె ఈ ఓ గా వెంకయ్య చౌదరిని ఆగమేఘాలపై నియమించారు చంద్రబాబు. ఇక చైర్మన్ గా కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఒక న్యూస్ ఛానల్ అధిపతి, ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ మరికొందరు ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ మురళీమోహన్ అయితే అప్పట్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏకంగా వెంకటేశ్వర చౌదరి అని సంబోధించి ఆ తర్వాత నాలిక కరుచుకున్నారు . వైసిపి, టిడిపి రెండు పార్టీలు రెండు తిరుమలను చెరపట్టాయి. వెంకన్న ప్రతిష్టను మంట కలిపాయి .

టీటీడీ చైర్మన్ పోస్టు రాజకీయ నాయకుడికి మాత్రమే ఇవ్వాలి. భక్తితో, ఆచారంతో, నిజాయితీతో, ప్రవర్తనతో, గత చరిత్రతో సంబంధం లేదు. గడిచిన 20 ఏళ్లుగా పాలక పార్టీలన్నీ ఇదే సూత్రాన్ని అనుసరిస్తున్నాయి. పార్టీకి ఎన్నికల్లో సహకరించిన వాళ్ళు, మంత్రి పదవి రాని వాళ్ళు, అంబానీల, ఆదానీల రికమండేషన్స్ ఉన్న వాళ్లను చైర్మన్లు గాను, టీటీడీ బోర్డు మెంబర్లు గాను వేస్తున్నారు. వీళ్లంతా తిరుమలను వాళ్ల వ్యాపార సంబంధాల కోసం వాడుకుంటున్నారు. అంతకుమించి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉపయోగం ఎక్కడ కనిపించడం లేదు.

అందరి దేవుడు గా మన్ననలు అందుకునే వెంకటేశ్వర స్వామి
ఎమ్మెల్యేలకు, మంత్రులకు, బిజినెస్ మాన్ లకు, జడ్జిలకు, ఐఏఎస్ ఐపీఎస్ లకు, మీడియా వాళ్లకు మాత్రమే ఎక్కువగా అందుబాటులో ఉంటాడు. ఒక ఎమ్మెల్యే, మంత్రి గారి లేఖ పై రోజుకి ఆరుగురు భక్తులకి విఐపి దర్శనం లభిస్తుంది. ముఖ్యమంత్రి , గవర్నర్ కార్యాలయం రోజుకి ఎంతమంది నైనా దర్శనాలకు పంపొచ్చు. జగన్మోహన్ రెడ్డి హయాంలోని అయితే మంత్రులు ఎమ్మెల్యేలు తిరుమలలో చెలరేగిపోయారు . పెద్దిరెడ్డి అనే మంత్రి ఒక్కరోజు 52 మందిని వీఐపీ దర్శనానికి పంపించి రికార్డు స్థాపించాడు. ఇక మాజీ మంత్రి రోజా కొండమీద వేసిన చిల్లర వేషాలు అన్ని ఇన్ని కావు. తన అధికార బలాన్ని ఉపయోగించి బృందాలు బృందాలుగా వెంకన్నకు విఐపి దర్శనాలు చేయించి తరించింది రోజా. చివరికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుమలను కూడా చంద్రబాబు తన ప్రచార అస్త్రంగా వాడేసుకున్నాడు. ఇప్పుడు ఏదో కల్తీ నెయ్యి వలన తిరుమల అపవిత్రమైపోయిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుండెలు బాధ కుంటున్నారు. తిరుమల ఎప్పుడో అపవిత్రమైంది. తిరుమల ఎప్పుడో బ్రష్టు పట్టిపోయింది. తిరుమల కొండపై డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా చూస్తారు. తిరుమల కొండపై అధికారం ఉన్నవారిని ఒకలాగా, అధికారం లేనివాడిని ఇంకోలా చూస్తారు. విఐపి దర్శనం లెటర్ ఉన్నవాడిని ఒకలాగా, లేని సామాన్య భక్తున్ని మరోలాగా చూస్తారు . ఇది కల్తీ కాదా? ఇది పొరపాటు కాదా?
డబ్బులు ఖర్చు పెడితే శ్రీవాణి దర్శనం ఇస్తారు. డబ్బు లేకపోతే సర్వదర్శనానికి రమ్మంటారు. ఈ విభజనలన్నీ వెంకటేశ్వర స్వామి పెట్టాడా? తిరుమల కొండ అంటేనే అవినీతికి ,అక్రమాలకు పెద్ద అడ్డ. ఇప్పుడు నెయ్యి గురించి మాట్లాడుతున్నారు…. కానీ భక్తులకు పెట్టే అన్ని ప్రసాదాల్లోనూ, భోజనాల్లోనూ, చివరికి పువ్వుల్లోనూ అక్కడ అవినీతి తాండవిస్తూనే ఉంటుంది. దాని వెనక రాజకీయ పార్టీలు ఎమ్మెల్యేలు, మంత్రులు నూటికి నూరు శాతం ఉంటారు. అందువలన సంప్రోక్షణ చేయాల్సింది గుడికి కాదు. టీటీడీ బోర్డుకి. మహా శాంతి యాగం చేయాల్సింది వెంకన్నకు కాదు అధికార పార్టీకి. తిరుమల బ్రష్టు పట్టిపోయిందని సామాన్య జనానికి కూడా తెలుసు. అయినా మనకెందుకులే మనకి దేవుడు, దర్శనం ముఖ్యం అని తలదించుకొని కొండ కెళ్ళి ,నోరు మూసుకొని కిందకు వస్తున్నారు.