Siddarth Luthra: చంద్రబాబు లాయర్ ట్వీట్లపై రాజకీయ దుమారం
లాయర్ సిద్థార్థ్ లూథ్రా కామెంట్స్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.

Political uproar is raging over Chandrababu's lawyer Siddharth Luthra's comments
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తరఫున వాదిస్తున్న సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ లూథ్రా చేస్తున్న వరుస ట్వీట్లతో రాజకీయ దుమారం రేగుతోంది. ‘‘అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైంది. పోరాటమే శరణ్యం’’ అంటూ ట్విట్టర్ లో ఆయన చేసిన పోస్ట్ పై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్… మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ కు రాసిన ‘జఫర్ నామా’లోని సూక్తి ఆధారంగా లాయర్ లూథ్రా ఈ ట్వీట్ చేశారు. ‘ఇన్ ద సర్వీస్ ఆఫ్ గురు గోవింద్‌జీ’ పేరుతో నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ సూక్తిని తన ట్వీట్ లో ఆయన ట్యాగ్ చేశారు. ఈ పోస్టుకు ‘నేటి సూక్తి’ అని లూథ్రా క్యాప్షన్ పెట్టారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు అరెస్టయిన వెంటనే.. నారా ఫ్యామిలీ పిలుపుమేరకు ఢిల్లీ నుంచి విజయవాడకు వచ్చిన ఆయన ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నారు. ఏపీ సీఐడీ చంద్రబాబుపై నమోదు చేసిన రిమాండ్ రిపోర్టును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేేసిన క్వాష్ పిటిషన్ పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారాని(సెప్టెంబరు 19)కి వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లోనే ఉండాలని, సీఐడీ కస్టడీకి అప్పగించకూడదని న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు నుంచి ఈ ఆదేశాలు వెలువడిన వెంటనే (సెప్టెంబరు 13న మధ్యాహ్నం 12 గంటలకు) .. ‘‘అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపు మేరలో కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైంది. పోరాటమే శరణ్యం’’ అంటూ లూథ్రా ట్వీట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ తర్వాత లూధ్రా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిసి 40 నిమిషాల పాటు మంతనాలు జరిపారు.
వైఎస్సార్ సీపీ ఫైర్..
లూథ్రా ట్వీట్ ను వైఎస్సార్ సీపీ వర్గాలు తప్పుపడుతున్నాయి. ట్విట్టర్ లో ఆయన చేసిన పోస్ట్ హింసను రెచ్చగొట్టేలా ఉందని జగన్ సేన నేతలు మండిపడుతున్నారు. బాబుకు వ్యతిరేకంగా కోర్టుల్లో వస్తున్న తీర్పులను జీర్ణించుకోలేకే లాయర్ లూథ్రా ఈవిధంగా కవ్వింపునకు పాల్పడతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు కేసు పరిణామాలు, రాష్ట్రంలో టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో ఒక ప్రఖ్యాత లాయర్ ఇలా ట్వీట్ చేయడం సరికాదని కొందరు న్యాయవాదులు కూడా విమర్శిస్తున్నారు. ‘‘లూథ్రా ట్వీట్ కచ్చితంగా కవ్వింపు చర్యల కిందికి వస్తుంది. పరోక్షంగా అల్లర్లు చేయండి అని సందేశం ఇస్తున్నట్టుగా అనిపిస్తోంది. న్యాయవాది మాటలతో ఈ కేసు బలం ఏమిటో అర్థమవుతోంది’’ అని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.
గురువారం ఉదయం ఇంకో ట్వీట్..
లాయర్ సిద్ధార్థ లూథ్రా గురువారం ఉదయం మరో ట్వీట్ చేశారు. ‘‘స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అంటారు.. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి. అదేవిధంగా.. న్యాయం, ధర్మంకోసం నిలబడిన సిక్కు గురువు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’’ అని తాజాగా చేసిన ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. లూథ్రా లాంటి దేశంలోనే ప్రముఖ న్యాయవాది చంద్రబాబు కేసును వాదిస్తున్న క్రమంలో ఇలా వరుసగా ట్వీట్లు చేయడం ఏపీ రాజకీయాల్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కాస్ట్లీ లాయర్.. టీడీపీతో అనుబంధం పాతదే
చంద్రబాబు తరఫున వాదించేందుకు సిద్ధార్థ లూథ్రాను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గన్నవరానికి పిలిపించారు. ఢిల్లీయేతర ప్రాంతాల్లో కేసును వాదించాలంటే ఈయన రోజుకు అక్షరాలా రూ.1.5 కోట్ల ఫీజును తీసుకుంటారు. ప్రత్యేక విమానం, లగ్జరీ కారు, స్టార్ హోటల్ వసతి కూడా ఆయన కల్పిస్తారు. తెలుగుదేశం పార్టీతో సిద్ధార్థ్ లూథ్రాతో అనుబంధం చాలాకాలంగానే ఉంది. అమరావతి భూముల కుంభకోణం కేసును సిద్ధార్ధ లూథ్రానే వాదించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత తరఫున వాదిస్తున్నది కూడా సిద్ధార్ధ్ లూథ్రానే. ఆయన తాజాగా చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా టేకప్ చేశారు.