Dharmana: ధర్మాన Vs ధర్మాన
టైటిల్ ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తుంది కదా.. స్టోరీ కూడా అంతే ఇంట్రస్టింగ్‌గా ఉంది. ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తున్నట్లు సీక్కోలు టాక్.

Dharmana Prasad and Krishna Das War in ycp Sikkolu
ధర్మాన సోదరులు ఇద్దరు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ధర్మాన కృష్ణదాస్ కొంతకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదవిని కోల్పోయారు. ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు మంత్రయ్యారు. కృష్ణదాస్ మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో అసమ్మతిని సరిదిద్దుతున్న ఆయనకు తన నియోజకవర్గం నరసన్నపేటలోనే సెగ తగులుతోంది. అది కూడా తన తమ్ముడు ధర్మాన ప్రసాదరావు నుంచే కావడంతో ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు కృష్ణదాస్. చాపకింద నీరులా అసమ్మతిని సోదరుడే ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గతంలో అన్నదమ్ముల మధ్య దూరం ఉన్నా.. ఇటీవల కాస్త కలసికట్టుగా నడుస్తున్నారు. కానీ ఇప్పుడు మరోసారి చిచ్చు రగిలేలా కనిపిస్తోంది.
ధర్మాన ప్రసాదరావ్ రాజకీయ ప్రస్తానం మొదలైంది నరసన్నపేట నుంచే. అయితే ఆ తర్వాత దాన్ని తన అన్న కృష్ణదాస్‌కు వదిలేసి తాను శ్రీకాకుళం మారిపోయారు. అయితే నరసన్నపేట నేతలంతా ప్రసాదరావ్‌తో టచ్‌లోనే ఉన్నారు. అక్కడ జరుగుతున్న ప్రతి విషయం ప్రసాదరావుకు చేరవేస్తున్నారు. పోలాకి , జలుమూరు , సారవకోట మండలాల కీలక నేతలు దాసన్నకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారట. ముఖ్యంగా ఆయన పెద్ద కుమారుడు, భార్య తీరుపై పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. ఆ సెగ కృష్ణదాస్‌కు గట్టిగానే తగులుతోంది. అసమ్మతి నేతలంతా మంత్రి ధర్మాన ప్రసాదరావుకు టచ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం పార్టీలో చర్చకు దారితీస్తోంది. తన అన్నకు వ్యతిరేకంగా ఏకమవుతున్న నేతలకు సర్దిచెప్పి వారిని దారికి తీసుకురావడం ధర్మాన ప్రసాదరావుకు పెద్ద విషయమేం కాదు. కానీ ఆయన కావాలనే ఆ విషయాన్ని లైట్ తీసుకుంటున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంట గెలిచి రచ్చ గెలవాలని కృష్ణదాస్‌పై సెటైర్లు వేస్తున్నారు. దీంతో సొంత నియోజకవర్గంలో తమ్ముడు ప్రసాద్ జోక్యంపై లోలోన రగిలిపోతున్నారట కృష్ణదాస్.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీని గాడిలో పెట్టాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా కృష్ణదాస్‌పై ఉంది. అయితే ఆయనకు సొంత ఇంట్లోనే సహాయ నిరాకరణ జరుగుతుండటం చర్చకు దారితీస్తోంది. నిజానికి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో అన్నకంటే సీనియర్. ఆయన గతంలో మంత్రిగా చేశారు. అయితే వైసీపీ అదికారంలోకి వచ్చాక ముందు కృష్ణదాస్‌కు అవకాశం ఇచ్చారు జగన్. ఇది ప్రసాదరావుకు ఏ మాత్రం నచ్చలేదు. కానీ పార్టీని కాదని ఏం చేయలేని పరిస్థితి కావడంతో సైలెంట్‌గా ఉండిపోయారు. రెండోసారి తనకు అవకాశం రావడంతో ఆయన తన హవా చూపించడం మొదలుపెట్టారు. అన్నకు ఎర్త్ పెట్టారు. ఆయన్ను ఓడించాలని లేనప్పటికీ మరోసారి తనకు పోటీ రాకుండా ప్రసదరావు జాగ్రత్త పడుతున్నారన్న వాదనలూ ఉన్నాయి. మరి ఈ కొంపలో కుంపటి ధర్మాన ఫ్యామిలీని ఏ దరికి చేరుస్తుందో చూడాల్సి ఉంది.