Women Reservation Bill Effect: మహిళా రిజర్వేషన్ ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో మారిపోనున్న సీన్
మహిళా రిజర్వేషన్ల అంశాన్ని వెలుగులోకి తెచ్చి మోదీ సర్కార్ సంచలనం సృష్టించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాజకీయాలు ఎలా మారనున్నాయో ఇప్పుడు చూద్దాం.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ సోమవారమే ఆమోదముద్ర వేసింది. మంగళవారం మధ్యాహ్నం కొత్త పార్లమెంటు భవనంలో తొలి బిల్లుగా.. మహిళా రిజర్వేషన్ బిల్లునే ప్రవేశపెడతారనే చర్చ జరుగుతోంది. మోడీ సర్కారు కూడా ఈ బిల్లును ఆమోదించే మూడ్ లోనే ఉంది. ఇతర పార్టీలేవీ అభ్యంతరం తెలిపే ఛాన్స్ కూడా లేదు. దీంతో దానికి ఆమోదం అనేది లాంఛనమే. ఈనేపథ్యంలో లోక్ సభలో, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. ఎలాంటి మార్పులు జరుగుతాయి ? మహిళలకు ఎంతమేర ప్రాతినిధ్యం పెరుగుతుంది ? రాజకీయ పార్టీల పాలసీలలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ? అనే అంశాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మరో 100 లోక్ సభ స్థానాలు పెరిగే ఛాన్స్
సూటిగా చెప్పుకోదగిన అంశం ఏమిటంటే.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లలో భాగంగా లోక్ సభలో వారికి 181 స్థానాలను, రాజ్యసభలో 80కిపైగా స్థానాలను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్ సభలో 82 మంది మహిళా ఎంపీలే ఉన్నారు. అంటే కొత్త మరో 100 మంది మహిళలు వచ్చే ఎన్నికల తర్వాత పార్లమెంటులోకి అడుగు పెడతారు. ఈ తరుణంలో లోక్‌సభ స్థానాలను 33శాతం పెంచాలని మోడీ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లోక్‌సభలో 545 స్థానాలు ఉన్నాయి. వీటిని 33శాతం పెంచితే 725కు చేరుతాయి. 2024లో జరగనున్న లోక్ సభ పోల్స్ కల్లా.. లోక్‌సభ స్థానాల పెంపు సాధ్యం కాదు. 2029 ఎన్నికల నాటికి లోకసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రక్రియ, స్థానాల పునర్ వ్యవస్థీకరణ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయి.
తెలంగాణలో క్యాండిడేట్స్ ను కేసీఆర్ మార్చుకోవాల్సిందేనా ?
తెలంగాణలో ప్రస్తుతం 119 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 33 శాతం మహిళా రిజర్వేషన్ లెక్కన 119 నియోజకవర్గాల్లో 40 అసెంబ్లీ స్థానాలను మహిళలకే కేటాయించాలి. 17 పార్లమెంట్ స్థానాల్లో 6 సీట్లను మహిళలకే ఇవ్వాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందితే బీఆర్ఎస్ ఈమేరకు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ ఇప్పటికే అనౌన్స్ చేసిన దానికి పూర్తి భిన్నంగా.. సీట్ల కేటాయింపులు మారిపోతాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎఫెక్ట్ తో బీఆర్ఎస్ దాదాపు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపాల్సి వస్తుంది. అయితే అభ్యర్థులను ప్రకటించని కాంగ్రెస్, బీజేపీలకు.. ఈ పరిణామం ప్లస్ పాయింట్ గా మారే ఛాన్స్ ఉంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించనున్నారనే దానిపై ముందస్తు సమాచారం ఉన్నందు వల్లే.. బీజేపీ, కాంగ్రెస్ లు అసెంబ్లీ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదనేది టాక్ వినిపిస్తోంది. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్ సభ సీట్లు ఉన్నాయి. మహిళా రిజర్వేషన్ అందుబాటులోకి వస్తే.. 58 అసెంబ్లీ సీట్లను, 8 లోక్ సభ సీీట్లను స్త్రీలకు కేటాయించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో మెజార్టీ స్థానాల్లో పురుషులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిజర్వేషన్ ఎఫెక్ట్ తో ఈ సీన్ మారిపోనుంది.