Revanth Reddy: పొంగులేటి చేరికపై ఖమ్మం కాంగ్రెస్‌లో దుమారం.. రేవంత్ వర్గం అసంతృప్తికి ప్రధాన కారణమేంటి ?
తలుపులు తడుతోంది అవకాశం అని తెలియక తెరవకపోవడం వేరు.. తెలిసి కూడా పంతానికి పోయి తెరవకుండా ఉండడం వేరు. మొదటివారిని దురదృష్టవంతులు అంటారు.. రెండోవారిని దరిద్రులు అంటారు. కాస్త అటు ఇటుగా కాంగ్రెస్ పరిస్థితి ఇలానే ఉంది ఇప్పుడు తెలంగాణలో ! బలం ఉంది.. బలగం ఉంది.. నాయకులు కూడా ఉన్నారు.. కాకపోతే వాళ్లంతా కలిసి లేరు అంతే ! అంత కలిస్తే.. కలిసి అడుగేస్తే ఆ విజయాన్ని ఆపడం ఎన్ని కార్లకు సాధ్యం కాదు అన్నది చాలామంది అభిప్రాయం. కానీ అలా జరగదు. వాళ్లే జరగనివ్వరు కూడా ! పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కాంగ్రెస్‌లో చేరబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు హస్తం పార్టీ గురించి జనాల్లో జరుగుతున్న చర్చ ఇదే.
ఈ నెల 30న ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో పొంగులేటితో పాటు జూపల్లి కూడా కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాహుల్ టీమ్ పొంగులేటితో ప్రత్యేకంగా భేటీ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన ప్రతిపాదనలకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని.. అందుకే పొంగులేటి పార్టీలో చేరేందుకు అంగీకరించారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయ్. ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ముఖ్యంగా ఖమ్మం పార్టీల రచ్చ రేపుతోంది. పొంగులేటిని తీసుకొచ్చేందుకు ఓ వైపు రేవంత్ ప్రయత్నాలు చేస్తుంటే.. ఆయన వర్గం నేతలు మాత్రం కారాలు మిరియాలు నూరుతున్నారు. బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెస్ తరఫున పొంగులేటితో ఎవరూ చర్చలు జరపలేదని.. ఎవరైనా జిల్లాలో ఉన్న 10సీట్లు అడుగుతారా అంటూ.. పొంగులేటిని టార్గెట్ చేస్తూ రేణుకా చౌదరి చేసిన కామెంట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త రగడ క్రియేట్ చేస్తున్నాయ్. నిజానికి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పొంగులేటికి భారీ అనుచరగణం ఉంది. జిల్లా మొత్తం తన వాళ్లను గెలిపించుకు తీరుతానని సస్పెన్షన్ తర్వాత.. బీఆర్ఎస్‌కు సవాల్ విసిరారు. అందుకే తాను ఏ పార్టీలో చేరాలన్నా.. తన మనుషులకు, తాను చెప్పిన మనుషులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నారు పొంగులేటి.
ఈ డిమాండే జిల్లా కాంగ్రెస్ నేతలను టెన్షన్ పెడుతోంది ఇప్పుడు ! పదికి పది స్థానాలు పొంగులేటి చేతిలో పెడితే.. తమ పరిస్థితి ఏంటి, తమ భవిష్యత్ ఏంటి అని వాళ్లకు బెంగపట్టుకుంది. జిల్లా మొత్తం పొంగులేటి హవా నడిస్తే.. తమను పట్టించుకునేది ఎవరనే టెన్షన్ మొదలైంది. దీంతో పొంగులేటి చేరికను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేణుకచౌదరి మాత్రమే బయటకు వినిపిస్తున్నారు.. తెరవెనక పొంగులేటికి వ్యతిరేకంగా ఏకం అవుతున్న కాంగ్రెస్ గొంతులు ఇంకా చాలానే ఉన్నాయన్నది జిల్లాలో ఓపెన్ సీక్రెట్.
ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు కూడా గెలవకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నెగ్గేందుకు కచ్చితంగా తగ్గాల్సిన పరిస్థితి హస్తానిది ! మారడం తప్పు అయితే.. అప్పుడప్పుడు ఆ తప్పు చేయక తప్పదు. లేదంటే ఉనికే లేకుండా పోతుంది. మరి కాంగ్రెస్ నేతలు మారతాయా.. ఈగోలు పక్కనపెట్టి, భయాలు వెనక్కి నెట్టి.. బలాలను ఆహ్వానిస్తారా అంటే.. అంత ఈజీగా అయితే వాళ్లను కాంగ్రెస్సోళ్లు ఎందుకంటార్రా బాబు !