Ponguleti Srinivas Reddy: పొంగులేటికి భారీ షాక్‌.. సొంత నేత బీఆర్ఎస్‌లోకి జంప్‌

ఖమ్మం సభతో తన రేంజ్‌ ఏంటో.. స్టామినా ఏంటో పరిచయం చేసిన పొంగులేటి.. బీఆర్ఎస్‌కు చుక్కలు చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు.. మొదటిసారి రివర్స్ షాక్ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 16, 2023 | 02:18 PMLast Updated on: Aug 16, 2023 | 2:18 PM

Ponguleti Srinivas Reddys Follower Tellam Venkatrav Is Trying To Get Back Into Brs

బీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చి.. గులాబీ పార్టీ అంతుచూడాలని కసితో రగిలిపోతున్న పొంగులేటి.. ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. ఖమ్మం ఖిల్లాలో కారు పార్టీకి ఒక్క సీటు కూడా రానివ్వనని ప్రతిజ్ఞ చేసిన పొంగులేటి.. కాంగ్రెస్‌లో చేరి.. ఎన్నికల కోసం పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం సభతో తన రేంజ్‌ ఏంటో.. స్టామినా ఏంటో పరిచయం చేసిన పొంగులేటి.. బీఆర్ఎస్‌కు చుక్కలు చూపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న ఆయనకు.. మొదటిసారి రివర్స్ షాక్ తగిలింది. పొంగులేటితో పాటు బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్ గూటికి వచ్చిన తెల్లం వెంకట్రావు.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే చేరుతున్నట్లు తెలిసింది.

ఆయన భద్రాచలం సీటు ఆశిస్తున్నారు. ఐతే అక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఉన్నారు. ఆయనను కాదని భద్రాచలం సీటు తెల్లంకు దక్కే ఛాన్స్ లేదు. దీంతో మళ్లీ ఆయన బీఆర్ఎస్‌ గూటికి చేరాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో పొంగులేటితో పాటు తెల్లం వైసీపీలో పనిచేశారు. పొంగులేటి ఖమ్మం ఎంపీగా గెలిస్తే.. మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి తెల్లం ఓడిపోయారు. తర్వాత పొంగులేటితో కలిసి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. 2018ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భద్రాచలంలో పోటీ చేసి.. ఇదే పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు.

ఆ తర్వాత కూడా భద్రాచలం బీఆర్ఎస్‌ ఇంచార్జిగా పనిచేస్తూ వచ్చారు. ఎప్పుడైతే పొంగులేటి బీఆర్ఎస్‌కు దూరం అయ్యారో.. అప్పటినుంచి తెల్లం కూడా కారు పార్టీకి దూరం జరిగారు. ఖమ్మం సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటితో పాటు తెల్లం కూడా కాంగ్రెస్‌లో చేరారు. భద్రాచలం టికెట్ మీద ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు. ఐతే పొదెం వీరయ్యను కాదని.. తెల్లంకు అవకాశం ఇవ్వడం అసాధ్యం. అందుకే ఆయన దారి ఆయన వెతుక్కున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తున్న పొంగులేటికి.. రైడ్‌హ్యాండ్‌లాంటి తెల్లం దూరం కావడం.. బీఆర్ఎస్‌లోకి జంప్ కొట్టడం అంటే.. భారీ షాక్ అనే చెప్పాలి.