Popular Survey: తెలంగాణ కాంగ్రెస్‌లో పాపులర్ సర్వే.. సీనియర్ నేతల్లో టెన్షన్ టెన్షన్..
మరికొన్ని రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించబోతోంది.
తెలంగాణ రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ త్వరలో అనౌన్స్ చేయబోతోంది. ఫైనల్ లిస్ట్ ఢిల్లీకి చేరిపోయింది దాదాపుగా. ఇంకొన్ని రోజుల్లోనే తమ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించబోతోంది. ఈ టిక్కెట్లపై సీనియర్ నాయకులు చాలా ఆశలు పెట్టుకున్నారు. తమతో పాటు తమ వారసులకు టికెట్ ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఐతే కాంగ్రెస్ మాత్రం గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని.. ఈ విషయంలో ఎటువంటి మొహమాటలకు వెళ్లొద్దని డిసైడ్ అయింది. ఈ మేరకు కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీం రంగంలోకి దిగింది. నియోజకవర్గాల వారీగా గెలిచే అవకాశం ఉన్న నాయకులను గుర్తించింది.
పార్టీ సీనియర్ నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నా.. చాలా నియోజకవర్గాల్లో సీనియర్ నాయకులు గెలిచే అవకాశం లేదనే విషయాన్ని కనుగోలు బృందం గుర్తించింది. దీంతో సీనియారిటీ ఉన్నా సరే.. కీలక నాయకులైనా సరే.. గెలిచే అవకాశం లేకపోతే పక్కన పెట్టాలని సూచించింది. ఈ మేరకు సునీల్ కానుగోలు టీమ్ పాపులర్ సర్వే చేపట్టింది. ఈ సర్వే నివేదిక ఆధారంగానే టికెట్లు కేటాయించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించుకుంది. ఇక రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేపట్టిన మరో సర్వే నివేదికతో.. సునీల్ రిపోర్టును పోల్చుకుంటూ అభ్యర్థులను ఖరారు చేసే పనులు ఏఐసీసీ బిజీగా ఉంది. టికెట్లు ఆశిస్తున్న సీనియర్ల ముందు.. ఆ నివేదికలకు పెట్టి వారి విజయ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే విషయాన్ని వారి ముందే తేల్చాలని నిర్ణయించుకున్నారట.
నిజానికి ఆదివారం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగాల్సి ఉండగా.. దాన్ని ఈనెల 6 కి వాయిదా వేశారు. ఈ కమిటీ సమావేశం తర్వాతే.. అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం సునీల్ కనుగోలు టీం చేపడుతున్న పాపులర్ సర్వే నివేదికలు సీనియర్ నాయకుల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయ్. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న వారికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ హై కమాండ్ కూడా భావిస్తుండడంతో.. ఎలాంటి సిఫార్సులకు అవకాశం ఉండదని విషయం అర్థం అయింది. దీంతో ఇన్నాళ్లు సీనియారిటీ పేరు చెప్పుకొని చక్రం తిప్పిన నేతల గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్లు అవుతుందనే టాక్ వినిపిస్తోంది.